కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు.. పేపర్ లీకేజీపై టీడీపీ నేత ఫైర్

by Vinod kumar |
కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు.. పేపర్ లీకేజీపై టీడీపీ నేత ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందని, లీక్ పై తనకేమీ సంబంధమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్ మండిపడ్డారు. ఆదివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఏళ్ల తరబడి ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువకుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం పెద్దల అండతోనే ఐదు పేపర్లు లీకైనట్టుగా ఆరోపణలు వస్తుంటే టీఆర్ఎస్ మంత్రులు రాజకీయ రంగు పులిమి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు.

పేపర్ లీక్ బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు, ప్రజలు డిమాండ్ చేస్తుంటేస్పందించకపోవడం అన్యాయమన్నారు. కేటీఆర్ సంబంధికుల హస్తమున్నట్టు వస్తున్న ఆరోపణలు నిజమా..? కాదా..? అన్నది రుజువు చేసుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. లీకేజీ వ్యవహారం బయటపడి రోజులు గడుస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థతతో 30 లక్షల మంది నిరుద్యోగ యువత కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని.. నష్టపోయిన నిరుద్యోగులకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడితే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Advertisement

Next Story