ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సెన్సేషనల్ ట్విస్ట్.. రంగంలోకి దిగనున్న ఈడీ..?

by Satheesh |   ( Updated:2024-04-03 03:08:23.0  )
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సెన్సేషనల్ ట్విస్ట్.. రంగంలోకి దిగనున్న ఈడీ..?
X

దిశ, క్రైం బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తున్నది. దీంతో పోలీసులే విస్తుపోతున్నారు. ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పోలీసు వాహనాల్లోనే నగదును తరలించినట్టు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్ రావు ఇటీవల కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. ఈ అక్రమంగా తరలించిన డబ్బు వివరాలపై ఆరా తీసేందుకు ఈడీ ఎంటర్ అయ్యే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. లెక్కల్లోకి రాని డబ్బు ఒక చోటు నుండి మరో చోటుకు తరలిపోవడంతో ఇది ఎవరికి చెందిందనేది ఆసక్తికరంగా మారింది.

దీనికి తోడు ఫోన్ ట్యాపింగ్ కోసం అప్పటి అధికార పార్టీ గుట్టుచప్పుడు కాకుండా విదేశాల నుంచి పరికరాలను కొనుగోలు చేసినట్టు ప్రణీత్‌రావు సైతం చెప్పడంతో ఆర్థిక వనరులను హవాలా మార్గంలో సమకూర్చిందెవరనేదీ తేలాల్సి ఉన్నది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేసే అవకాశమున్నదన్నది పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

డబ్బు ఎవరికిచ్చారు..? ఎంత మొత్తంలో..?

ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ అభ్యర్థులు గెలుపొందడానికి ప్రత్యర్థుల వ్యూహాన్ని పసిగట్టడానికి ఫోన్లు ట్యాపింగ్ చేసి తెలుసుకోవడంతో పాటు ప్రజలను ప్రలోభపెట్టడానికి భారీ స్థాయిలో నగదును తరలించారని ఈ కేసులో దర్యాప్తులో పోలీసులకు వెల్లడైంది. టాస్క్‌ఫోర్స్ పోలీసు వాహనాల్లో డబ్బును తరలించినట్టు స్వయంగా రాధాకిషన్‌రావు చెప్పడంతో డబ్బును సమకూర్చినవారి వివరాలు సైతం వెలుగులోకి వచ్చాయి. మరి ఆ డబ్బును ఎవరికి చేరవేశారు..? ఎంత మొత్తంలో ఇచ్చారు..? వీటికి లెక్కలు ఎక్కడున్నాయి..? అనే వివరాలు తేలాల్సి ఉన్నది.

ఎవరి మెడకు..?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. పెద్ద తలలు కేసులు ఎదుర్కోక తప్పదని, అరెస్టు కాక తప్పదంటూ ఓ వైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించగా.. ఈ వ్యవహారంలో కేటీఆర్ చర్లపల్లి జైలులో చిప్ప కూడు తింటాడని ముఖ్యమంత్రి రేవంత్ కామెంట్ చేశారు. అక్రమ నగదు సరఫరా, హవాలా మార్గంలో తరలింపు అంశాలపై ఈడీ దర్యాప్తు చేపడితే అది ఎవరి మెడకు చుట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్‌లోని అంశాలే ఈడీ దర్యాప్తుకు కీలకంగా మారనున్నదనేది పోలీసుల వాదన. ఈడీ ఎంటరైతే బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చిన వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలను సైతం విచారించే చాన్స్ ఉన్నది. రాజకీయంగా వాడుకోడానికే ఫోన్ టాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెరమీదకు తెచ్చిందనే విమర్శలు ఎలా ఉన్నా.. స్వయంగా కేటీఆరే ‘దొంగలవో లంగలవో ఒకటో రెండో ఫోన్లను టాపింగ్ చేసి ఉండొచ్చు..’ అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

రాధాకిషన్‌రావును పోలీసులు కస్టడీలోకి తీసుకోకముందే పది గంటల పాటు ప్రశ్నించిచడంతో అనేక విషయాలు వెలుగులోకి రావడం గమనార్హం. మరిన్ని వివరాల కోసం ఆయనను కస్టడీలోకి తీసుకుంటే నిర్దిష్టంగా కొన్ని ఉదాహరణలతో సహా విషయాలు బయటకు వచ్చే చాన్స్ ఉన్నది. వాటి ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తే డబ్బును సమకూర్చినవారు, దాన్ని అందుకున్నవారు సైతం చిక్కుల్లో పడే అవకాశముంది. ఈ డబ్బుకు మూలాలను వెదకడంపైనే ఈడీ దృష్టి కేంద్రీకరించనున్నది.

హవాలా మార్గం..?

ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియను ప్రభుత్వంతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంచుకున్నందుని, ఈ పనికి అవసరమయ్యే పరికరాలను విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సి రావడంతో హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ డబ్బును హవాలా రూపంలో చేరవేసిన వ్యవహారం వెనక ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నట్టు వార్తలు రావడంతో ఈడీ ఈ విషయంలోనూ లోతుగా శోధించే చాన్స్ ఉన్నది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా బీఆర్ఎస్‌ నేతలతో పాటు ఆర్థిక వనరులను సమకూర్చిన సంపన్నులు సైతం చిక్కుల్లో పడే అవకాశమున్నది. ఫోన్ టాపింగ్‌పై పలువురు పొలిటీషియన్ల నుంచి డీజీపీకి ఫిర్యాదులు వస్తున్నందున భవిష్యత్తు కేసు దర్యాప్తు ఏ టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed