- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Govt.: లెక్క.. పక్కా! ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో: ఓ వైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. 2014 నుంచి 2023 వరకు పదేండ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలన్నీ కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోని ఆర్థిక స్థితిగతులపై అసెంబ్లీలోనే శ్వేతపత్రం విడుదల చేశారు. అనంతరం బడ్జెట్ పరిమితులకు లోబడి మార్కెట్ రుణాలు తీసుకొని ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్దుబాటు విధానాన్ని అనుసరించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు నెలలో ఎప్పుడు జీతాలు పడుతాయో తెలియని పరిస్థితి నుంచి.. ఫస్ట్ తారీఖున జీతాలు వేసే పద్ధతిని పునరుద్ధరించారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు రూ.లక్ష కోట్ల బిల్లులను క్రమపద్ధతిలో చెల్లించే విధానం అనుసరిస్తున్నారు. మరోవైపు అప్పు తెచ్చిన దానికంటే ఎక్కువగా రీపేమెంట్లు చేసి తెలంగాణ ప్రజలపై మోపిన రుణభారాన్ని క్రమ క్రమంగా తగ్గిస్తున్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.52,118 కోట్లు అప్పులు తీసుకుంది. ఇదే సమయంలో రూ. 64,516 కోట్ల రీపేమెంట్లు (అసలు, వడ్డీలు కలిపి) చేయడం గమనార్హం. వీటికి తోడుగా కీలకమైన పథకాల రూపంలో ప్రజలకు రూ.61,194 కోట్లు లబ్ధి చేకూర్చారు.
రైతులకే అత్యధికం..
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పథకానికి అవసరమైన నిధులను సమీకరించటంలో ఆర్థిక శాఖ కీలక పాత్రను నిర్వర్తించింది. ఏకకాలంలో రైతులకు రూ.20,617 కోట్ల రుణమాఫీ చేసి రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలోని 25.36 లక్షల రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క ఏడాదిలోనే ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి దాదాపు రూ.57 వేల కోట్లు ఖర్చు చేసింది. రుణమాఫీతో పాటు రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, పంట నష్ట పరిహారానికి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, సన్న వడ్ల బోనస్‌కి భారీగా నిధులను ఖర్చు చేసింది. రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు నష్ట పరిహారంతో పాటు బాధితులకు సాయం అందించేందుకు రూ.260 కోట్లు కేటాయించింది. అప్పులను తీరుస్తూనే మొదటి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారంటీ అమలుకు శ్రీకారం చుట్టింది.
మహాలక్ష్మి, గృహజ్యోతి తోపాటు యువ వికాసాన్ని అమలు చేసింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులకు ఉద్యోగాలపై భరోసాను కల్పించింది. తొలి ఏడాదిలోనే వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 54,520 ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ పూర్తి చేసి.. ఎంపికైన అభ్యర్థులకు నియామక ప్రక్రియను పూర్తి చేయటం విశేషం. వీటితో పాటు చేయూత, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్తు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, బియ్యం సబ్సిడీ, స్కాలర్షిప్ లు, డైట్ చార్జీల పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలన్నింటికీ రూ.61,194 కోట్లు ఖర్చు చేసింది. బీసీ, మైనారిటీలకు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నవంబర్ నాటికే దాదాపు రూ.9,888 కోట్లు ఖర్చు చేసింది.
ఏడాదిలో ముఖ్య పథకాలకు వెచ్చించిన మొత్తం
పథకం వెచ్చించిన మొత్తం
రైతు భరోసా - రూ. 7,625 కోట్లు
రుణ మాఫీ - రూ. 20,617 కోట్లు
చేయూత - రూ. 11,382 కోట్లు
రాజీవ్ ఆరోగ్య శ్రీ - రూ. 890 కోట్లు
మహాలక్ష్మి సబ్సిడీ (గ్యాస్ సిలిండర్ ) - రూ. 442 కోట్లు
గృహ జ్యోతి (ఉచిత విద్యుత్ ) - రూ. 1,234 కోట్లు
విద్యుత్ సబ్సిడీ - రూ. 11,141 కోట్లు
రైతులకు ఇన్సురెన్స్ - రూ. 1,514 కోట్లు
రేషన్ బియ్యం సబ్సిడీ - రూ. 1,647 కోట్లు
స్కాలర్ షిప్, డైట్ చార్జీలు - రూ. 1,016 కోట్లు
ఆర్టీసీ సబ్సిడీ, రాయితీ - రూ. 1,375 కోట్లు
కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ - రూ. 2,311 కోట్లు
మొత్తం - రూ. 61,194 కోట్లు