జాయింట్ సర్వే చేపట్టండి.. కేంద్ర జల సంఘానికి తెలంగాణ లేఖ

by Anjali |
జాయింట్ సర్వే చేపట్టండి.. కేంద్ర జల సంఘానికి తెలంగాణ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో : పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతం నివారణ కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలకు ముంపు పొంచి ఉన్నదని గతేడాది అక్టోబరు 7, ఈ ఏడాది జనవరి 25న, ఏప్రిల్ 3న జరిగిన టెక్నికల్ సమావేశాల్లో రెండు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య చర్చ జరిగిందని, ప్రాజెక్టు డాటాను రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యం రెండు రాష్ట్రాల ప్రతినిధులతో జాయింట్ సర్వే చేపట్టాలని నిర్ణయం కూడా తీసుకున్నామని, కానీ వర్షాకాలం సమీపించడానికి ఇంకా రెండు వారాల గడువే ఉన్నదని, అయినా ప్రారంభం కాలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణలో ముందు తీవ్రత ఏ మేరకు ఉన్నదో, నివారణ కోసం ఏం చర్యలు తీసుకోవాలో క్షేత్ర స్థాయిలో అధ్యయనం నిర్వహించాలని గత నెల 12న జరిగిన సమన్వయ సమావేశంలో నిర్ణయించినా ఇప్పటికీ అది మొదలే కాలేదని కేంద్ర జల సంఘానికి మురళీధర్ వివరించారు. మొత్తం ఐదు అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైనా కాకున్నా పోలవరం అథారిటీ నేతృత్వంలో జాయింట్ సర్వే జరగాలని ఆ లేఖలో సూచించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలవరం అథారిటీని ఆదేశించాలని కోరారు.

Advertisement

Next Story