SRSP : 20 రోజుల్లో ఎస్సారెస్పీ‌లోకి భారీగా వరద.. మొత్తం ఎన్ని టీఎంసీల నీరు వచ్చి చేరిందంటే..?

by Rajesh |
SRSP : 20 రోజుల్లో ఎస్సారెస్పీ‌లోకి భారీగా వరద.. మొత్తం ఎన్ని టీఎంసీల నీరు వచ్చి చేరిందంటే..?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పిలవబడుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో పెరుగుతుంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ సామర్థ్యం 1091 అడుగులు కాగా, 80.5 టీఎంసీలు. శనివారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 1066.30 అడుగుల నీటిమట్టం, 17.662 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. గతేడాది ఇదే సమయానికి నీటి నిలువ 1072.90 అడుగులతో 28.541 టిఎంసిల సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుండి ప్రతిరోజూ రైతుల సాగునీటి అవసరాల కోసం సరస్వతీ కెనాల్ ద్వారా 10 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు.

ప్రజల తాగు నీటి అవసరాల కోసం మిషన్ భగీరథ పథకంలో భాగంగా కోరుట్ల, జగిత్యాల్‌లకు 61 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు 63 క్యూసెక్కులు, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాలకు 107 క్యూసెక్కుల నీటిని అధికారులు ప్రతిరోజు విడుదల చేస్తున్నారు. ఈ నెల ఒకటి నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 12.163 టీఎంసీల నీరు చేరగా, గడిచిన 20 రోజుల్లో ప్రజల తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా, సాగునీటి అవసరాలకు సరస్వతీ కెనాల్ ద్వారా 2.021 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

నీటి విడుదల ఇంకా కొనసాగుతున్నట్లు వారు చెబుతున్నారు. ప్రతిరోజూ సగటున 18275 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఎస్సారెస్పీలోకి వచ్చి చేరుతోందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈయేడు తగ్గిన వర్షాల కారణంగా ఇన్ ఫ్లో తక్కువ స్థాయిలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో వర్షాలు బాగా కురిస్తేనే ప్రాజక్టులోకి వరద పోటెత్తి నీటి నిలువ భారీగా పెరిగే అవకాశాలున్నాయి. ఎస్సారెస్పీ పరిధిలో సాగు చేస్తున్న రైతులు కూడా అదే ఆశతో ఎదురు చూస్తున్నారు.

Next Story