TG High Court: హైకోర్టు నిర్మాణానికి 30న టెండర్లు..? రోడ్లు, భవనాల శాఖ కసరత్తు

by Shiva |   ( Updated:2025-01-21 02:53:23.0  )
TG High Court: హైకోర్టు నిర్మాణానికి 30న టెండర్లు..? రోడ్లు, భవనాల శాఖ కసరత్తు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించి ఆర్ అండ్ బీ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఇటీవలే ప్రభుత్వం దీని కోసం రూ. 2583 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో రూ. 1980 కోట్లు భవన నిర్మాణానికి, రూ. 603 కోట్లు ఫర్నీచర్ కోసం వినియోగించనున్నారు. కాగా, ఈ నెల 30న టెండర్లు పిలిచేందుకు రోడ్లు భవనాల శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. టెండర్లు వేసేందుకు 45 రోజుల వరకు అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు ‘దిశ’కు తెలిపారు. రెండున్నరేళ్లలోపే భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

3,681 చదరపు అడుగుల విస్తీర్ణంలో..

హై కోర్టు నూతన భవన నిర్మాణానికి రాజేంద్రనగర్ లోని బుద్వేల్ లో వంద ఎకరాలను కేటాయించారు. హైకోర్టు న్యాయవాదులతో కూడిన కమిటీతోపాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు వెళ్లి ఇటీవల ఆ స్థలాన్ని పరిశీలించారు. భవన నిర్మాణానికి సరిపడా నిధులను కూడాప్రభుత్వం కేటాయించింది. 3681 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50 భవనాలు నిర్మించనున్నారు. ఇందులో 2581 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నూతన భవనం ఉండనుంది. కొత్త హైకోర్టులో పలు బ్లాక్ లు ఉండనున్నాయి. కోర్టు కాంప్లెక్స్, మెయిన్ కోర్టు హాలు, పబ్లిక్ సర్వీస్ బ్లాక్, అడ్వకేట్స్ జనరల్ బ్లాక్, అడ్వకేట్స్ జనరల్ ఎక్స్ బ్లాక్, అలాగే అడ్వకేట్స్ చాంబర్ బ్లాక్ను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్, సెంట్రల్ రికార్డు బ్లాక్, కార్డోరియం బ్లాక్ నిర్మించనున్నారు.

భవనంపై జాతీయ చిహ్నం

హై కోర్టు డిజైన్ రూపకల్పన కోసం సుమారు 15 కంపెనీలు పోటీ పడగా, టెక్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రభుత్వం ఎంపిక చేసింది. డిజైన్, డీపీఆర్ ను మంత్రి కోమటిరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి చేర్చగా.. అక్కడి నుంచి ఈ డిజైన్ ఆరుగురు సభ్యులు గల హైకోర్టు భవన నిర్మాణ జడ్జీల కమిటీ ఆమోదానికి వెళ్లింది. ఆర్ అండ్ బీ అధికారులు, టెక్ వన్ ఇండియా ప్రతినిధులు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ఆధ్వర్యంలోని జడ్జిల కమిటీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇందులో కొన్ని మార్పులను కమిటీ సూచించింది. భవనం చుట్టూ నాలుగు నుండి ఆరు డూంబ్స్ ఉండాలని, పై అంతస్తు మధ్యలో మూడు సింహాలు కనిపించే భారత జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలిసింది. దీంతో ఒకటీ, రెండు మార్పులతో డిజైన్ ఫైనల్ అయినట్లు తెలుస్తున్నది.

Next Story

Most Viewed