స్టేడియమా... ఫ్యామిలీ పార్కా..!? ఫైర్ అవుతున్న క్రీడాకారులు

by Sathputhe Rajesh |
స్టేడియమా... ఫ్యామిలీ పార్కా..!? ఫైర్ అవుతున్న క్రీడాకారులు
X

కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన మెదక్​లోని సాయి క్రీడా స్టేడియం ఫ్యామిలీ పార్కుగా మారింది. ఆధునీకరణ చేపట్టి మూడేళ్లు అవుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో నేటికీ క్రీడాకారులకు వినియోగంలోకి రాలేదు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రస్తుత సాయి స్టేడియం నిరుపయోగంగా మారింది. 2000 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయకుడు స్టేడియం, అథ్లెటిక్​అకాడమీని ప్రారంభించారు. నాటి నుంచి స్టేడియంలో క్రికెట్​ క్రీడతో పాటు కొంతకాలం బాక్సింగ్​ అకాడమీ కొనసాగింది. అయితే రానురాను స్టేడియంలో సౌకర్యాలు కొరవడడంతో మెల్లగా ఇక్కడ క్రీడలు ఆగిపోయాయి. అయితే స్టేడియం ఆధునీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.5.5 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టింది. కానీ పనులు నత్తనడకన సాగుతుండడంతో క్రీడలు ప్రారంభం కావడం లేదు. దీంతో ఈ స్టేడియాన్ని పార్కుగా వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మైదానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.

– దిశ, మెదక్​ప్రతినిధి

మెదక్‌లో సాయి స్టేడియం.. పార్కుగా మార్చేశారు.. కోట్లు ఖర్చు చేసి ఆధునీకరణ చేపట్టి మూడేళ్లు అవుతున్న నేటికీ వినియోగంలోకి రాలేదు.. పుట్ బాల్ స్టేడియాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేపట్టిన పనులు అధికారుల నిర్లక్ష్యంతో నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఫ్యామిలీ పార్క్‌గా మారడంతో ఆటలు మాత్రం ఆగాయి. మెదక్ జిల్లా కేంద్రంలో ఇందిరా గాంధీ స్టేడియం ప్రస్తుత సాయి స్టేడియం నిర్మాణంలోనే ఏళ్ల ఎదురుచూపు చరిత్ర ఉంది. ఏళ్ల పాటు సాగిన నిర్మాణం చివరకు ఎలాగో అందుబాటులోకి వచ్చింది. 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మెదక్ స్టేడియం, అథ్లెటిక్ అకాడమీని ప్రారంభించారు.

స్టేడియం క్రికెట్ క్రీడతో పాటు కొంత కాలం బాక్సింగ్ అకాడమీ కొనసాగింది. కొన్నాళ్ల పాటు బాక్సింగ్ క్రీడాకారులు.. స్థానిక క్రికెట్ మ్యాచ్‌లతో కళకళలాడింది. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో బాక్సింగ్ అకాడమీ ఇక్కడి నుంచి తరలిపోయింది. క్రికెట్‌కు కూడా సరియైన గ్రౌండ్ లేకున్నా గుంతలు, పగుళ్ల పిచ్ పై కొంత కాలం ఆట సాగింది. కానీ మెదక్‌కు సీఎం, పీఎం తదితరులు అభివృద్ధి పథకాల కోసం వస్తే హెలీప్యాడ్ కోసం ఇదే గ్రౌండ్‌ను ఉపయోగించే వారు. దీని వల్ల మళ్లీ గ్రౌండ్‌ను తవ్వడం మూలంగా గుంతలమయంగా మారి క్రీడలకు ఉపయోగం కలగకుండా మారిపోయింది. తరవాత క్రీడాకారులు, క్రీడా అభిమానులు ఫిర్యాదులు చేస్తే.. తూతూ మంత్రంగా మరమ్మతులు చేసే వారు.. గ్రౌండ్ ఆటలకు అనుకూలంగా లేకున్నా ప్రత్యామ్నాయ గ్రౌండ్ లేకపోవడంతో తప్పని పరిస్థితిలో స్టేడియాన్ని క్రీడాకారులు వినియోగించే వారు.. ఇలా అనేక ఇబ్బందుల మధ్యే క్రీడలకు స్టేడియం వేదికైంది..

ఆధునీకరణకు నిధులు మంజూరైనా...!?

మెదక్ సాయి (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) స్టేడియం ఆధునీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేశాయి. ఇందులో సింథటిక్ ట్రాక్‌కు రూ.5.5 కోట్లు, ఫుట్ బాల్ గ్రౌండ్, ఇతర సౌకర్యాల కల్పనలు మరో రూ.40 లక్షలు మంజూరయ్యాయి. సింథటిక్ ట్రాక్ నిర్మాణం పూర్తి అయింది.. దాదాపు ఐదేళ్లుగా స్టేడియం లో నిర్మాణం పనులు సాగుతూనే ఉన్నాయి. మెదక్‌లో ఫుట్ బాల్ క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి వరకు ఆడిన వారు ఉన్నారు. ఇక్కడ జాతీయ స్థాయి బాలికల ఫుట్ బాల్ టోర్నమెంట్ సైతం నిర్వహించడంతో ఫుట్ బాల్ క్రీడను ప్రోత్సహించేందుకు గ్రాస్ మైదానం అందుబాటులోకి తెచ్చారు. దీనితో స్థానిక క్రీడాకారులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

త్వరలో అందుబాటులోకి వస్తే మరిన్ని జిల్లా, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించవచ్చని ఆశ పడ్డారు.. స్టేడియంలో విద్యుత్ దీపాలు, మెట్లు, ఇతర రంగులు వేసిన అధికారులు గ్రౌండ్ నిర్మాణం పనులు పూర్తి చేయలేదు. ఆరు నెలల క్రితం గ్రాస్ మైదానం పూర్తయిన రోలింగ్ చేసేందుకు సమయం లేక పనులు నిలిపి వేశారు. గ్రౌండ్‌లో గుంటలు, వంపులు ఉండడంతో క్రీడలకు అనువుగా లేదు. దీనితో పలు మార్లు జిల్లా యువజన క్రీడల అధికారి దృష్టికి తీసుకు వెళ్లిన ఫలితం లేదు. నేడు రేపు అంటూ రోలర్ రోలింగ్ పని మూలంగా స్టేడియం అందుబాటులోకి రాకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కోట్లు ఖర్చు చేసిన అధికారులు ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సాయంత్రం పార్క్‌గా స్టేడియం...

ఫుట్ బాల్ క్రీడ కోసం దాదాపు రూ.40 లక్షలు వెచ్చించి సిద్ధం చేసిన మైదానం క్రీడలకు అందుబాటులోకి రాకపోవడంతో అది కాస్త ప్రస్తుతం ఫ్యామిలీ పార్క్‌గా మారిపోయింది. సెలవులు కావడంతో క్రీడా కారులతో ఇటీవల సమ్మర్ క్యాంప్ నిర్వహించిన ఆట ఆడేందుకు అనువుగా లేదని మైదానాన్ని పెద్దగా వినియోగించడం లేదు. కానీ పచ్చని గడ్డితో వృథాగా మైదానం ఉండడంతో పట్టణానికి చెందిన పలువురు కుటుంబంతో పాటు వచ్చి మైదానంను పార్క్‌గా మార్చేశారు..

కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం..

నాగరాజు, జిల్లా క్రీడల అధికారి..

స్టేడియంలో మైదానం అంతా సిద్ధం అయింది. గ్రౌండ్‌లో గుంతలు ఉండడం వల్ల రోలింగ్ చేస్తే సరి పోతుంది. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లాం. త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం.

Advertisement

Next Story

Most Viewed