రైతులపై సర్కారు చిన్నచూపు.. అమలు చేయని ‘ఫసల్ బీమా యోజన’

by Mahesh |
రైతులపై సర్కారు చిన్నచూపు.. అమలు చేయని ‘ఫసల్ బీమా యోజన’
X

రైతులపై కేసీఆర్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది. వారిని ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రైతుబంధు, రైతుబీమా పథకాలనే చూపిస్తూ ఇవే ‘సర్వరోగ నివారిణి’ అంటూ ప్రొజెక్ట్ చేస్తున్నది. ‘పంటల బీమా’ను అమలు చేయడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ‘ఫసల్ బీమా యోజన’ స్కీమ్‌నూ స్వీకరించలేదు. కనీసం సొంత బీమా పాలసీని ప్రవేశ పెట్టలేదు. ఏటా తాము అనేక విధాలుగా నష్టపోతున్న పట్టించుకునే నాథుడే లేడంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కారు రైతులను ఆదుకునే విధంగా చర్యలేమీ తీసుకోవడం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతింటే మంత్రులను పంపించడం, రైతులను పరామర్శించడం, ఏరియల్ సర్వే చేయడం.. ఇలాంటి వాటి తోనే సరిపెడుతున్నదే కానీ లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి నష్ట పోయినందుకు రైతులకు ఆర్థిక సాయం (బీమా, పరిహారం) అందించడం లేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేండ్లు మాత్రమే పంట నష్టానికి సహాయం అందించింది. 9 ఏండ్లల్లో కేవలం రూ.820 కోట్లు మాత్రమే రైతులకు పంట నష్ట పరిహారం పేరుతో సాయం చేసింది. గత ఏడాది వేసవి కాలంలో కురిసిన వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని ప్రకటించి నేటి వరకు ఇవ్వలేదు.

ఆరున్నర లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు రాష్ట్రంలో సుమారు ఆరున్నర లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ మధ్య ఓ జిల్లాలో పర్యటించి పంట నష్టం గురించి ఆరా తీశారు. సుమారు లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కానీ పరిహారం చెల్లింపుపై మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి స్వయంగా రైతులతో మాట్లాడుతారని ప్రకటించారు.

ప్రాథమిక నివేదికకే పరిమితం

రాష్ట్రంలో ప్రతి రెండున్నర వేల ఎకరాలకు వ్యవసాయ శాఖ తరఫున విస్తరణాధికారులు ఉన్నారు. వారు గ్రామాలు, మండలాల వారీగా నష్టపోయిన పంటల వివరాల సేకరణ పై దృష్టి పెట్టలేదు. ప్రాథమిక నివేదికకే పరిమితమవుతూ సమగ్రమైన రిపోర్టు ఇవ్వడం లేదు. 2015-16, 2016-17 లో మాత్రం పంట నష్టం కోసం ప్రభుత్వం పరిహారాన్ని విడుదల చేసింది. ఆ తర్వాత రెండేండ్లలో కేవలం రూ.36 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ నుంచి వ్యవసాయ శాఖ ద్వారా ఈ నిధులను రైతులకు అందజేసింది. గత ఏడాది, ఈ సంవత్సరం పంటలకు తీవ్ర నష్టం జరిగినా అటు కేంద్రానికి సమగ్రమైన నివేదిక పంపక పోగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహాయం అందించ లేదు.

‘ఫసల్ బీమా యోజన’ అమలు చేయలే

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదు. సొంతంగా ఎలాంటి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌నూ తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వానికి క్రెడిట్ రావొద్దనే ఉద్దేశంతోనే ఫసల్ బీమా యోజనను రాష్ట్రం అమలు చేయడం లేదన్న విమర్శలు మొదటి నుంచీ ఉన్నాయి. ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం లాంటివి కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నా వీటిని తెలంగాణ సర్కారు స్వీకరించలేదు. ఈ స్కీమ్‌లలోని నిబంధనలు రైతులకు అనువుగా లేవని, ఇన్సూరెన్సు కంపెనీలు వీటిని సాకుగా తీసుకుని నష్టపరిహారం ఇవ్వడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

నష్టపోతున్న రైతులు

అటు కేంద్ర పథకాలు అమలుకాక, ఇటు రాష్ట్ర స్కీమ్‌లు అమలులో లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు దెబ్బతిని అప్పుల పాలవుతున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో (కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో) నేడు సీఎం పర్యటించి రైతులతో స్వయంగా మాట్లాడనున్నారు. మరి ఏ మేరకు రైతులకు హామీనిచ్చి సాయం అందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు సాయం చేస్తామని ప్రకటించినా అది హామీలకే పరిమితమైంది. వరదల సమయంలోనూ భద్రాచలం తదితర ప్రాంతాల్లో పర్యటించి వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించి ఇవ్వలేదు. తాజా పర్యటనతో రైతులకు పరామర్శలు, మాట సాయమైనా..లేక నిధులు అందుతాయా ? అనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed