విద్యుత్ చార్జీల పెంపుపై సర్కార్ కీలక నిర్ణయం

by Y.Nagarani |   ( Updated:2024-10-22 02:22:12.0  )
విద్యుత్ చార్జీల పెంపుపై సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలను పెంచొద్దనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. డిస్కంలు నష్టాలను భరించాలే తప్పా, పేదలపై అదనపు భారం మోపొద్దని డిసైడ్ అయినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించేందుకు సర్కారు సిద్దం అవుతున్నట్టు తెలుస్తున్నది. చట్టం ప్రకారం ఈఆర్సీకి (ఎలక్ట్రిసిటీ రెగ్యూరేటర్ అథారిటీ) ప్రతి ఏటా విద్యుత్ సంస్థలు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను (ARR) సమర్పిస్తుంటాయి. అందులో భాగంగా ఈ ఏడాది కూడా తమ అవసరాలు ఏంటో వివరిస్తూ రిపోర్టు ఇచ్చాయి. దీని ఆధారంగా త్వరలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయంటూ బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవాలని రూలింగ్ పార్టీ భావిస్తున్నది.

గులాబీ విమర్శలపై ప్రభుత్వం సీరియస్

బీఆర్ఎస్ లీడర్లు సర్కారు విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తూ, ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఒకరకంగా ఉంటే.. అందుకు భిన్నంగా ప్రజలకు వివరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా విద్యుత్ చార్జీలు పెరుగుతాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడాన్ని సర్కారు సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈఆర్సీకి విద్యుత్ సంస్థలు తమ వార్షిక ఆర్థిక అవసరాల నివేదికలు సమర్పించడంతోనే, చార్జీలు పెరుగుతాయా? చార్జీలు పెంచే అధికారం ప్రభుత్వ పరిధిలో ఉందనే విషయాన్ని కేటీఆర్ తెలియదా? అని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షపాతి, అధికారంలోకి వచ్చిన వెంటనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. బీఆర్ఎస్ విమర్శలకు గట్టిగా ఆన్సర్ ఇస్తాం’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ లీడర్లతో కామెంట్ చేసినట్టు తెలిసింది. అలాగే ప్రజలపై భారం పడకుండా, విద్యుత్ సంస్థలను ఆదుకునేందుకు కావాల్సిన యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం.

బీఆర్ఎస్ హయాంలో 3 సార్లు ఛార్జీల పెంపు

బీఆర్ఎస్ హయాంలో (2014–2024 ) మూడు సార్లు చార్జీలను పెంచారు. 2015-16లో 5% విద్యుత్ చార్జీల భారం మోపిన అప్పటి ప్రభుత్వం, 2016-17లో అంతకంటే ఎక్కువగా 8% చార్జీలను పెంచింది. తరువాత ఐదేళ్ల పాటు చార్జీలను పెంచకుండా మౌనంగా ఉన్నారు. కానీ 2022–23లో ఏకంగా 16% చార్జీలను పెంచింది. పేదలను, మధ్య తరగతి ప్రజలను ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలి పెట్టకుండా ఒక్కో యూనిట్ పై 50 పైసల నుంచి ఒక రూపాయి చొప్పున వడ్డించింది. వీటితో పాటు కస్టమర్ ఛార్జీలను కూడా పెంచింది. ఒక్కసారిగా రూ.6 వేల కోట్ల భారాన్ని మోపింది.

డిస్కంలను నష్టాల్లోకి నెట్టి..

ఏటా రకరకాల చార్జీల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగదారులను మోసం చేయడంతోపాటు, విద్యుత్తు సంస్థల లాభనష్టాలను వెల్లడించకుండా విద్యుత్తు రంగాన్ని సర్వనాశనం చేసిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. నాటి పాలకుల తీరుతో తెలంగాణలోని డిస్కంలు వేల కోట్ల అప్పుల్లో కూరుకుపొయ్యాయని విద్యుత్ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఏడాదికోసారి డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలను (ఏఆర్ఆర్) కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో 2014-15, 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల్లో డిస్కంలు నివేదికలను (ఏఆర్ఆర్) కూడా దాఖలు చేయలేదనే విమర్శలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed