సస్పెన్స్ కంటిన్యూ.. T-బీజేపీ చీఫ్ మార్పుపై కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ..!

by Satheesh |
సస్పెన్స్ కంటిన్యూ.. T-బీజేపీ చీఫ్ మార్పుపై కొనసాగుతున్న తీవ్ర ఉత్కంఠ..!
X

బీజేపీ స్టేట్ చీఫ్ మార్పుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. పార్టీకి సంబంధించిన అంశాలపై అమిత్ షా, జేపీ నడ్డా ఢిల్లీలో పలు దఫాలుగా చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చనున్నట్టు కేంద్ర కార్యాలయం నుంచి వార్తలు వెలువడ్డాయి. కేంద్ర మంత్రివర్గం నుంచి కిషన్‌రెడ్డిని తొలగించి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నట్టు లీకులొచ్చాయి.

బండి సంజయ్‌ను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోనున్నట్టు వార్తలొచ్చాయి. కానీ చివరకు అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు పార్టీ అంతర్గత వ్యవహారాలను, సంస్థాగతమైన అంశాలను చర్చించడానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ రెండురోజుల టూర్ నిమిత్తం మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బీజేపీలో ప్రతిష్టంభన, సంక్షోభం కొనసాగుతూనే ఉన్నది. స్టేట్ చీఫ్ మార్పుపై లీకులు వచ్చినప్పటికీ దీనిపై పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కంటిన్యూ అవుతున్నప్పటికీ ఆయన కొన్ని వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.

బీజేపీపై నెగెటివ్ కామెంట్స్ వచ్చినా మౌనంగా ఉంటున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అంటూ రాహుల్‌గాంధీ ఖమ్మం సభలో వ్యాఖ్యానించినా బండి సంజయ్ ఎలాంటి కౌంటర్ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. అధిష్టానం పిలుపుతో హడావుడిగా ఢిల్లీకి వెళ్లిన బండి సంజయ్.. అక్కడ కూడా ఎలాంటి హడావుడి చేయలేదు.

మీడియాకు సైతం కనబడకుండా ఉండిపోయారు. పార్టీ నేతల్లో, శ్రేణుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి హైకమాండ్ నుంచి సైతం ఎటువంటి చర్యలూ లేవు. ఇదిలా ఉండగా పార్టీ అంతర్గత వ్యవహారాలను, సంస్థాగతమైన అంశాలను చర్చించడానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ రెండు రోజుల టూర్ నిమిత్తం మంగళవారం హైదరాబాద్ వస్తున్నారు.

పార్టీలో మార్పులు చేర్పులతో పాటు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండదంటూ ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ క్లారిటీ ఇచ్చినా పార్టీ లీడర్లు, కేడర్‌లో అనుమానాలు తొలగలేదు. వాటికి సమాధానం చెప్పడంలో అధిష్టానం తగిన చొరవ ప్రదర్శించలేదు. నేతల మధ్య గ్రూపులు, వర్గాలు ఏర్పడి కేడర్‌లో గందరగోళం నెలకొన్నా వాటి నివారణ చర్యలపైనా హైకమాండ్ దృష్టి సారించలేదు.

స్టేట్ చీఫ్ మార్పుపై లీకులు

బీజేపీకి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో పలు దఫాలుగా చర్చలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను మార్చనున్నట్టు కేంద్ర కార్యాలయం నుంచి వార్తలు వెలువడ్డాయి. కేంద్ర మంత్రివర్గం నుంచి కిషన్‌రెడ్డిని తొలగించి ఆయనను తెలంగాణకు పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నట్టు లీకులొచ్చాయి.

బండి సంజయ్‌ను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోనున్నట్టు వార్తలొచ్చాయి. ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో సోమవారం నాటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని, పలువురు మంత్రులను తొలగించి పార్టీ అవసరాలకు వినియోగించుకోవడంపై ప్రకటన ఉంటుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ నాలుగున్నర గంటల పాటు ఆ మీటింగ్ జరిగినా మంత్రివర్గం నుంచి తొలగింపుపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పార్టీ అధ్యక్షుల మార్పుపైనా సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎలాంటి స్టేట్‌మెంట్ రాలేదు.

ఆశలొదులుకున్న బండి సంజయ్..?

రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడం ఖాయమనే నిర్ధారణకు వచ్చిన బండి సంజయ్ గత వారం రోజులుగా ఇనాక్టివ్‌గా ఉండిపోయారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తగా శిరసావహిస్తానంటూ తనదైన శైలిలో బదులిచ్చారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వస్తుందో తెలియదనే అనుమానంతో ‘నా బిస్తర్‌ను సర్దుకుని నేను రెడీగానే ఉన్నాను’ అంటూ కామెంట్ చేశారు. ‘ప్రధాని మోడీ ఈ నెల 8న వరంగల్ పర్యటనకు వచ్చే నాటికి నేను అధ్యక్షుడిగా ఉంటానో లేదో..’ అంటూ వ్యాఖ్యలు చేయడంతో ఆయనను స్టేట్ చీఫ్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారనే నిర్ణయానికి వచ్చేసినట్టు స్పష్టమవుతున్నది.

బీజేపీని ఎవరు విమర్శించినా వెంటనే ఫైర్ అయ్యే బండి సంజయ్.. ఖమ్మం సభలో బీజేపీకి బీఆర్ఎస్‌ బీ-టీమ్ అంటూ రాహుల్ కామెంట్ చేసినా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆయన ఖండించలేదు. సరిగ్గా ఏడాది క్రితం (జూలై 3వ తేదీన) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో బండి సంజయ్‌ను ప్రధాని మోడీ భుజం తట్టి ప్రశంసించారు. వేర్వేరు సందర్భాల్లో అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా స్టేట్ చీఫ్‌గా బండి సంజయ్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు.

తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించడానికి, కేసీఆర్‌ను గద్దె దించడానికి ప్రధాని మోడీ, బీజేపీ నేతలు రావాల్సిన అవసరం లేదని, బండి సంజయ్ ఒక్కడు చాలంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక మొదలు జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్ బై పోల్‌లో బండి సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ విజయాలను సాధించిందని గుర్తుచేశారు.

కవిత అరెస్టుతో మొదలైన వివాదాలు:

బీజేపీ నాయకుల మధ్య విభేదాలకు, అసంతృప్తికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను అరెస్టు చేసే అంశం కీలకంగా మారింది. ఆమెను అరెస్టు చేయకపోతే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయన్న వాదనకు బలం చేకూరినట్లవుతుందనే పార్టీలోని పలువురు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి. ఇదే సమయంలో ఈటల రాజేందర్ సైతం పరోక్షంగా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

దీనికి తోడు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసంతృప్తిని వెలిబుచ్చారు. ఈటల ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో మాట్లాడినట్టు తనకు తెలియదని బండి సంజయ్ వ్యాఖ్యానించడంతో అధ్యక్షుడికి, ఈటలకు మధ్య గ్యాప్ ఉందనే విషయం బహిర్గతమైంది. ఈ అసంతృప్తులు, వివాదాలకు తోడు ఎమ్మెల్యే రఘునందన్‌రావు సైతం తాజాగా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేయడం పార్టీలో సరికొత్త గందరగోళానికి తావిచ్చినట్లయింది.

ఇదే సమయంలో తన అసంతృప్తిని సైతం వ్యక్తం చేశారు. మరోవైపు నిన్నమొన్నటి వరకు బండి సంజయ్‌ను సమర్ధిస్తూ ఈటల రాజేందర్‌ చర్యలను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నివాసంలో వివేక్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి పలువురు నేతలతో రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసిన జితేందర్‌రెడ్డి సోమవారం హఠాత్తుగా ఈటల రాజేందర్‌ను మొయినాబాద్ ఫామ్‌హౌజ్‌కు పిలిపించుకుని లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు.

నేడు రాష్ట్రానికి సునీల్ బన్సల్, కిషన్‌రెడ్డి:

రాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని స్వాగతం పలకడానికి కేంద్ర మంత్రి హోదాలో కిషన్‌రెడ్డి మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ సైతం రెండు రోజుల టూర్ నిమిత్తం నగరానికి వస్తున్నారు. పార్టీకి సంబంధించిన అంశాలపై వివిధ స్థాయిల్లోని నేతలతో చర్చించనున్నారు.

సంస్థాగతమైన వ్యవహారాలపై చర్చిస్తూ నేతల మధ్య ఉన్న అసంతృప్తి, విభేదాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిని మార్చనున్నట్టు క్లారిటీ ఇచ్చి అన్ని స్థాయిల్లోని నేతలు విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని ఆదేశిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతున్నదో అర్థం కాని గందరగోళం కంటిన్యూ అవుతున్నది.

Read More: ఆ 50 నియోజకవర్గాలపై KCR స్పెషల్ ఫోకస్.. ప్రజల మైండ్ డైవర్ట్ కాకుండా కొత్త వ్యూహాం..!

ఎన్నికల వేళ T- కాంగ్రెస్ కీలక నిర్ణయం.. BRS, బీజేపీలను ఇరుకున పెట్టేందుకు కొత్త ఎత్తుగడ..!


Advertisement

Next Story