KCR కామెంట్ చేసిన రోజునే తొలి మోసం జరిగింది: కోదండరాం

by GSrikanth |
KCR కామెంట్ చేసిన రోజునే తొలి మోసం జరిగింది: కోదండరాం
X

ప్రజల త్యాగాలు, విద్యార్థులు, యువకుల ఆత్మబలిదానాలతో పెనవేసుకున్న బంధం 'తెలంగాణ'! 1996-2001 మధ్య జరిగిన చర్చలు, డిక్లరేషన్లు, సంఘర్షణల మధ్య జరిగిన ఉద్యమకార్యాచరణ బ్లూ ప్రింట్ అది. కేసీఆర్‌ను నేతగా ఎదగనిచ్చిన నినాదం ' జై తెలంగాణ' ఆయన కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టింది తెలంగాణ.! అంతటి మహత్తర శక్తి కలిగిన తెలంగాణను తెరమరుగు చేశారు. కేసీఆర్ బట్టలు మార్చుకున్నంత ఈజీగా 'తెలంగాణ'ను వదిలించుకున్నరు. రాష్ట్రం ఏర్పడిన ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. పార్టీ గ్రాఫ్​ డౌన్ అయ్యింది.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ పేరుతో కొత్త పల్లవి అందుకున్నారు"అని నాటి టీజేఏసీ రథ సారథి, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు, తాజా రాజకీయ పరిణామాలపై ఆయన దిశకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ విశేషాలు..

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అనే పదం యాదృచ్ఛికంగా వచ్చింది కాదు.. కేసీఆర్ ను ఒక రాజకీయ పార్టీకి నేతగా చేసింది.. ఆ ఫ్యామిలీకి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది తెలంగాణ ఉద్యమమే. తమది 'ఫక్తు రాజకీయ పార్టీ' అని కేసీఆర్ కామెంట్ చేసిన రోజునే తొలి మోసం జరిగింది. బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయికి విస్తరించాలన్న కేసీఆర్ ఆలోచన ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారమే. అయినా తెలంగాణ అమరులను విస్మరించడం ముమ్మాటికీ మోసమే.."అని తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆయన 'దిశ'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు.

దిశ: కేసీఆర్ రాజకీయ జీవితంతో తెలంగాణకున్న బంధమేంటి?

కోదండరాం: తెలంగాణ పదం యాదృఛ్చికంగా వచ్చింది కాదు. యావన్మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. విముక్తి బాట. టీఆర్ఎస్ అనే పార్టీ ఉనికిలోకి రావడానికి కారణమే 1996-2001 మధ్య జరిగిన చర్చలు, డిక్లరేషన్‌లు, ఆలోచనల సంఘర్షణలు, ప్రజా సంఘాల ఏర్పాటు, ఉద్యమ కార్యాచరణ బ్లూప్రింట్ లాంటివి. కేసీఆర్‌ను రాజకీయ నేతగా ఎదిగేలా చేసింది జై తెలంగాణ నినాదమే.

ఇప్పుడు పార్టీ పేరులో ఆ పదం లేదు కదా!

ఉద్యమ ఆకాంక్షలను స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం కేసీఆర్ వాడుకున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశారు. తప్పులమీద తప్పులు చేశారు. ఆ చర్చ జరగొద్దనే ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ నినాదాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. తెలంగాణ వాదాన్ని బలపరిచారని విశ్వసించిన ప్రజలు ఆయనను, పార్టీని భుజాలకెత్తుకున్నారు. అవసరం తీరిన తర్వాత తెలంగాణ పదాన్ని వదిలించుకున్నారు. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడమే.

తొలిమోసం జరిగిందెప్పుడు?

మాది 'ఫక్తు రాజకీయ పార్టీ' అని కామెంట్ చేసిన రోజే తొలి మోసం జరిగింది. రాష్ట్రంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ నిజం. అమరుల త్యాగాల పునాదులపై రాష్ట్రం ఏర్పడింది. కానీ ఆ అమరుల కుటుంబాలను టీఆర్ఎస్ పక్కనపెట్టింది. ఉద్యమకారుల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయాలని అడిగినా ప్రయోజనం లేకపోయింది. ఉద్యమకారుల పేరుతో అధికారంలోకి వచ్చారు. ఉద్యమం, ఆకాంక్షలు అవసరం లేదనుకున్నారు. చివరకు దుస్తులు మార్చినంత సులువుగా తెలంగాణ పదాన్ని వదిలించుకున్నారు.

ఉద్యమకారుల పరిస్థితి ఏమిటి?

తెలంగాణ ఉద్యమకారులకు గడచిన ఎనిమిదేళ్లలో గౌరవం, ప్రాధాన్యం లభించలేదు. ఉద్యమ వ్యతిరేకులకు, ద్రోహులకు ప్రాధాన్యం లభిస్తున్నది. ద్రోహుల్ని కేసీఆర్ తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. కీలక పదవులను కట్టబెట్టారు.

ఇప్పుడు తెలంగాణ ప్రజల కర్తవ్యమేంటి?

తెలంగాణ ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కేసీఆర్‌కు ఉద్యమకారులు, ప్రజలు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది రాజకీయాలు, వాటి ద్వారా ఒనగూరే స్వార్థ ప్రయోజనాలే. తెలంగాణ అస్తిత్వాన్ని మనమే నిలబెట్టుకోవాలి. ఆ వెలుగులో భవిష్యత్తును మనమే నిర్ణయించుకుందాం. ఇప్పుడు ఆ ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఉద్యమకారులు ఒకటవుతున్నారు. సదస్సులు జరుగుతున్నాయి.

పేరు మార్పు ప్రభావం ఆ పార్టీపై పడుతుందా?

కచ్చితంగా పడుతుంది. ఆ ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది. ఉద్యమం టైమ్‌లో ఆ పార్టీ మన ఇంటి పార్టీ అనే భావన ఉండేది. అధికారంలోకి వస్తే అంతా మంచే జరుగుతుందని ప్రజలు భావించారు. రెండో టర్ములో పాలనతో ఆ భ్రమలు తొలగిపోయాయి. మరో రకంగా చెప్పాలంటే కేసీఆరే తనకు తానుగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు. ఉద్యమం నుంచి ఈ స్థాయికి ఎదిగి ఇప్పుడు తెలంగాణ పదాన్ని వదిలించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ భాద తెలంగాణ సమాజంలో ఉంది.

జేఏసీ కన్వీనర్‌గా మీరేమనుకుంటున్నారు?

పేరు మార్చుకోవటం ఆ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారం. తెలంగాణ సమాజం కేసీఆర్‌ను గెలిపించింది. కానీ అధికారాన్ని తెలంగాణ కోసం ఉపయోగించలేదు. రాజకీయ స్వార్థానికి, కుటుంబ అవసరాల కోసం వాడుకున్నారు. ఉద్యమమే లేకపోతే, తెలంగాణ నినాదమే లేకపోతే.. ఈ రోజు కేసీఆర్ స్థానమెక్కడ? యువత ఆత్మబలిదానాలను విస్మరించడం కాదా? కానీ ఇప్పుడు సంబంధం లేదని దులుపుకొనిపోతున్నారు.

బీఆర్ఎస్ ఇప్పుడే తెరపైకి ఎందుకొచ్చినట్లు?

గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. ఇప్పటికే మంత్రులను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే బీఆర్ఎస్ డ్రామా తెరమీదకు వచ్చింది. సమాధానం చెప్పలేకనే ఈ తొవ్వ వెతుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed