- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో కనుమరుగవుతున్న కమ్యూనిస్టులు.. తప్పెవరిది?
దిశ, భద్రాచలం: కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకూ తగ్గుతోంది. ఒకప్పుడు రాజకీయంగా కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లాను శాసించిన కమ్యూనిస్టులు ఇపుడు ఉనికిపాట్లు పడుతున్నారు. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీచేసి గెలిచే శక్తిలేక ఇతర ప్రధాన పార్టీలను అంటకాగి జనం దృష్టిలో తోకపార్టీలుగా ముద్రపడుతున్నారు. దీన్ని ఎర్రజెండా అభిమానులు ఇది జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీల నిర్ణయాలను కాదనలేక, అలాగని ఏడాదంతా విమర్శించిన పార్టీలతో ఎన్నికల సమయంలో కలిసి మనస్పూర్తిగా పనిచేయలేక కేడర్ మధనపడుతున్నారు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లుగా, కమ్యూనిస్టులు రాజకీయంగా వైఫల్యం చెందడానికి గ్రౌండ్ లెవల్స్‌లో రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. పూర్వపు రోజుల్లో నిఖార్సైన ప్రజా ఉద్యమాలు చేసి తద్వారా పార్టీ సిద్ధాంతాలు తెలియజెప్పి పటిష్టంగా పార్టీ నిర్మించి ప్రజాబలంతో ఎలాంటి ఎన్నికలనైనా సునాయాసంగా ఎదుర్కొని రాజకీయాలను శాసించిన కమ్యూనిస్టులు కాలక్రమేణా తప్పటడుగులు వేసి రాజకీయ తెరపై కనుమరుగవుతున్నారు.
చట్టసభల్లో తమ గళం వినిపించడానికి పదవులు అవసరమంటూ అట్టి పదవుల వ్యామోహంతో భూర్జువా పార్టీలతో జతకట్టి లీడర్, కేడర్‌ను చేజార్చుకొని బొక్కబోర్లా పడ్డారనేది ప్రజాభిప్రాయం. ఇతర పార్టీలతో పొత్తుల అనంతరం కొన్ని కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తల పరిస్థితి ఎలా తయారైందంటే... ప్రజల సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొనేందుకు ఎర్రజెండా చేతపట్టి ఉద్యమాలు చేసి జైకొట్టిన వాళ్లే ఎన్నికలపుడు పోలింగ్‌కు ముందు ఎవరొచ్చి ఏమి ఇస్తారని ఎదురుచూసే పరిస్థితి దాపురించింది. లీడర్లు సైతం ఖర్చుల పేరిట చేతులు చాపుతున్న పరిస్థితి కానవస్తోంది. కొందరైతే మరీ కలక్షన్ల కామ్రేడ్లుగా జనంలో చులకన అవుతున్నారు. నిఖార్సైన కమ్యూనిస్టు మహానేతలు, ఎర్రజెండా కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన నాయకులు సైతం పెడదారి పట్టడం మరింతగా ఆశ్చర్యం కలిగిస్తోంది. తమ కుటుంబాలు బాగుండాలంటే ముందు ఆర్థికంగా బలపడాలనే ఆలోచనలతో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల. నేతలతో జతకట్టి ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంట్రాక్టులు, వ్యాపారాలు చేస్తూ ప్రజాఉద్యమాలకు క్రమేపీ దూరం అవుతున్నారు. ఇసుకర్యాంపులు, మద్యం సిండికేట్‌లు, ఫైనాన్స్, చిట్టీ వ్యాపారాలు, చివరకు వ్యక్తిగత పైరవీలు కమ్యూనిస్టు పార్టీల నాయకులకు మాయనిమచ్చగా కనిపిస్తున్నాయి. ఈ తరహా పనుల వలన నాయకులే కమ్యూనిజాన్ని నవ్వులపాలు చేస్తున్నారనేది పబ్లిక్ టాక్. సంపాదన కోసం ఎర్రజెండా పార్టీల నాయకులు రేసు గుర్రాల్లా పరుగులు తీస్తున్నారు. ఇతర పార్టీల వారితో పోటీపడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. విలాసవంతమైన నాయకుల జీవితాల గురించి కార్యకర్తలు, ప్రజలు బహిరంగంగా మాట్లాడుకొనే పరిస్థితులు నెలకొనడం బాధాకరం.
తప్పెవరిది..?
నాయకుల ఆదాయపు ఆలోచనల మూలంగా దోపిడీ, అన్యాయం, అక్రమాలను ప్రశ్నించే కామ్రేడ్ల గొంతులు మూగబోయాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమ నాయకుల పోకడలను గమనిస్తూ అనుసరిస్తున్న కమ్యూనిస్టు కార్యకర్తలు సైతం ఎన్నికలపుడు పక్కచూపులు చూసే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒకరి తప్పిదాన్ని మరొకరు ప్రశ్నించలేని పరిస్థితి. ఇలాంటి పెడధోరణుల ఫలితంగా కామ్రేడ్లలో సోదరభావం, సమానత్వం తొలగిపోయింది. నాయకులకు, కార్యకర్తలకు నడుమ తెలియని దూరం పెరిగింది. ఈపరిస్థితికి బాధ్యులు ఎవరనేది జవాబు దొరకని ప్రశ్న. లోపాలను సరిచేసుకోలేని కామ్రేడ్ పార్టీల నిర్మాణ లోపమా ? నాయకత్వ నిర్ణయాల వైఫల్యమా ? అనేది ప్రధానంగా జనంలో చర్చనీయాంశమైంది. అయితే ప్రధాన రాజకీయ పార్టీలతో ఎన్నికల పొత్తులు పెట్టుకోనంతకాలం కామ్రేడ్లు నిఖార్సుగానే ఉన్నారనేది జనాభిప్రాయం. గెలిచినా ఓడినా ప్రజల ఆదరణ, గౌరవం ఏమాత్రం తగ్గలేదు. పొత్తుల కారణంగా ప్రధాన పార్టీల లీడర్ల వలలో చిక్కిన తర్వాతే ఆయా పార్టీల పద్ధతులు అలవర్చుకొని లీడర్, కేడర్ సైతం ప్రజాసమస్యలు మరచి సంపాదన వైపు దృష్టి మరల్చడంతో కమ్యూనిస్టుల గ్రాఫ్ క్రమేపీ పడిపోవడం స్టార్ట్ అయిందనే బలమైన ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికీ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి నిఖార్సుగా పనిచేస్తున్న వారికి, కమ్యూనిస్టు ముసుగులో సంపాదనపరులకు నడుమ ఎర్రజెండా పార్టీలలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ అంతర్యుద్ధమే పార్టీ ఎదగలేక పోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనిని పార్టీ నాయకత్వం పట్టించుకునే పరిస్థితిలేదు. కొందరు పెత్తందారీ నాయకులు పార్టీని పూర్తిగా తమకు అనుకూలంగా మలచుకోవడమే గాకుండా అవసరమైతే పార్టీని శాసించే పరిస్థితి చాలా సందర్భాల్లో కనిపిస్తోంది. ఈ నియంతృత్వ ధోరణి కమ్యూనిస్టులకు కోలుకోని నష్టాన్ని కలిగిస్తోందనేది జనాభిప్రాయం. అయితే ఎన్నికల్లో ఓటర్లు అమ్ముడుపోవడం వల్లనే చాకిరీ చేసిన కమ్యూనిస్టులకు ఓట్లు పడటంలేదని కొందరు నాయకులు తమ తప్పిదాలను కప్పిపుచ్చి ప్రజలపై నేరంమోపి సశ్చీలత ప్రదర్శించుకోవడం గమనార్హం. నాయకులు, కార్యకర్తల తీరుని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని మర్చిపోతున్నారు.
ఖరీదైన ఎన్నికలను తట్టుకోలేక..
కమ్యూనిస్టు పార్టీలు రాజకీయ తెరపై క్రమేపి కనుమరుగు కావడానికి స్వయంకృతాపరాధమా లేక ప్రతికూల పరిస్థితుల ప్రభావమా అనే విషయం పక్కన బెడితే నేటి పరిస్థితుల్లో ఖరీదైన ఎన్నికలను తట్టుకోవడం కమ్యూనిస్టులకు భారంగా ఉందని చెప్పక తప్పదు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే కామ్రేడ్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలోనే కమ్యూనిస్టు పార్టీలు రాజకీయ వ్యూహాలను బట్టి అడుగులు వేయక తప్పని పరిస్థితి. అందుకే ఇపుడు రాష్ట్రంలో కామ్రేడ్లు ఉనికిపాట్లు పడుతున్నారని జనం చర్చించుకుంటున్నారు. ఖరీదైన ఎన్నికల్లో పోటీచేసే ఆర్థిక, అంగబలం లేకపోవడంతో కామ్రేడ్లు పొత్తులకు సిద్ధమౌతున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడకుండా ఆదిలోనే కట్టడి చేయాలనేది కామ్రేడ్ల లక్ష్యం. అందుకే లీడర్ల సొంత కుంపట్లతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోలేదనే భావనతో మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనారు. ఈనిర్ణయంతో కమ్యూనిస్టులకు లాభమా ? నష్టమా అనేదానికంటె బీజేపీని కట్టడి చేయడమే తమ కర్తవ్యమని కామ్రేడు చెప్పడం గమనార్హం. లక్ష్యం ఒకటైనా కలసికట్టుగా ఒకే నిర్ణయానికి రాలేక విడివిడిగా టీఆర్ఎస్‌తో జతకట్టాలి అనే ఆలోచన ఎన్నికల్లో కొడవలి పార్టీల నడుమ విభేదాలకు చోటులేకుండా ఏ మేరకు టీఆర్ఎస్‌కి లాభం చేకూర్చుతుందనేది వేచిచూడాలి.