తెలంగాణలో మరో కొత్త రాజకీయ వేదిక..? ఈ నెల చివర్లో స్టేట్ పాలిటిక్స్ షేక్ అయ్యే పరిణామాలు

by Satheesh |   ( Updated:2023-06-05 13:01:12.0  )
తెలంగాణలో మరో కొత్త రాజకీయ వేదిక..? ఈ నెల చివర్లో స్టేట్ పాలిటిక్స్ షేక్ అయ్యే పరిణామాలు
X

ఈ నెలాఖరులో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఈ నెల మిడ్‌లో తమ రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మాజీ మంత్రి జూపల్లి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే స్పష్టం చేయడంతో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి అటు నేతలతో పాటు ఇటు ప్రజల్లోనూ పెరిగింది. వీరు కాంగ్రెస్‌లో చేరతారా? లేక బీజేపీలోకా? అనే వార్తలు కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతుండగా.. సొంతంగానే ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి.

ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలు వీరితో కలిసి వస్తారని, మొత్తంగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం కో ఆర్డినేటర్‌గా త్వరలో ఒక వేదిక ఏర్పాటు కానున్నదనే వార్తలూ వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫ్రెషర్ గ్రూపులో చేరేదెంతమంది?.. టీజేఎస్ పార్టీయే వీరికి వేదికగా మారనున్నదా? అనేది ఉత్కంఠ పెంచుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సైతం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఇదే టైంలో బీఆర్ఎస్‌ను ఓడించాలన్న ఆలోచనతో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. జూన్ మధ్యలో తమ డెసిషన్ ప్రకటించనున్నట్టు వారు ఇప్పటికే హింట్ ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరుతారా? లేక బీజేపీలో చేరుతారా? అనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి.

ఈ రెండు పార్టీలూ కాకుండా వారు సొంతంగానే ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటారా? అనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. భావసారూప్యత కలిగిన కొద్దిమంది నేతలంతా కలిసి సొంత వేదిక ఏర్పాటు చేసే దిశగానూ ఆలోచనలు జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టడం కంటే ఒక వేదికను ఏర్పాటు చేయడమే ఉత్తమమనే అంచనాకు వారు వచ్చినట్టు తెలిసింది.

మరింత ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదనే భావనతో ఈ నెల చివరికల్లా ఓ రాజకీయ సంచలనం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీల్లోని అసమ్మతి, అసంతృప్తవాదులు వీరితో ఏ మేరకు కలిసొస్తారో వేచి చూడాలి. అధికార పార్టీలో టికెట్ అనుమానమే అనే నిశ్చితాభిప్రాయానికి వచ్చినవారు వీరితో కలిసే చాన్స్ ఉన్నది.

ప్రెషర్ గ్రూపుగా..

బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి, జూపల్లి గత కొంతకాలంగా జాయింట్‌గానే చర్చలు జరుపుతున్నారు. ఏ పార్టీలో చేరితే ఉపయోగకరంగా ఉంటుందనే లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా భవిష్యత్ పొలిటికల్ జర్నీ గురించి ఆలోచిస్తున్నారు. ఆ పార్టీకి ఒక ప్రెషర్ గ్రూపుగా ఆవిర్భవించాలని భావిస్తున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న లైక్ మైండెడ్ పర్సన్స్, అసంతృప్తవాదులతో చాలా కాలం క్రితమే సంప్రదింపులు మొదలుపెట్టారు.

బీఆర్ఎస్‌ను ఓడించడానికి వేరే పార్టీలో చేరాలా?.. లేక వేదికను ఏర్పాటు చేయాలా? అంటూ లోతుగా ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెలలోనే నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో వారు ఉన్నారు. వివిధ పార్టీల్లోని నేతలను కలుపుకుని ఒక వేదికగా ఏర్పాటై ఒక బలమైన పొలిటికల్ ఫోర్స్‌గా ఆవిర్భవించాలన్నది వారి ఆలోచన. ఈ వేదిక ద్వారా పోటీచేస్తే కామన్ సింబల్ సమస్య ఎదురవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇందుకోసం ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన రాజకీయ పార్టీతో సంప్రదింపులు మొదలయ్యాయి.

వేదిక కానున్న టీజేఎస్?

కేసీఆర్‌ను ఓడించడానికి ఏ పార్టీతోనైనా కలవడానికి తాము సిద్ధమని, తన వంతు సహకారం ఉంటుందని తెలంగాణ జన సమితి నేత ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. ఆ పార్టీకి గతంలో కామన్ సింబల్‌గా అగ్గిపెట్టె గుర్తు ఉండేది. ఇప్పుడు ఆ వెసులుబాటు లేకపోవడంతో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసే అవకాశాలున్నాయి. సొంత వేదిక ఆలోచనకు అనుగుణంగా కోదండరాం పార్టీని వాడుకోవడంపైనా చర్చలు జరుగుతున్నాయి.

చివరకు ఈ గ్రూపుకు కోదండరాం కోఆర్డినేటర్ లాంటి బాధ్యతలను నిర్వర్తించే అవకాశాలూ లేకపోలేదు. కేసీఆర్‌ను గద్దె దించడమే వీరందరి లక్ష్యం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో అసంతృప్తితో ఉండే నేతలంతా ఈ రూపంలో ఒక్కటయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన మూడు ప్రధాన పార్టీల్లోని కొందరు నేతలతో మంతనాలు మొదలయ్యాయి.

కనీసంగా పాతిక నుంచి ముప్పై మంది కచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయనేవారు ఏకభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలు ముగిసే సమయానికి పొంగులేటి, జూపల్లి సహా పలువురు నేతలు ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునే చాన్స్ ఉన్నది. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో పాటు తప్పనిసరిగా గెలుస్తామన్న ధీమా ఉన్న నేతలు ఈ వేదిక ద్వారా ఒక్కటి కావాలనుకుంటున్నారు.

హంగ్ వస్తే కీలకంగా ఫ్రెషర్ గ్రూపు

రాష్ట్రంలో బీఆర్ఎస్‌‌ను ఓడించే శక్తి బీజేపీకి లేదనే అభిప్రాయం కొద్దిమందిలో వ్యక్తమవుతున్నది. ఇటీవల ఆ పార్టీకి చెందిన ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇదే తరహా అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పారు. బలమైన ప్రత్యర్థిగా కాంగ్రెస్ నిలిచినా సొంత బలంతో అధికారాన్ని చేజిక్కించుకోవడంపై ఎవరి అనుమానాలు వారికున్నాయి. ఈసారి బీఆర్ఎస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టమేనని మాటలూ వినిపిస్తున్నాయి. హంగ్ తరహా పరిస్థితి రావచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఏర్పాటు చేయాలనుకున్నా తప్పనిసరిగా ‘ఫ్రెషర్ గ్రూపు’ సహకారం అనివార్యమని పొంగులేటి, జూపల్లి లాంటి కొద్దిమంది అభిప్రాయపడుతున్నారు. ఏ పార్టీ అయినా చివరకు తమ మద్దతును కోరాల్సిన అవసరం ఏర్పడుతుందనే భావనతో ఉన్నారు. ఈ నెల చివరికల్లా ఏ పార్టీలోంచి ఎంత మంది అసంతృప్తివాదులు బైటకొస్తారు?.. ఫ్రెషర్ గ్రూపులో చేరేదెంతమంది?.. తెలంగాణ జన సమితి పార్టీయే వీరికి వేదికగా మారనున్నదా?.. దీంతో కామన్ సింబల్ సమస్య తీరనున్నదా?.. ఫ్రెషర్ గ్రూపుగా వీరంతా పోటీచేసి గెలిచినట్లయితే ఆ తర్వాత ఐక్యంగా ఉంటారా?.. అధికారంలోకి వచ్చే పార్టీలోకి వెళ్లిపోతారా?.. ఆశించిన లక్ష్యం నీరుగారుతుందా?.. ఇలాంటి అనేక అంశాలకు ఈ నెల చివర్లో వెలువడే నిర్ణయం స్పష్టత ఇవ్వనున్నది. రాబోయే మూడు వారాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed