- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీన్ రివర్స్.. బీజేపీ ఆశలు గల్లంతు
దిశ, తెలంగాణ బ్యూరో : మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. అధికారికంగా ప్రకటించిన తొమ్మిది రౌండ్లలో టీఆర్ఎస్‌కే ఆధిక్యం ఉన్నది. తొమ్మిది రౌండ్లలో మొత్తం 1,42,609 ఓట్లను లెక్కించగా అందులో టీఆర్ఎస్‌కు 59,860 వచ్చాయి. బీజేపీ 55,908 ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. సిట్టింగ్ స్థానమైనప్పటికీ కాంగ్రెస్ మాత్రం 16,280 ఓట్లే పొందగలిగింది. మూడో స్థానమైనా డిపాజిట్ రావడం అనుమానమే. బీజేపీకంటే టీఆర్ఎస్ 3,952 ఓట్ల తేడాతో ముందున్నది. రెండవ, మూడవ రౌండ్‌లలో మినహా మిగిలిన అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిపత్యమే కొనసాగింది. 10, 11 రౌండ్ల కౌంటింగ్ పూర్తయినా ఎన్నికల కమిషన్ ఆ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు.
సగానికిపైగా ఓట్ల లెక్కింపు పూర్తికావడంతో ఇక గెలుపు ఖాయమని టీఆర్ఎస్ భావిస్తున్నది. ఓటమి తప్పదని బీజేపీకి కూడా అర్థమైపోయింది. మిగిలిన నాలుగు రౌండ్లలో ఏదేని అద్భుతం జరిగితే తప్ప ఇక విజయం సాధ్యం కాదనే భావనకు వచ్చింది. ఇప్పటికే అసెంబ్లీలో ట్రిపుల్ ఆర్ (రాజాసింగ్, రఘునందన్‌రావు, రాజేందర్ ఈటల)కు తోడుగా నాల్గవ ఆర్‌గా రాజగోపాల్ రెడ్డి వస్తారని ఆ పార్టీ కొండంత ధీమాతో ఉన్నది. సిట్టింగ్ స్థానానికి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోవాల్సి వచ్చింది. మునుగోడులో గెలుపుతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం ఇంకొకటి పెరిగినట్లయింది. కాంగ్రెస్‌కు చెందిన స్థానం గులాబీ పార్టీ వశమైంది.
బీజేపీ ఆశలు పెట్టుకున్న చౌటుప్పల్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాలురాలేదు. చివరి గంటల్లో జరిగిన చండూరు పోలింగ్‌లో ఓటర్లు ఎవరివైపు అనేది కూడా తేలిపోయింది. టీఆర్ఎస్‌వైపే ఉన్నట్లు స్పష్టమైంది. 2018 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అనంతరం ఇప్పటివరకు ఐదు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే అందులో టీఆర్ఎస్, బీజేపీలు చెరి రెండు గెల్చుకున్నాయి. ఇప్పుడు మునుగోడు కూడా టీఆర్ఎస్ వశం కానుండడంతో మూడు దాని ఖాతాలో పడినట్లయింది. మొత్తం ఐదుచోట్లా కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోలేకపోయింది. ఒకటి రెండుచోట్ల మినహా అన్ని స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో కొనసాగుతున్న సమయంలోనే పోలింగ్, కౌంటింగ్ పూర్తయింది. కాంగ్రెస్ ఊహించనంత ఘోరంగా ఓటమి చవిచూసింది.
ప్రతీ రౌండ్‌కూ ఉత్కంఠ
తొలి నాలుగు రౌండ్లు చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్లు కావడంతో భారీ మెజారిటీ వస్తుందని బీజేపీ ఆశలు పెట్టుకున్నది. కానీ రెండు రౌండ్లలో మాత్రమే వందల్లో మార్జిన్ పొందగలిగింది. ఆ తర్వాత చండూరులో లేట్ పోలింగ్ జరిగినందున, ఎక్కువగా యువత, ఉద్యోగులు ఓటర్లు అయినందున తమకే అనుకూలంగా ఉంటుందని భావించింది. అయినా ఆ మండలం ఓట్లు కూడా టీఆర్ఎస్ పార్టీకే అనుకూలంగా మారాయి. ప్రతీ రౌండ్‌లో మెజారిటీ వస్తుందేమోనని పెట్టుకున్న బీజేపీ ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి. టీఆర్ఎస్ సైతం భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నా అది వందల ఓట్లకే పరిమితమైంది. ప్రతీ రౌండ్ రెండు ప్రధాన పార్టీలకు ఉత్కంఠగా మారింది. చండూరు ఓట్ల లెక్కింపు తర్వాత ఇక టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, బీజేపీ ఓటమి తప్పదనే అంచనా ఏర్పడింది. 11వ రౌండ్ నుంచి ఉత్కంఠ తొలగిపోయింది.
మరో నాలుగు రౌండ్ల కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉండడంతో హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మాత్రం అలాంటి సందడి లేకుండా పోయింది. నిజానికి జీహెచ్ఎంసీ పరిధిలోని కొద్దిమంది కార్పొరేటర్లు బీజేపీ గెలుపు ఖాయమనే అంచనాతో బాణసంచాను, స్వీట్లను సిద్ధం చేసి పెట్టుకున్నారు. కానీ ఫలితాలు తారుమారై అంచనాలు తలకిందులు కావడంతో నిశ్శబ్ద వాతావరణమే నెలకొన్నది. బీజేపీ హెడ్ క్వార్టర్ నుంచి కొద్దిసేపటి క్రితమే స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ బైటకు వెళ్ళిపోయారు.
Read more :