రాష్ట్రంలో పుంజుకుంటున్న ‘రియల్’ రంగం.. దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు!

by GSrikanth |
రాష్ట్రంలో పుంజుకుంటున్న ‘రియల్’ రంగం.. దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్నది. ఇది సాధారణ ప్రజల మాటే కాదు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే గొప్పగా చెప్పుకుంటున్నది. అయితే ‘రియల్ భూం’ భారీ స్థాయిలో అవకతవకలకూ ఆస్కారం అవుతున్నదనే ఆరోపణలున్నాయి. భూముల లావాదేవీల్లో అధికార పార్టీ నేతలతో పాటు ప్రభుత్వాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు విపక్షాలు విమర్శిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఫీనిక్స్, సాహితి, వాసవి తదితర సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ రోజుల తరబడి సోదాలు నిర్వహించింది. కీలకమైన డాక్యుమెంట్లు, భూముల రిజిస్ట్రేషన్‌లకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయ్యింది.

హైదరాబాద్‌లో దాడులు

హైదరాబాద్‌లోని సుమారు 15 ప్రాంతాల్లో ఫీనిక్స్, సాహితి ఇన్‌ఫ్రా, పల్సెస్ వంటి కంపెనీలపై ఈడీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి. లెక్కల్లోకి రానంత డబ్బు చేతులు మారిందని, ఇతర కంపెనీల్లోకి పెట్టుబడిగా వెళ్లిందని, మనీ లాండరింగ్ చట్టం ఉల్లంఘనలు జరిగాయన్నది ఈడీ అనుమానం. పలు ఫార్మా కంపెనీలు, వాటి డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు సాగుతున్నాయి. ఐటీ దాడులు జరిగిన తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది.

ఎవరెవరి పేర్లు వస్తాయో ?

ఐటీ దాడుల నేపథ్యంలో అధికార పార్టీ ప్రతినిధుల పేర్లు బైటకు వస్తాయా?.. లేక అధికారుల పేర్లు వినిపిస్తాయా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఐటీ దాడుల సందర్భంగా ఫీనిక్స్ కంపెనీలో అవకతవకలు జరిగినట్లు, అక్రమంగా డబ్బు నిల్వ చేసినట్లు తేలింది. ఎంత మొత్తంలో ఎక్కడికి తరలించారనే అంశాన్ని ఇప్పుడు ఈడీ వెలికి తీయాలనుకుంటున్నట్లు సమాచారం. ఫీనిక్స్ కంపెనీ డైరెక్టర్ గోపీకృష్ణ జూబ్లీహిల్స్ నివాసంతో పాటు మేనేజర్ శ్రీనివాస్ నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వీకెండ్ రోజుల్లో సోదాలు జరుగుతుండటం అనేక సందేహాలకు తావిచ్చినట్లయింది.

15 బృందాలు విడివిడిగా..

బంజారాహిల్స్, పటాన్‌చెరు, మాదాపూర్ ప్రాంతాల్లో 15 బృందాలు విడివిడిగా రెయిడ్ చేస్తున్నాయి. ఫార్మా కంపెనీకి కూడా డైరెక్టర్‌గా ఉన్న గోపీకృష్ణ...ఫీనిక్స్ టెక్‌జోన్ ప్రైవేట్ లిమిటెడ్‌ సహా మొత్తం 19 కంపెనీలకు కూడా ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎవరెవరితో ఎలాంటి సంబంధాలున్నాయి.. ఏ కంపెనీల్లో ఎంత పెట్టుబడులు ఉన్నాయి.. రియల్ కంపెనీల నుంచి వాటిలోకి ఇన్వెస్ట్‌మెంట్లు వెళ్లాయా..? వంటి అంశాలపై ఈడీ దృష్టి పెట్టింది. రియల్ భూముల అక్రమాల్లో ఏ ప్రజాప్రతినిధి పేరు, అధికారి పేరు బైటకు వస్తుందనే ఆసక్తి నెలకొన్నది. అధికార పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యేలకు రియల్ సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ప్రాజెక్టులో కమీషన్లు, వాటాలు ఉంటున్నట్లు విపక్ష నేతలు అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు. ఈడీ సోదాల తర్వాత రానున్న రోజుల్లో ఎవరు టార్గెట్ అవుతారు, ఎవరికి నోటీసులు అందుతాయనే ఉత్కంఠ నెలకొన్నది.a

Advertisement

Next Story