TG Govt.: సాంకేతిక విద్యకు సర్కార్ మెరుగులు.. ఐటీఐల స్థానంలో ఐటీసీల ఏర్పాటు

by Shiva |
TG Govt.: సాంకేతిక విద్యకు సర్కార్ మెరుగులు.. ఐటీఐల స్థానంలో ఐటీసీల ఏర్పాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాంకేతిక యుగంలో ప్రపంచ అవసరాలను తీర్చే దిశగా తెలంగాణను తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. నైపుణ్యాలకు పెద్దపీట వేయాలని చూస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న సాంకేతిక విద్యకు మెరుగులు దిద్దాలని డిసైడ్ అయింది. మార్కెట్ అవ‌స‌రాల‌కు పొంత‌న లేని చ‌దువులతో సాధార‌ణ డిగ్రీల‌తో పాటు ఇంజినీరింగ్ చేసిన వారు సైతం రూ.10 వేల కొలువు సాధించే ప‌రిస్థితి లేకుండా పోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. ఆధునిక ప్రపంచ అవ‌స‌రాలను, నైపుణ్యాల‌ను అందిపుచ్చుకునేలా తెలంగాణ బిడ్డలకు నైపుణ్య విద్యను అందించాల‌ని సర్కార్ సంకల్పించింది. అందుకు అనుగుణంగా పురాత‌న కోర్సులు, స‌ర్టిఫికెట్లకే ప‌రిమిత‌మైన రాష్ట్రంలోని 65 ఐటీఐల‌ను రూ.2,106 కోట్ల వ్యయంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఐటీసీ) మార్చివేస్తున్నారు.

అదేవిధంగా అక‌డ‌మిక్ కోర్సులు.. పరిశ్రమ‌ల అవ‌స‌రాల మ‌ధ్య అంత‌రాన్ని పూడ్చడమే ల‌క్ష్యంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివ‌ర్సిటీని ప్రజా ప్రభుత్వం ప్రారంభించినట్లు సర్కార్ చెబుతున్నది. ప్రపంచ‌వ్యాప్తంగా ఆధునిక ప‌రిశ్రమ‌ల అవ‌స‌రాలకు త‌గిన నైపుణ్యాలు బోధించేలా స్కిల్ వ‌ర్సిటీ ఉండాల‌ని, సిల‌బ‌స్ దానికి త‌గిన‌ట్లు రూపొందించాల‌నే ఉద్దేశంతో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విజ‌య‌వంతంగా ప‌రిశ్రమ‌లు న‌డుపుతున్న ప్రముఖుల‌ను సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ వ‌ర్సిటీలో భాగ‌స్వాముల‌ను చేసినట్లు సర్కార్ చెబుతున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తికావస్తున్న తరుణంలో విద్యాశాఖలో ఏడాది విజయాలపై సర్కార్ స్పష్టతనిచ్చింది.

సీఎం పర్యవేక్షణలోనే విద్యా శాఖ

తెలంగాణ విద్యాశాఖను స్వయంగా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్నారు. ఉపాధ్యాయులు పూర్తిగా బోధ‌న‌పై దృష్టిపెట్టేలా వారి ఒక్కో స‌మ‌స్యలను ప‌రిష్కరిస్తున్నట్లు సర్కార్ చెబుతున్నది. ఏడాది కాలంలో విప్లవాత్మక మార్పుల‌ను తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. 2024-25 బ‌డ్జెట్‌లో విద్యాశాఖ‌కు రూ.21,292 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది గ‌తేడాది బ‌డ్జెట్ క‌న్నా రూ.2,119 కోట్లు ఎక్కువ‌. ఇది కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని సర్కార్ చెబుతున్నది. ప్రతి ఏటా స‌మ‌స్యలతో ప్రారంభ‌మ‌య్యే ప్రభుత్వ పాఠశాల‌ల్లో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా స్కూళ్ల అభివృద్ధికి అమ్మ ఆద‌ర్శ క‌మిటీల‌ను ఏర్పాటుచేసింది. దీనికి రూ.1,100 కోట్లు, పాఠ‌శాల‌ల్లో పారిశుధ్య నిర్వహణ, ఇతర అంశాలకు సీఎస్ఆర్‌ కింద రూ.136 కోట్లు కేటాయించింది.

ఉపాధ్యాయులు బోధ‌న‌పై దృష్టిపెట్టేలా న్యాయపరమైన అడ్డంకులు తొలగించి రాష్ట్రవ్యాప్తంగా 21,419 మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప‌దోన్నతులు కల్పించింది. అలాగే 37,406 మంది ప్రభుత్వ పాఠశాల టీచర్లు, 2,757 మోడ‌ల్ స్కూల్ టీచర్ల బ‌దిలీల‌ను సైతం పూర్తి చేసింది. అలాగే 11,062 ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి డీఎస్సీ నిర్వహించి నియామ‌కాలు పూర్తి చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో, బీఆర్ఎస్ హయాంలో టెట్ నోటిఫికేష‌న్ ఎప్పుడు వేస్తారో.. ఎప్పుడు ప‌రీక్ష పెడ‌తారో తెలియ‌ని ప‌రిస్థితి ఉండేదని ప్రభుత్వం చెబుతున్నది. కానీ ప్రజాపాలనలో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తున్నట్లు సర్కార్ స్పష్టంచేసింది.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్

తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్రమాణాల‌తో విద్య అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ‌కారం చుట్టారు. ఇప్పటికే అక్టోబ‌రు 11న కొడంగ‌ల్‌, మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గాల్లో వాటికి శంకుస్థాప‌న చేశారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ర‌క్షించుకోవాల‌ని పాఠ‌శాల స్థాయిలో ప్రహరీ క్లబ్ లను ఏర్పాటుచేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌స‌తి గృహాల్లో డైట్ చార్జీల‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల వ‌స‌తిగృహాల్లోని 7,65,705 మంది విద్యార్థుల‌కు ప్రయోజ‌నం క‌లగనుంది. వాటితోపాటు కాస్మోటిక్ చార్జీల‌ను సైతం పెంచింది. విశ్వ విద్యాల‌యాల‌ను బీఆర్ఎస్ విస్మరిస్తే, వీసీలను నియమించి వర్సిటీలకు పూర్వవైభవాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చినట్లు సర్కార్ చెబుతున్నది.

Advertisement

Next Story

Most Viewed