మొదటి గింజకే మోక్షం లేదు..! కడగింజ దాకా కొంటామని ప్రకటనలు..

by Kalyani |
మొదటి గింజకే మోక్షం లేదు..! కడగింజ దాకా కొంటామని ప్రకటనలు..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: అకాల వర్షాల కారణంగా రైతులు కష్టపడి పండించిన వరి పంట కళ్లముందే వర్షార్పణమవుతోంది. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన వరి ధాన్యాన్ని నిల్వ చేసుకునే స్తోమత లేక కల్లాల్లోనే వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పది రోజుల క్రితం కోసిన వరి ధాన్యాన్ని అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం మాత్రం సేకరించడం లేదు. ఫలితంగా అకాల వర్షాలకు తడిసి కల్లాల్లోనే వరి ధాన్యం తిరిగి మొలకెత్తుతోందని రైతులు గుండెలు బాదుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తడిసిన ధాన్యమైన చివరి గింజ వరకు కొంటామంటూ ప్రకటించడంతో విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు. రోజులు గడిచి కోత దశలో ఉన్న వరిచేలను రైతులు హార్వెస్టర్ల ద్వారా కోసి ధాన్యాన్ని కల్లాల్లోనే నిల్వ ఉంచుకుంటున్నారు. అధికారులు గన్ని బ్యాగులను పంపిణీ చేశారు కానీ ఆయా లారీ కాంట్రాక్టు యజమానులను మాత్రం పంపడం లేదు. అధికారికంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెప్తున్నా ప్రజాప్రతినిధులు నేరుగా వచ్చి ఎక్కువ సంఖ్యలో రైతులు ఉన్న సమయంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉందని ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే కొనుగోలు కేంద్రాలు కేవలం అలంకారప్రాయంగానే మారాయని గింజ వడ్లను కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఆయా మండల గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారట. చివరి గింతవరకైనా కొంటామంటూ ప్రకటనలు చేస్తే ప్రజాప్రతినిధులు తమ రాజకీయ లబ్ధి కోసం రైతులు పూర్తిగా నష్టపోవడానికి పరోక్షంగా కారకులవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు, మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొత్తంగా 214 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 20 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం సేకరిస్తున్నారు. ఈ సీజన్ లో మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా అధికారులు కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం 20 సెంటర్లలోనే 1,069 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించారు. మరోపక్క వరి కొనుగోలు ఆలస్యం చేస్తూ రైస్ మిల్లు యాజమానులకు మేలు కలిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు తెరవెనుక నాటకం ప్రదర్శిస్తున్నారని విమర్శలొస్తున్నాయి.

వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు తొందరపాటుకు గురై తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకునేలా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 428 ఎకరాలు వరి 748 ఎకరాలు మామిడి 83 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు అకాల వర్షానికి నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులే ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనికి తోడు ప్రజాప్రతినిధుల రాజకీయ లబ్ధి కోసం, మిల్లర్ల నుంచి నెలసరి ముడుపుల కక్కుర్తి కోసం అధికారుల అలసత్వం కారణంగా వరి రైతులు మరింత నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story