ఆ తర్వాతే వరద సాయంపై కేంద్రం నిర్ణయం

by Gantepaka Srikanth |
ఆ తర్వాతే వరద సాయంపై కేంద్రం నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వర్షాలు, వరదలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. భారీగా ఆస్తి నష్టం సైతం జరిగింది. ఈ క్రమంలో రెండు స్టేట్స్‌లల్లో జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో అంచనా వేసేందుకు కేంద్ర హోంశాఖ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరఫున వీలైనంత సాయం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి శుక్రవారం ఢిల్లీలో మీడియాకు వివరించారు. నష్టంపై అధ్యయనం చేసిన కమిటీ నివేదిక ఇస్తుందని, దానిని పరిశీలించిన తర్వాత నిర్దిష్టమైన సాయంపై సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

కమిటీలో ఆయా శాఖల అధికారులు..

నష్టంలో వివిధ శాఖలకు సంబంధించిన అంశాలు ఉన్నందున ఆయా శాఖల నుంచి అధికారులు ఈ కమిటీలో ఉండేలా హోంశాఖ కసరత్తు చేసిందన్నారు. ఇందులో వివిధ శాఖలకు చెందిన నిపుణులు సైతం ఉన్నారన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఈ టీమ్ పర్యటిస్తున్నదని వివరించారు. కమిటీ ఆన్ స్పాట్ అధ్యయనం చేయడంతో పాటు ఫ్లడ్ మేనేజ్‌మెంట్, రిజర్వాయర్ మేనేజ్‌మెంట్, డ్యామ్ సేఫ్టీ జాగ్రత్తలు, బాధితులకు వెంటనే సాయం అందించేందుకు సిఫారసులు చేస్తుందని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో వరదలు సంభవించిన ప్రాంతాల్లో ఈ టీమ్ తిరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పారు. నష్టం ఏ మేరకు జరిగిందనేది ఈ టీమ్ సభ్యులు అంచనా వేసి నివేదిక రూపంలో సమర్పిస్తారని, ఏ మేరకు సాయం చేయొచ్చనే విషయంలో కేంద్ర హోంశాఖకు సిఫారసు చేస్తారని, నిబంధనలు పరిశీలించిన తర్వాత హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

రెండు స్టేట్స్‌లోనూ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్

సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ చొరవ గురించి హోంశాఖ అధికార ప్రతినిధి వివరిస్తూ.. సెప్టెంబర్ 1వ తేదీ నాటికే రెండు రాష్ట్రాల్లో రెస్క్యూ టీమ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఏపీలో 26 ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌లు, మూడు హెలికాప్టర్లతో పాటు నేవీకి చెందిన ఒక డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్ సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణలో ఏడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 350 మందిని ప్రాణాపాయం నుంచి రక్షించాయని, సుమారు 15వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయన్నారు. తెలంగాణలో 68 మందిని రక్షించడంతో పాటు 3,200 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి శిబిరాలకు తరలించాయని ఆయన వివరించారు.

Advertisement

Next Story