ఈ నెలాఖరులోగా మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు : మంత్రి పొంగులేటి

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-19 12:02:01.0  )
ఈ నెలాఖరులోగా మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు : మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 గృహాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పేదలకు అందజేస్తామని తెలిపారు. 1లక్ష 50వేల ఇళ్లకు టెండర్లు పిలిచామని, 98వేల ఇండ్లు కట్టామని, 40వేల ఇండ్లు పంపిణీ చేశామని, ఇంకా 58వేలు పంపిణీ చేయాల్సివుందని చెప్పిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని ఎన్నికల్లో లబ్ధి కోసం చూపించుకోవడానికే వాడుకుందన్నారు.

బీఆర్ఎస్ పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోనైనా, ఉద్యోగాల్లోనైనా, ప్రాజెక్టుల్లోనైనా కేవలం రాజకీయ అర్భాటంతో సరిపెట్టారని పొంగులేటి విమర్శించారు. మ ప్రభుత్వం అసంపూర్తి ఇళ్లను పూర్తి చేయించడంతో పాటు కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్న పేదల కోసం చేసే పథకాల విషయంలో రాజీ పడలేదన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ గోషామహల్ నియోజకవర్గంలోని లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజా సింగ్, గణేష్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. 144 మంది లబ్దిదారులకు పట్టాల పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లాలోని రాంపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్స్ కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... దీపావళి పండగ కొత్త ఇంట్లో జరుపుకునేలా పండగకు ముందే ఇళ్లు ఇస్తున్నామన్నారు. రాంపల్లి డబుల్ బెడ్ రూమ్స్ లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, లబ్ధిదారులు ఇంటిని, ఇంటి పరిసరాలను మంచిగా ఉంచుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed