ప్రతి ఇంటికి తాగు నీరందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

by Satheesh |
ప్రతి ఇంటికి తాగు నీరందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరెంటు సమస్య వచ్చినా నీటి సరఫరా ఆగొద్దని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వేసవిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేయాలని, కరెంట్ సప్లైతో పాటు పైపు లైన్‌లను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి లీకేజీలు ఏర్పడకుండా ప్రత్యేకంగా అధికారులను నియమించాలన్నారు. ఎండా కాలంలో నీటి సరఫరా సన్నద్ధతపై హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం అనేది దేశంలో ఎక్కడా లేదని, ప్రతి ఇంటింటికి న‌ల్లాల ద్వారా తాగు నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. వేసవిలో అధికారులు సర్వ సన్నద్ధంగా ఉండి, సమన్వయంతో పని చేయాలన్నారు. అన్ని రిజర్వాయర్లు నిండి ఉండేలా ఇప్పుడే జాగ్రత్త పడాలని, నిర్దేశిత నీటిని ప్రజలకు నాణ్యంగా అందించాలని ఆదేశించారు. పంపుల మెయింటెనెన్స్ సరిగా చేయాలని, పైప్ లైన్ లీకేజీలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఫిల్టర్ బెడ్లు, ట్యాంకుల క్లీనింగ్ క్రమం తప్పకుండా చేయాలని, అన్ని స్కూల్స్, అంగన్ వాడీలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంచి నీరు అందాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ, సీఈలు, ఈఈలు, అన్ని జిల్లాల ఎస్ఈలు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed