ఇంట్లో చొరబడి గడియ పెట్టుకున్న కోతులు.. స్థానికులను గడుపుబ్బా నవ్వించిన ఘటన

by Gantepaka Srikanth |
ఇంట్లో చొరబడి గడియ పెట్టుకున్న కోతులు.. స్థానికులను గడుపుబ్బా నవ్వించిన ఘటన
X

దిశ, బ్యూరో కరీంనగర్: కోతి చేష్టలు కొన్ని సందర్భాల్లో మనుషులకు నష్టం కలిగించినప్పటికీ నవ్వుతూ కోతిచేష్టలు అంటూ కొట్టిపారేస్తుంటాం. కాని అవే చేష్టలు కోతులను చిక్కుల్లో పడేసాయి. కాపాడుతామనుకున్న స్థానికులకు ఆ కోతులు చుక్కలు చూపించాయి. పై ఘటన కోద్దిసేపు స్థానికులను హైరానా పరచినా.. చివరకు నవ్వుతెప్పించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో కోతి చేష్టలు ఆశ్చర్యానికి గురిచేసి ఆటపట్టించాయి. శుక్రవారం ఉదయం రామడుగు మండల కేంద్రంలో తోట శంకర్ ఇంట్లో రెండు కోతులు చొరబడ్డాయి. ఒక్కసారిగా రెండు కోతులు రావడంతో బెదిరిన ఇంటియజమానులు బయటకు పరుగులు తీశారు.

దీంతో అవి దర్జాగా ఇంట్లో చేరి గడియ పెట్టుకున్నాయి. పాపం తిరిగి గడియ తీసుకునేందుకు వాటికి సాధ్యం కాలేదు. తోటి కోతులు ఆపదలో ఉన్నాయి అని గమనించిన మరికొన్ని కోతులు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఇంటి యజమాని స్థానికుల సహయంతో గడియను తీసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. పైగా వారు చేసే ప్రయత్నం వాటికి ప్రమాదంగా భావించిన కోతులు ప్రతిఘటించాయి. కట్టేతో కిటికిలో నుండి గడియతీసేందుకు ప్రయత్నించిన స్థానికుల ప్రయత్నాలను అవి అడ్డుకున్నాయి. దీంతో చివరకు స్థానికులు కట్టర్ సహయంతో కిటికీని కట్ చేసి తొలగించారు. అవి బయటకు వచ్చేందుకు కొబ్బరి చిప్పలు ఎరగా వేసి వాటిని బయటకు వచ్చేలా చేశారు. అయినప్పటికీ అరగంట సమయం తీసుకుని మనుషుల కదలికలు కనపడకపోయే సరికి బయటకు వచ్చాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కోతుల చేష్టలపై నవ్వుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed