మోసాలు, అబద్దాలకు వత్తాసుగా గవర్నర్ ప్రసంగం: మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శలు

by Mahesh |   ( Updated:2023-02-04 08:49:29.0  )
మోసాలు, అబద్దాలకు వత్తాసుగా గవర్నర్ ప్రసంగం: మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం రాసి ఇచ్చిన మోసాలు, అబద్దాలకు వత్తాసు పలుకుతూ గవర్నర్ ప్రసంగం చేయడం దారుణం అని కాంగ్రెస్ మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా గవర్నర్‌ని ఉభయసభల్లో మాట్లాడనివ్వకుండా చేసి కేసీఆర్ అవమానపరచారని విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు సుప్రీంకోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చి మరి గవర్నర్‌ని అసెంబ్లీ సమావేశాల్లోకి అడుగుపెట్టేలా చేశారని అన్నారు.

అయితే, గవర్నర్ ను సభలోకి పంపించిన వారు...దాని వల్ల ఏం లబ్ధి పొందారో అర్థం కావడం లేదని అన్నారు. కానీ, గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో అడుగు పెట్టి తెలంగాణ ప్రభుత్వం మోసాలకు వత్తాసు పలుకుతూ ప్రసంగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రాసి ఇచ్చిన ప్రసంగంలో మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం బాగా పని చేస్తుందని పచ్చి అబద్దాలను ప్రసంగంలో పేర్కొన్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, మంత్రులు, ఎమ్మెల్యేలు భూకబ్జాలు చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్నారు. మరోవైపు కవిత లిక్కర్ స్కాం లో ఇరుక్కున్న విషయాలను కప్పిపుచ్చి కేవలం బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకునేలా తయారు చేసి ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ చదవడం దారుణం అన్నారు.

దీనిపై బీజేపీ నేతలు చేసింది చాలా పెద్ద తప్పు అని అన్నారు. పొద్దున లేస్తే బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించే బీజేపీ నేతలు, గవర్నర్ ను అసెంబ్లీలోకి వెళ్లేలా చేసి బీఆర్ఎస్‌కు అనుకులంగా వ్యవహరించారని ఆరోపించారు.

దీన్ని బట్టి బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అని మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లంతా నీతిమంతులనే విధంగా ఉన్న ప్రసంగం చదవడం బాధాకరం అన్నారు. ఇటువంటి దారుణం అసెంబ్లీలో చోటుచేసుకోవడం చాలా బాధాకరంగా ఉందని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed