- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వస్తా అని మాటిచ్చి మొఖం చాటేసిన కేసీఆర్.. తీవ్ర నిరాశలో గులాబీ లీడర్లు!
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్‌పై కేడర్‌లో అసంతృప్తి ఉంది. కలిసేందుకు అవకాశం ఇవ్వరనే అపవాదు ఉంది. ఓడిపోయిన తర్వాతనైనా అందుబాటులో ఉంటారని, సమస్యలను తెలుసుకుంటారని భావించిన కేడర్ కు నిరాశే ఎదురవుతున్నది. తెలంగాణ భవన్‌కు వారంలో రెండు రోజులు అందుబాటులో ఉంటానని కేసీఆర్ చెప్పినప్పటికీ.. రావడం లేదు. ఫామ్ హౌజ్‌కే పరిమితమయ్యారు. కేవలం నాలుగైదు నియోజకవర్గాల నేతలతో సమావేశమై చర్చించి ఆ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టారు. త్వరలోనే మళ్లీ కలిసేందుకు నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ ప్రకటిస్తామని పార్టీ వర్గాలు చెప్పినప్పటికీ ఆ ఊసేలేదు. దీంతో పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక కేడర్ ఆందోళన చెందుతున్నారు.
నెలలు గడుస్తున్నా..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ వారంలో రెండు రోజులు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. భవన్‌కు వచ్చే కేడర్‌ను కలుస్తారని, సమస్యలను తెలుసుకుంటారని వెల్లడించారు. అది ప్రకటించి నెలలు గడుస్తున్నా నేటికీ అది కార్యరూపంలోకి దాల్చలేదు. దీంతో క్షేత్రస్థాయి వివరాలు ఎవరికి చెప్పాలో తెలియక నాయకులు ఆందోళనకు గురవుతున్నారు.
సమీక్షలు కరువు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై తెలంగాణ భవన్‌లో పార్లమెంట్ వారీగా సమావేశాలు నిర్వహించి కేడర్ నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీపార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో జూన్ చివరి వారంలో, జూలై మొదటివారంలో నాలుగైదు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో ఓటమిపై కేసీఆర్ భేటీ అయ్యారు. నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట నియోజకవర్గాలతోపాటు మరికొన్ని సెగ్మెంట్ల నేతలతో పలు అంశాలు సేకరించారు. ఆతర్వాత ఆరోగ్యం సహకరించడం లేదని, ఎవరు పడితే వారు రావద్దని, నియోజకవర్గాల వారీగా సమాచారం ఇస్తామని, వారు మాత్రమే వచ్చి కలువాలని సూచించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎవరికీ, ఎలాంటి ఇవ్వలేదు. సమస్యలను చెప్పుకుందామని, క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు అనుసరిస్తున్న విధానాన్ని కేసీఆర్ కు వివరిద్ధామని భావించిన వారికి నిరాశే ఎదురైంది. పార్టీని తిరిగి గాడిలో పెడతారని, స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బలోపేతం చేస్తారని భావించినవారికి భంగపాటే మిగిలింది.
ఫాం హౌజ్‌కే పరిమితం
పార్టీ అధినేత కేసీఆర్ ఫాం హౌజ్‌కే పరిమితమయ్యారు. కలుద్దామని వెళ్లిన కార్యకర్తలకు సైతం అందుబాటులో రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది కీలక నేతలకే మాత్రమే అపాయింట్ దొరుకుతున్నదని, అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు అలాగే ఉందని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఓటమితోనైనా మారుతారని భావించినప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఆరోపిస్తున్నారు. బడ్జెట్ కు ముందు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి, ఆతర్వాత బడ్జెట్ రోజూ మాత్రమే ఫాం హౌజ్ నుంచి వచ్చారు. ఆతర్వాత మళ్లీ ఫాం హౌజ్‌కు పరిమితమయ్యారనే విమర్శలున్నాయి. కనీసం కేడర్ లో జోష్ నింపే పార్టీ ప్రణాళికలు సైతం లేకపోవడం, అందుబాటులోకి రాకపోవడంతో పార్టీ నేతలంతా నైరాశ్యంలో ఉన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజేపీలు రెండు తెలంగాణలో ప్రజల మధ్యకు వెళ్తుండగా బీఆర్ఎస్ మాత్రం కౌంటర్లకు మాత్రమే పరిమితమైందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
గజ్వేల్‌లోనూ ప్రజల నిరసనలు
కేసీఆర్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గంలో అర్హులకు ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు తరచూ నిరసనలు చేపడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ ఫాం హౌజ్ వద్ద సైతం నిరసన కూడా తెలిపారు. అయినా కేసీఆర్ నుంచి స్పందన రాకపోవడంతో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు. మరోవైపు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని పలువురు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ మౌలిక సమస్యలపై స్పందన కరువైందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.