తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 2050 ప్రభుత్వ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల

by Mahesh |   ( Updated:2024-09-18 16:15:23.0  )
తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 2050 ప్రభుత్వ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చిన వెంటనే ఏడు వేల నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందించిన ప్రభుత్వం, కొత్తగా మరో 2050 నర్సింగ్ ఆఫీసర్ల భర్తీకి నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బుధవారం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అక్టోబర్ 16 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. నవంబర్ 17న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను నిర్వహించనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా పబ్లిక్ హెల్త్ లో 1576, తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332, ఆయూష్​లో 61, ఐపీఎంలో ఒకటి, ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పేస్కేల్ రూ.36,750 నుంచి రూ.1,06,990 మధ్య ఉంటుందని తెలిపారు.

దరఖాస్తుదారులకు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 46 ఏళ్ల వయో పరిమితి ఉంటుంది. వయసును 2024 జూలై 1 ఆధారంగా లెక్కిస్తారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. అప్లికేషన్ ఫీజు రూ. 200, పరీక్ష ఫీజు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్, నల్లగొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, నర్సంపేటల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. అభ్యర్థులు తమ ప్రాధాన్యత ప్రకారం సెంటర్లను ఎంపిక చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2,050 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల తెలంగాణ ప్రభుత్వ నర్సస్ అసోసియేషన్(టీఎన్ ఏ) హర్షం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ లకు ధన్యవాదాలు తెలిపారు.

100 పాయింట్లలో సెలక్షన్..

అభ్యర్ధులను వంద పాయింట్ల విధానంలో ఎంపిక చేస్తారు. ఇందులో 80 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. 20 పాయింట్లకు వెయిటేజ్ ను ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, సంస్థల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసినోళ్లు ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ట్రైబల్ ఏరియాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకు 2.5 పాయింట్లు, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు

ఎగ్జామ్‌ సిలబస్ ఇలా...

అనాటమీ ఫిజియాలజీలో 14 అంశాలపై, మైక్రోబయాలజీ లో 6 అంశాలు, సైకాలజీ, సోషియాలజీ, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, ఫస్ట్ ఎయిడ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్, మెడికల్ సర్జికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్ వైఫరీ గైనకాలా జికల్, గైనకాలజియల్ నర్సింగ్, కమ్యూని టీ హెల్త్ నర్సింగ్, నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్, ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్ లకు సంబంధించి రాత పరీక్ష సిలబస్ ఉంటుందని బోర్డు పేర్కొన్నది.

జోన్ల వారీగా లోకల్ రిజర్వేషన్..

నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులను జోన్ల వారీగా భర్తీ చేయనున్నారు. ఆయా జోన్లకు అభ్యర్థులకే 95 శాతం పోస్టులను కేటాయిస్తారు. మిగతావి ఓపెన్ కేటగిరీ కింద భర్తీ చేస్తారు. జోన్-1లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు లు ఉండగా, జోన్-2లో ఆదిలాబాద్‌, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జోన్-3లో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి.. జోన్-4లో కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్.. జోన్-5లో సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి, జనగాం.. జోన్-6లో మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్.. జోన్-7లో పాలమూరు, నారాయణపేట, జోగులాంబ-గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నాయి. లోకల్ కోటా కింద సొంత జోన్లలోని అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed