యూపీకి క్యూ కట్టిన టీ కాంగ్రెస్ నాయకులు.. టార్గెట్ అదే!

by Prasad Jukanti |
యూపీకి క్యూ కట్టిన టీ కాంగ్రెస్ నాయకులు.. టార్గెట్ అదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు విడుతల పోలింగ్‌లో తమదంటే తమదే పైచేయి అని ఇటు ఎన్డీయే కూటమి అటు ఇండియా కూటమి ధీమాతో ఉన్నాయి. తెలంగాణలోనూ పోలింగ్ ముగిసిపోవడంతో ఇన్నాళ్లు ప్రచారపర్వంలో తలమునకలైన అభ్యర్థులు, పార్టీ లీడర్లలో కొందరు కుటుంబ సభ్యులతో సేదతీరుతుంటే మరికొందరు విహారయాత్రలు బయలుదేరి వెళ్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఇంకా ప్రచార పర్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా టీపీసీసీ నేతలు యూపీలోని రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు బయలుదేరివెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

సీతక్క, వీహెచ్ అక్కడే...

గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని ఓడించిన బీజేపీ ఈసారి రాయ్‌బరేలీలోనూ ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అయితే కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఇక్కడ మరోసారి జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ అధిష్టానం బిగ్ స్కెచ్ వేస్తోంది. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నేతలను దింపుతోంది. ఈ నేపథ్యంలో దశలవారీగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రచారానికి బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క, పార్టీ సీనియర్ నేత వీహెచ్ రాయ్‌బరేలీలో ఉండగా తాజాగా ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు బయలుదేరారు. మరోవైపు ఏఐసీసీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం రాయ్‌బరేలీతో పాటు మిగతా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు.

సోనియా గాంధీ స్థానంలో రాహుల్..

కేరళలోని వయనాడ్ నుంచి పోటీలో ఉన్న రాహుల్ గాంధీ రెండోస్థానం పోటీ విషయంలో చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగింది. పలు దఫాలుగా చర్చలు నిర్వహించిన అనంతరం అధిష్టానం రాహుల్ గాంధీని రాయ్‌బరేలీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ మొన్నటివరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల ఆమె రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని భావించినా.. బీజేపీ దూకుడును నిలువరించాలంటే రాహుల్ గాంధీని పోటీకి దింపడమే సరైన చాయిస్ అనే అభిప్రాయానికి పార్టీ వచ్చింది. రాహుల్ పోటీ చేయడం ద్వారా రాష్ట్రంలోని ఇతర 16 స్థానాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో రాహుల్ గాంధీని ఓడించేందుకు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలనే చేస్తోంది. ప్రత్యర్థిగా బీజేపీ తరఫున దినేశ్ ప్రతాప్ సింగ్‌‌ను బరిలోకి దింపింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రయత్నాలకు చెక్ పెట్టాలనే వ్యూహంలో భాగంగా ఏఐసీసీ ప్రచార పర్వంలోనూ మరింత జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed