- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘పోడు’ పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. ‘గృహలక్ష్మీ’ ఎప్పుడంటే?
దిశ, తెలంగాణ బ్యూరో : ఇప్పటికే పలు వర్గాలవారికి వరాల జల్లు కురిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములకు పట్టాల పంపిణీ ప్రక్రియకు కూడా ముహూర్తాన్ని ఖరారు చేశారు. వచ్చే నెల 24 నుంచి 30 తేదీల మధ్యలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్వయంగా తానే పట్టాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. పట్టాలు పొందిన ఆదివాసీ రైతులకు రుణబంధును కూడా అందించనున్నట్లు స్పష్టం చేశారు.
నేరుగా వారి ఖాతాల్లోనే ఆ డబ్బు జమ అవుతుందన్నారు. సచివాలయంలో మంగళవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో జరిపిన సమీక్షా సమావేశం సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 14న జాతీయ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నగరంలోని నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో నూతన భవనానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. సొంత జాగ ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందించే స్కీమ్‌ను జూలైలో ప్రారంభించనున్నామన్నారు.
కొత్తగా పోడు పట్టాలు పొందే గిరిజనుల వివరాలను సేకరించి రైతుబంధు వర్తింపచేయాల్సిందిగా వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్నవారితో పాటు ఇప్పుడు కొత్తగా పోడు పట్టాలు అందుకుంటున్న గిరిజన లబ్ధిదారుల వివరాలను కూడా క్రోడీకరించి వీరికి కూడా రైతుబంధు అందించాలని సూచించారు. ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్‌ను తెరిపించి యాజమానులకు నేరుగా ఖాతాల్లో రైతుబంధు డబ్బును జమచేస్తుందన్నారు. ఆదివాసీ రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ అధికారులకు అందజేయాలని, చొరవ తీసుకోవాలంటూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఆదేశించారు.
జూలైలో ‘గృహలక్ష్మి’ పథకం
సొంత జాగ ఉన్నవారికి ఇల్లు కట్టుకోడానికి ప్రభుత్వం రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించే ‘గృహలక్ష్మి’ పథకంపైనా ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ స్కీమ్ అమలుకు అవసరమైన మార్గదర్శకాలను వీలైనంత తొందరగా తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3 వేల ఇండ్లకు సాయం అందించేలా రాష్ట్రం మొత్తం మీద సంవత్సరానికి 4 లక్షల మందికి లబ్ధి చేకూరాలని ప్రభుత్వం గతంలో స్పష్టత ఇచ్చింది. ఈ ఇండ్లలో 50వేలను ముఖ్యమంత్రి స్పెషల్ కోటా కింద రిజర్వు చేసింది. నిర్వాసితులు, ప్రమాద బాధితుల కుటుంబాలకు వర్తింపజేసే ఉద్దేశంతో వీటిని ప్రత్యేక కోటా కింద చేర్చింది. అధికారులు రూపొందించే మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే ఈ స్కీమ్ అమలుపై మరింత స్పష్టత రానున్నది.
జూలై నుంచి దళితబంధు...
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా ప్రారంభమైన దళితబంధు స్కీమ్‌ను జూలై నెల నుంచి కంటిన్యూ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని నొక్కిచెప్పారు. గతేడాది రూ. 17,700 కోట్లను లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఒక్కరికి కూడా సాయాన్ని విడుదల చేయలేదు. ఈ సంవత్సరం కూడా బడ్జెట్‌లో ఇంతే మొత్తాన్ని కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు దానిపై ఆసక్తి చూపలేదు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజుల్లో ఒక రోజును ‘దళితబంధు డే’గా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం ఆ స్కీమ్‌ను మళ్లీ గాడిన పెట్టడానికి జూలైలో ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది.
‘నిమ్స్’ భవనానికి భూమిపూజ..
‘వైద్య ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా జూన్ 14న నగరంలోని ‘నిమ్స్’ ఆస్పత్రి విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించనున్న కొత్త భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ నిర్వహించనున్నారు. రెండు వేల పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవన నిర్మాణం ప్రాధాన్యతపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇందుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. అలాగే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని భావించిన కేసీఆర్ ఇందుకు తగిన ఏర్పాట్లు, కార్యాచరణపై మూడు రోజులుగా పలు శాఖల ఉన్నతాధికారులతో వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
దీనికి కొనసాగింపుగా ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సమావేశంలో మంత్రులు, ఎస్పీలు కూడా పాల్గొంటారు. అన్ని జిల్లాల్లో వివిధ పథకాల లబ్ధిదారులను, ప్రజలను వేడుకల్లో భాగస్వాములను చేయాలని, చెరువు కట్టలపై ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. వీటన్నింటిపై కలెక్టర్లకు ఈ కాన్ఫరెన్సులో ఆదేశాలు జారీ చేయనున్నారు. దీంతోపాటు గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి వారి ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేయనున్నారు.