Minister Seethakka: భారీ వ‌ర్షంతో పాటు చెరువుల క‌బ్జాలే కార‌ణం

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-04 17:16:11.0  )
Minister Seethakka: భారీ వ‌ర్షంతో పాటు చెరువుల క‌బ్జాలే కార‌ణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారీ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లో తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందని, పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి అంచనాలు రెడీ అవుతున్నాయన్న ఆ శాఖ మంత్రి సీతక్క... రోడ్ల రిపేర్ల కోసం తక్షణ సాయంగా రూ. 24 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు పూర్తిచేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని, జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పంచాయతీరాజ్ డిపార్టుమెంటు సిబ్బంది సరిపోనట్లయితే ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌పై తీసుకోవాలన్నారు. పలు చోట్ల వరదల కారణంగా పంచాయతీ రోడ్లు తెగిపోయినందున ఇకపైన ప్రతీ మండలంలో ఫ్లడ్ మేనేజ్‌మెంట్ కమిటీలను పంచాయతీరాజ్ శాఖ తరఫునే నియమించేలా ఆలోచించాలని జిల్లా కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో మంత్రి సీతక్క ఆదేశించారు.

కష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండండం మన డిపార్టుమెంటు బాధ్యత అని నొక్కిచెప్పారు. వరద నష్టం తీవ్రంగా ఉండడానికి భారీ స్థాయిలో కురిసిన వర్షాలు ఒక కారణమైతే చెరువులలో కబ్జాలు జరిగి వాటర్ ఫ్లోను అడ్డుకోవడం కూడా మరో ప్రధానమైన కారణమన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రిపేర్ పనులు పూర్తయిన వెంటనే ఏయే చెరువులు అక్రమ కబ్జాలకు గురయ్యాయో, ఎంత విస్తీర్ణం మేర ఆక్రమణ జరిగిందో వివరాలన్నింటినీ సేకరించి జిల్లా కలెక్టర్లకు జాబితాను సమర్పించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. రహదారులను తక్షణం రెడీ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వరదలు తగ్గిపోయిన తర్వాత గ్రామాల్లో పారిశుద్య నిర్వహణ ప్రధాన సమస్యగా మారుతుందని, అంటువ్యాధులు ప్రబలకుండా వెంటనే శానిటేషన్‌పై స్టాఫ్ స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు.

జిల్లాలవారీగా ప‌రిస్థితుల‌ను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క... ఇప్పటివరకు శాఖాప‌రంగా తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ఆరా తీశారు. తాగునీటి స‌ర‌ఫ‌రాను వీలైనంత తొందరగా పునరుద్ధరించాలన్నారు. అవసరమైతే మరిన్ని నిధులను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రజల మౌలిక అవసరాలకు మాత్రం ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఓవ‌ర్‌ హెడ్ వాట‌ర్ ట్యాంకుల‌ను శుద్ది చేయడం, తాగునీరు కలుషితం కాకు,డా చూసుకోవడం, అవసరమైతే క్లోరినేష‌న్‌ ప్రక్రియను ఉధృతం చేయడం తదితర అంశాల‌పై ఆయా శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌న్నారు. వ‌ర‌ద ప్ర‌భావం లేని ప్రాంతాల నుంచి వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లోకి పారిశుద్య సిబ్బందిని త‌ర‌లించాలన్నారు. క‌ష్ట‌కాలంలో చిత్త‌శుద్దితో పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్ర‌శంసించడమే కాక నిర్ల‌క్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

ఇకపైన మండల స్థాయిలో ఏర్పాటు చేయనున్న ఫ్లడ్ మేనేజ్‌మెంట్ కమిటీపై లోతుగా ఆలోచించాలని, పైలట్ బేసిస్‌గా ములుగు నియోజకవర్గంలో ఐదుగురితో ఏర్పడిన ఈ కమిటీ మంచి ఫలితాలను ఇచ్చిందని మంత్రి గుర్తుచేశారు. ఈ వెలుగులో అన్ని మండ‌లాల్లోనూ ఎంపీడీవో, ఎస్ఐ, ఎమ్మార్వో, స్థానిక అధికారుల‌తో క‌మిటీలు వేయాల‌ని స్పష్టం చేశారు. గ్రామానికి తాగునీటిని సరఫరా చేయడానికి ఏర్పాటైన చెరువుల్లో కొందరు రాజకీయ పెద్ద‌లు క‌బ్జాల‌కు పాల్పడ్డారని, ఆ నిర్వాకం చివరకు పేద‌లు వ‌ర‌ద‌ ముంపుకు గురికావాల్సి వ‌స్తున్నదని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. జ‌ల‌శ‌యాల క‌బ్జాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో త‌మ ప్ర‌భుత్వం స‌హించ‌ద‌ని హెచ్చ‌రించారు. ఒక రోజు వేతనాన్ని ప్ర‌భుత్వ ఉద్యోగులు విరాళంగా ఇవ్వడాన్ని అభినందించిన మంత్రి సీత‌క్క‌.. కొన్ని రోజుల పాటు శ్ర‌మ‌దానం కూడా చేయాల‌ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed