రహస్యంగా టీ- బీజేపీ కీలక నేతల భేటీ.. ఎన్నికల వేళ కీలక పరిణామం..?

by Satheesh |   ( Updated:2023-09-18 10:56:14.0  )
రహస్యంగా  టీ- బీజేపీ కీలక నేతల భేటీ.. ఎన్నికల వేళ కీలక పరిణామం..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి.. నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్ చేరికలు, డిక్లరేషన్లు, వరుస భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల శంఖరావం పూరించింది. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎన్నికలు ముంచుకొస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటన ఒక స్పష్టమైన నిర్ణయం వెలువరించలేదు. అంతేకాకుండా గతంలో పార్టీలో చేరిన వారుగా కూడా క్రమంగా కమలానికి గుడ్ బై చెబుతున్నారు.

బండి సంజయ్ పార్టీ స్టేట్ చీఫ్‌గా ఉన్న సమయంలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం లేదని.. ఎన్నికలు దగ్గర పడుతుంటే స్పీడ్ పెంచాల్సిన బీజేపీ క్రమంగా డల్ అవుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగానే.. కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ లేటేస్ట్ టూర్ టీ-బీజేపీలో కొత్త చర్చకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆదివారం అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా రాష్ట్ర కీలక నేతలు అందరితో భేటీ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అమిత్ షా కేవలం కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌తో మాత్రమే భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీ తెలంగాణ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ఇవాళ హైదరాబాద్‌లో రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ కీలక నేతలు వివేక్, విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి తదితరులు హాజరైనట్లు సమాచారం. తెలంగాణ బీజేపీలో జరుగుతోన్న తాజా పరిణామాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఈటల రాజేందర్ వ్యవహారశైలిపై ప్రధానంగా వీరు మాట్లాడినట్లు టాక్. అంతేకాకుండా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తనను కలిసేందుకు కేవలం కొంత మంది రాష్ట్ర నేతలకు మాత్రమే అవకాశం ఇవ్వడంపైన చర్చించనట్లు సమాచారం.

కిషన్ రెడ్డి, బండి, ఈటలతో భేటీకి అమిత్ షా తమను పిలవకపోవడంపై వీరు కినుక వహించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చేరికల విషయంలోను సీనియర్లను కనీసం సంప్రదించకపోవడంపైన వీరు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. దీంతో పార్లమెంట్ స్పెషల్ సెషన్ ముగిసిన తర్వాత ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌ను కలవాలని వీరి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేస్తుంటే.. బీజేపీ మాత్రం ఇలా అంతర్గ వ్యవహారాలతో కొట్టుమిట్టాతుందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ టీ బీజేపీ లీడర్ల రహస్య భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Next Story

Most Viewed