TG Budget 2024 : రైతు భరోసా అమలుపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Rajesh |
TG Budget 2024 : రైతు భరోసా అమలుపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రుణమాఫీ అమలు ప్రక్రియను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలివిడతలో లక్ష వరకు రుణాలు ఉన్న అన్నదాతల అకౌంట్లలో నగదు జమ చేసింది. ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు 2 లక్షల మేర రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ తర్వాత.. అందరి దృష్టి రైతు భరోసాపైనే పడింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతుబంధు పథకం కింద ఇచ్చే 10 వేల పెట్టుబడి సాయాన్ని 15వేలకు పెంచి రైతు భరోసా పేరుతో ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వగా ఇంతవరకు అమలు కాలేదు. కాగా.. ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ పథకం అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గురువారం కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు ఎలా ఉండాలనేది ఈ బడ్జెట్ సమావేశాల్లోనే.. రెండు సభల్లో చర్చించనున్నట్టు తెలిపారు. అందరి సభ్యుల అభిప్రాయాలు తీసుకుని.. ప్రభుత్వం తుది నిర్ణయానికొచ్చి అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే.. ఆయా నియోజకవర్గాల్లో రైతు భరోసాపై అన్నదాతల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపారు. సభలో చర్చించి తుది నిర్ణయానికి వచ్చి మార్గదర్శకాలు విడుదల చేసి.. అమలు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed