Telangana: విద్యా కమిషన్ దృష్టి పెట్టే అంశాలివే

by Gantepaka Srikanth |
Telangana: విద్యా కమిషన్ దృష్టి పెట్టే అంశాలివే
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమగ్రమైన విద్యా విధానాన్ని రూపొందించే లక్ష్యంలో భాగంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చైర్‌పర్సన్‌తో పాటు మరో ముగ్గురు ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉండనున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారి దీనికి మెంబర్ సెక్రెటరీగా వ్యవహరిస్తారు. ప్రీ-ప్రైమరీ స్కూల్ స్థాయి మొదలు యూనివర్శిటీ వరకు అనేక కోణాల నుంచి ఉత్తమమైన పాలసీని రూపొందించడం ఈ కమిషన్ ప్రధాన బాధ్యత. ఇందులో భాగంగా విద్యారంగంలో నిపుణులైనవారితో సంప్రదింపులు జరపనున్నది. రెండేండ్ల పాటు పదవీకాలాన్ని ఫిక్స్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సిఫారసులు అమలు చేయవచ్చని సూచించింది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పడిపోతున్నాయని నేషనల్ ఎచ్చీవ్‌మెంట్ సర్వే వెల్లడించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

యూనివర్శిటీ స్థాయిలో పరిశోధన, నాణ్యత, ప్రావీణ్యం తగ్గిపోతున్నట్లు అనేక పబ్లికేషన్స్, రిపోర్టులు వెల్లడించాయని కమిషన్ ఏర్పాటు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాల్లోని లోపాలు, ఏ కారణంగా ప్రమాణాలు తగ్గిపోతున్నాయో కమిషన్ అధ్యయనం చేసి వాటిని అధిగమించేందుకు, ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థను సమూలంగా పరివర్తన చేసేందుకు ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసి తగిన విధానాలను రూపొందించాలని ఆదేశించింది. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు నైతిక విలువలు (మోరల్ వ్యాల్యూస్), ఫౌండేషన్ స్కిల్స్, ఉపాధి అవకాశాలు, అప్రెంటిస్‌షిప్ తదితరాలను బోధించి వారిని గ్లోబల్ సిటిజెన్‌గా తీర్చిదిద్దడం కమిషన్ రూపొందించాల్సిన ఎడ్యుకేషనల్ పాలసీలో భాగం. సమగ్రమైన విద్యావిధానంలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రూపొందించాలని, మారుతున్న పరిణామాలను పుణికిపుచ్చుకునేలా అందుకోలేకపోతే అది భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నది.

విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ గతంలోనే పేర్కొన్నారు. విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, భవిష్యత్తులో ప్రయోజకులుగా ఎదిగించడం లక్ష్యంగా ఉండాలని కూడా నొక్కిచెప్పారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్ చైర్‌పర్సన్‌గా, సభ్యులుగా ఎవరుంటారనేది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానున్నది. ప్రభుత్వం విద్యా రంగానికి చేసిన కేటాయింపుల నుంచే ఈ కమిషన్ రెండేండ్ల ఫంక్షనింగ్‌కు అవసరమైన జీతభత్యాలు, పర్యటనలు తదితరాలకు నిధులను వినియోగించుకున్నది. అవసరమైతే విద్యాశాఖ నుంచి కొద్దిమంది సిబ్బందిని డిప్యూటేషన్ ప్రాతిపదికన కమిషన్ వినియోగించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

కమిషన్ దృష్టి పెట్టే అంశాలు :

= విద్యారంగంలో నిపుణులైనవారితో సంప్రదింపులు జరిపి అవసరమైన మార్పులు, ప్రవేశపెట్టాల్సిన విధానాలపై చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయాలి.

= పైలట్ స్టడీస్ చేయడంతో పాటు పాలసీ నోట్స్, ఐడియా, సంప్రది,పులు, గైడ్‌లైన్స్, నియమాలు తదితరాలన్నీ జరిగే సమయంలో అవసరమైతే పర్యటనలు చేయాలి.

= ప్రీ-ప్రైమరీ స్థాయి నుంచే విద్యా బోధనలో యూనివర్శలైజేషన్ ఉండాలి.

= విద్యార్థుల మానసిక వికాసానికి దోహదపడేలా నాణ్యమైన ప్రాథమిక విద్యపై దృష్టి పెట్టాలి.

= ఉన్నత విద్యలో అప్రెంటిస్‌షిప్, ఉపాధి అవకాశాలకు తగిన స్కిల్స్, నైతిక విలువల బోధన, అంతిమంగా అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా పిల్లలను తీర్చిదిద్దే పాలసీ రూపొందాలి.

Advertisement

Next Story

Most Viewed