- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Telangana: ఈ పాపమూ కేసీఆర్‌దేనా..!
దిశ, తెలంగాణ బ్యూరో: రెండు దశాబ్దాల క్రితం భూముల విలువ తక్కువ. అందుకే స్టాంప్ డ్యూటీ చెల్లించి సేల్ డీడ్ ద్వారా భూములు కొనుగోలు చేయాలన్న ఆలోచన లేదు. నోటి మాట, తెల్ల కాగితాల మీదనే లావాదేవీలు సాగించడం ఆనవాయితీ. పట్టా కోసం పాకులాడలేదు. ప్రభుత్వం సాదాబైనామాలను చేయొద్దనుకుంటే భూములు ఉన్న వారంతా హక్కుల రికార్డుకి ఎక్కలేరు. దాంతో ఆర్వోఆర్ చట్టం లక్ష్యమే నేరవేరదు. పహానీలో కల్టివేషన్ కాలమ్‌లోనైనా చేర్చేవారు. 2016 నుంచి దాన్ని కూడా తొలగించడంతో చాలా మంది హక్కులు ప్రశ్నార్ధకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల దరఖాస్తులపైన పెద్ద రాద్దాంతమే నడుస్తుంది. భూ భారతిలోనైతే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కానీ విధి విధానాలు ఎలా ఉంటాయన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతుంది. అలాగే ఏకంగా 9 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు మెకానిజం ఏర్పాటు చేయడం కూడా కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధరణి రాకముందే అప్లికేషన్లు పరిష్కరిస్తే సమస్య జటిలంగా మారి ఉండేది కాదు. కేసీఆర్ హయాంలో అప్లికేషన్లు స్వీకరించారు. కానీ ఆర్వోఆర్ 2020లో వాటిని పరిష్కరించేందుకు అవకాశం లేకుండా నిబంధనలను రూపొందించారు. అందుకే ఈ పెండింగ్ దరఖాస్తుల పాపం ఆయదేనంటున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి దాకా 1989 నుంచి 2020 వరకు 15 సార్లు సాదాబైనామాలకు అవకాశం ఇచ్చారు. ఐనా అపరిష్కృతంగా ఉండడం పట్ల ప్రజల్లో అవగాహన లేకపోవడమా? స్టాంప్ డ్యూటీ ఎగవేత కోసమే అనుసరించిన మార్గమా? ఇకనైనా సేల్ డీడ్, స్టాంప్ డ్యూటీలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భూ భారతి ఆర్వోఆర్ 2024 రూపకర్త భూమి సునీల్ అభిప్రాయపడుతున్నారు.
5ఎ, 5 బి.. సవరణలే
అప్పట్లో గ్రామాల్లో కొనుగోళ్లంతా తెల్ల కాగితాల మీదనే నడిచింది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాకుండా ఇతర మార్గాలను అనుసరించేవారు. మార్పుల రిజిస్టర్ ద్వారా గ్రామ లెక్కల నం.2లో నమోదు చేసి జమాబందీలో ఎంక్వయిరీ చేసి ఆర్వోఆర్ రికార్డులకు ఎక్కించేవారు. ఏడాది కాలం హక్కుల రికార్డును రాస్తూనే ఉండేవారు. ఎట్లా వచ్చినా చేతులు మారిన మాట వాస్తవమా? కాదా? అని విచారించి రికార్డుల్లో రాసేవారు. ఐతే ఆర్వోఆర్ 1971 యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు ఈ సాదాబైనామాలకు అవకాశం ఇవ్వొద్దని భావించారు. అంతా సేల్ డీడ్స్ ద్వారానే లావాదేవీలు జరగాలని నిర్ణయించారు. ఐతే మ్యుటేషన్ చేయకపోతే 90 శాతం మందికి పట్టాలు ఇవ్వలేమని అధికారులు లెక్క తేల్చారు. భాగ పంపకాలు, నోటి మాట, తెల్ల కాగితాల ద్వారా కొనుగోళ్లు తెలంగాణలో సాధారణమని జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు. అసెంబ్లీలోనూ దీనిపై చర్చ జరిగింది. దాని ఫలితంగానే ఆర్వోఆర్ యాక్ట్ 1971లో 5 ఎ, 5 బి సెక్షన్లు తర్వాత అమెండ్మెంట్ చేశారు. 5ఎ ద్వారా అన్ రిజిస్టర్ డాక్యుమెంట్ల రెగ్యులరైజేషన్, వాటిపై 5బి కింద ఆర్డీవోకు అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి నిర్దేశించారు. ఈ రెండు సెక్షన్లు 1989లో చేర్చడం గమనార్హం. దాంతో 1971–1989 మధ్య కాలంలో ప్రభుత్వం భూమి ఎట్లా సంక్రమించినా.. అది వాస్తవమైతే రికార్డులకు ఎక్కించాలని నిర్ణయించింది. ఆర్వోఆర్ 1971 యాక్టులో రూల్ పొజిషన్ లో తహశీల్దార్ కి దరఖాస్తు చేసుకుంటే విచారించారు. స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేవారు. ఆ ఆర్డర్ కాపీ విలువైనదిగా మారింది. ఐతే ఈ సాదాబైనామాల క్రమబద్ధీకరణ సమయాన్ని కూడా తరచూ పొడిగిస్తూ వచ్చారు. ఫస్ట్ 1989 జూలై 31 వరకు కటాఫ్ డేట్ నిర్ణయించారు. ఆ తర్వాత 5 సార్లు పొడిగిస్తూ రెగ్యులరైజ్ చేశారు. 1989–98 మధ్య కాలంలో ఉధృతంగా సాగింది. ఐతే ఇందులో ఒక షరతు మాత్రం ఆసక్తిగా ఉంది. కొనుగోలు చేసిన వ్యక్తి తప్పనిసరిగా సన్న, చిన్నకారు రైతు అయి ఉండాలి. ఆ భూమి గ్రామీణ ప్రాంతమైదిగా ఉండాలి. వ్యవసాయమే చేయాలన్న కండిషన్లు పెట్టారు.
నక్సల్స్ తో చర్చలు
ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టు పార్టీతో ప్రభుత్వం చర్చలు జరిపినప్పుడు భూ సంస్కరణలు ప్రధానంగా ఉంది. అందులోనూ సాదాబైనామాలు, ఏ డాక్యుమెంట్లు లేని రైతులు ఉన్నారని, వారికి హక్కులు కల్పించాలన్న డిమాండ్ వచ్చింది. అలాగే కోనేరు రంగారావు కమిటీ కూడా మరోసారి సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని సిఫారసు చేసింది. దాని ఫలితంగానే 2006 మార్చి 31 కటాఫ్ తేదీతో ఓ సారి, 2008 ఫస్ట్ జూలై తేదీతో కటాఫ్ గా మరోసారి అవకాశమిచ్చారు. ఇంకా మిగిలి ఉన్నాయంటూ డిమాండ్ రావడంతో 2010లో వరంగల్ జిల్లాకు ప్రత్యేక అవకాశమిచ్చారు. అప్పట్లో సాదాబైనామాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి సేల్ డీడ్స్ పై అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు. ఈ క్రమంలోనే 1989 నుంచి 2010 మధ్య కాలంలోనే 9 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఐతే అప్పట్లో చేసిన రెగ్యులరైజేషన్ లో సాదాబైనామాలో పేర్కొన్న కాలం నాటి స్టాంప్ డ్యూటీని కట్టించుకున్నారు.
తెలంగాణలోనూ చాన్స్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 2016లో సాదాబైనామాలకు అవకాశం ఇచ్చారు. రెండు సార్లు కటాఫ్ డేట్ ని పొడిగించారు. 12 లక్షల అప్లికేషన్లు రాగా 6 లక్షలు రెగ్యులరైజ్ చేశారు. ఇక్కడ స్టాంప్ డ్యూటీ కూడా మాఫీ చేశారు. నోటి మాట ద్వారా అమ్మేసినా చేయొచ్చునన్నారు. ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా చేయడానికి అనుకూలంగా అవకాశం ఇచ్చారు. ఐతే ఆర్వోఆర్ 2020 యాక్ట్, ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చేటప్పుడు అసెంబ్లీలో చివరి అవకాశమంటూ కేసీఆర్ మరో సారి తెర మీదికి తీసుకొచ్చారు. కనీసం ఎలాంటి నిబంధనలు పెట్టకుండా అప్లికేషన్లు స్వీకరించారు. కానీ ఆర్వోఆర్ యాక్టులో 5 ఎ, 5 బి సెక్షన్లు తొలగించారు. దాంతో ఆ అప్లికేషన్లు పరిష్కరించేందుకు అవకాశం లేకుండా కేసీఆర్ హయాంలోనే అధికారులు చేశారు. ఐదేండ్లుగా 9 లక్షల కుటుంబాలు ఎప్పుడెప్పుడు క్రమబద్ధీకరిస్తారా అని ఎదురుచూస్తున్నారు. అందుకే ఇప్పుడు పెండింగులోని దరఖాస్తులకు అప్పటి సీఎం కేసీఆర్ కారణమవుతారని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.
రూల్స్ తోనే పేచీ
గత ప్రభుత్వం 2020 అక్టోబరులో జీవో 112 ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరించింది. 2020 అక్టోబరు 10 నుంచి 29 తేదీ వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఆర్వోఆర్ 2020 ని అమల్లోకి వచ్చింది. అందులో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు. ఐనా అది అమల్లోకి వచ్చిన తర్వాత 2020 అక్టోబరు 29 వరకు 6,74,201 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 9 లక్షల వరకు వచ్చాయి. ఐతే ఆర్వోఆర్ 2024లో పెండింగులో ఉన్న అప్లికేషన్ల వరకు పరిష్కరించేందుకు అవకాశం కల్పించారు. సాదాబైనామాల దరఖాస్తుల బాధ్యతను ఆర్డీవోలకు అప్పగించారు. ఐతే ఏ కటాఫ్ డేట్ అంశం ఇప్పుడు ఉండదు. ఇప్పటికే పెండింగులో ఉన్న వాటికి మాత్రమే చట్టంలో అవకాశం ఉంది. మరోసారి తెల్లకాగితాలపై కొనుగోలు చేస్తే రెగ్యులరైజేషన్ ఉండదు. ఇప్పుడు వీటి పరిష్కారానికి రూపొందించే రూల్స్ మీదనే అంశం ఆధారపడింది. హక్కుదారుడి సంతకం కావాలన్న నిబంధన పెడితే 10 శాతం కూడా పరిష్కరించలేరు. అప్పటి ధరలు తక్కువ. ఇప్పుడు కొన్ని చోట్ల పదింతలు పెరిగాయి. ఈ క్రమంలో పొషిషన్ మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం ద్వారానే మార్గం సుగమమం అవుతుందని నిపుణులు అంటున్నారు.
నిబంధనలే కీలకం: భూమి చట్టాల నిపుణులు ఎం.సునీల్ కుమార్(భూమి సునీల్)
భూ భారతిలో తహశీల్దార్ నుంచి ఆర్డీవోలకు అధికారాలను బదలాయించారు. అలాగే కలెక్టర్‌కి అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అక్కడా అన్యాయమే చేశారనుకుంటే ట్రిబ్యునల్‌కి వెళ్లే చాన్స్ కూడా ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూమి హక్కుల నిరూపణలో 90 పొషిషన్ ఫస్ట్ చూడాలని, మిగతా అంశాలు కేవలం 10 శాతమే. ఐతే ఎక్కడో ఓ దగ్గర రికార్డు చేయాలి. హక్కులను గుర్తించడం ప్రభుత్వ బాధ్యత. నిజమైన హక్కుదారుడికి అన్యాయం జరగొద్దన్నది చట్టాలు చెబుతున్న వాస్తవాలుగా గుర్తించాలని భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ అంటున్నారు. ఐతే మిస్ యూజ్ కాకుండా హక్కులను గుర్తించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఇకనైనా స్టాంప్ డ్యూటీ మీద ప్రజలకు అవగాహన కల్పించాలి. దాని ప్రాధాన్యతను జనంలోకి తీసుకెళ్లాలి. రిజిస్ట్రేషన్ భారం కాకుండా గ్రామ స్థాయిలోనూ జరిగేలా చేయగలిగితే బాగుంటుందన్నారు. అలాగే ఏ విధంగా డీడ్ చేసుకున్నా ఒక్కటే స్టాంప్ డ్యూటీ ఉండేలా నిర్ణయాలు తీసుకోగలిగితే భవిష్యత్తులో అన్నీ నిబంధనల ప్రకారమే లావాదేవీలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.