గత ప్రభుత్వానికి భిన్నంగా కాంగ్రెస్ తీరు.. ప్రజల్లోకి ఆ మెసేజ్ వెళ్లేలా ప్లానింగ్..!

by GSrikanth |   ( Updated:2023-12-22 03:04:33.0  )
గత ప్రభుత్వానికి భిన్నంగా కాంగ్రెస్ తీరు.. ప్రజల్లోకి ఆ మెసేజ్ వెళ్లేలా ప్లానింగ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో గత బీఆర్ఎస్ సర్కారుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన విధానాలను అమలు చేస్తున్నది. ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు టైమ్ ఇస్తున్నామనే సంకేతం ప్రజల్లోకి వెళ్లేలా వ్యవహరిస్తున్నది. అపోజిషన్ సభ్యులకూ ఎక్కువ సేపు మాట్లాడేందుకు అవకాశం ఇస్తుండటమే ఇందుకు నిదర్శనమని లెజెస్లేటివ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ప్రజాపరిపాలనలో ఇది మంచి పరిణామంగా రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అపోజిషేషన్ సభ్యులకు అవకాశం ఇస్తూనే, టైమ్ వేస్ట్ కాకుండా కాంగ్రెస్ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదని ఆ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. దీంతోపాటు మధ్యమధ్యలో క్లారిఫికేషన్ సమయాన్నీ అదనంగా ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు. తమ ప్రభుత్వానికి ప్రతిపక్షాల సహేతుకమైన సలహాలు, సూచనలు అవసరం అని స్వయంగా సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. దీనిలో భాగంగానే స్పీకర్ అన్ని పార్టీలకు నిబంధనలు ప్రకారం మైక్ ఇస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు పేర్కొంటున్నారు.

గతంలో మైకులు కట్.. సస్పెన్షన్‌లు

బీఆర్ఎస్ పదేళ్ల పరిపాలనలో అసెంబ్లీలో తమ గళం విప్పేందుకు ప్రతిపక్షాలకు ఆశించిన స్థాయిలో అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలు, ప్రజల కష్టాలను వివరించేందుకు ప్రయత్నించినా గత ప్రభుత్వం తమ గొంతు నొక్కేందుకు అనేకసార్లు ప్రయత్నించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు. కొన్నిసార్లు మార్షల్స్‌ను పెట్టిమరీ బయటకు పంపించిన చరిత్ర బీఆర్‌ఎస్‌దని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రయత్నించినా.. గత సీఎం వ్యంగ్యంగా విమర్శించారని కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు. కానీ తమకు అలాంటి ఉద్దేశం లేదని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీల సలహాలు, సూచనలు అవసరం అని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

కొత్త ట్రెండ్..

అసెంబ్లీలో కేసీఆర్ గతంలో వ్యవహరించిన తీరును తాను అవలంభించకూడదని సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా సీఎం చాలా హుందాగా స్పష్టమైన సమాధానం ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు పేర్కొంటున్నారు. సొంత ఎమ్మెల్యేలు లేచి ప్రతిపక్షాలతో ఫైట్ చేస్తున్నా.. సీఎం రేవంత్ వద్దని వారిస్తున్నాడని ఓ ఎమ్మెల్యే చెప్పారు. ప్రజాపరిపాలనలో నూతన విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. తమకు విమర్శలు, వాగ్వాదాల కంటే ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమం అందజేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. అందుకే సమయం వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సభలో డిస్కషన్స్‌ను కొనసాగిస్తున్నామని ఓ మంత్రి వెల్లడించారు.

Also Read..

కాంగ్రెస్ సర్కార్ ఎదుట BIG టాస్క్.. బయటపడేదెలా?

Advertisement

Next Story

Most Viewed