వారికి పట్టాల్లేవు.. పోడు భూముల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!

by Satheesh |   ( Updated:2023-05-25 01:01:02.0  )
వారికి పట్టాల్లేవు.. పోడు భూముల విషయంలో తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజనులు ఇప్పటికే సాగు చేసుకొంటున్న భూములకు పట్టాలిస్తాం.. సర్వే పూర్తయింది.. ఇంకా ఎవరన్నా భూమి లేకుండా, ఉపాధి లేకుండా ఉంటే దళితబంధు తరహా గిరిజన బంధు పథకాన్ని ప్రారంభిస్తాం. అందరూ అభివృద్ధి అయితేనే తెలంగాణ అభివృద్ధి అయితది. 11.5లక్షల ఎకరాల పోడు భూములకు పట్టలివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమ్మె్ల్యేల సమక్షంలోనే పంపిణీ చేస్తాం.

= ఈ ఏడాది ఫిబ్రవరి 10న అసెంబ్లీలో సీఎం కేసీఆర్

సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గొత్తికోయలకు మాత్రం మొండిచేయి చూపుతోంది. వారితోపాటు నాన్ ట్రైబల్స్ సైతం పోడుభూములు సాగుచేసుకుంటున్నా వారికి సైతం ఇవ్వడం లేదని సమాచారం. ఇప్పటికే ఎవరికి పోడుపట్టాలు ఇవ్వాలని వివరాలను సేకరించడంతో పాటు భూపాస్ బుక్‌లు కూడా సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. 2006 అటవీహక్కుల గుర్తింపు చట్టం ప్రకారం అందరూ అర్హులేనని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం ఎటుదారితీస్తు్ందో చూడాలి.

ఎట్టకేలకు పోడుభూముల సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే 24 నుంచి 30వరకు గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపజేయాలని భావిస్తుంది. అయితే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ 11.5 లక్షల ఎకరాల పోడుభూములకు పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

అయితే చెప్పిన దానికి ప్రస్తుతం పంపిణీకి సిద్ధమవుతున్న లెక్కలకు పొంతలేదని విశ్వసనీయ సమాచారం. కేవలం 4.5లక్షల ఎకరాలను లక్షా80వేల మంది గిరిజనులకు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు తెలిసింది. అయితే సగానికిపైగా ప్రభుత్వం కోత విధించింది. ప్రభుత్వం తెప్పించుకున్న లెక్కల ప్రకారం 11.5 ఎకరాల భూమి సాగులో ఉందని తెలినప్పటికీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా పంపిణీకి వెనుకడుగు వేస్తుంది. అయితే గిరిజనుల కోటాలో కొంతమందికి చెక్ పెడుతున్నట్లు స్పష్టమవుతోంది.

గొత్తికోయలకు పోడు పట్టాల్లేవ్..!

గొత్తికోయలు తెలంగాణకు చెందిన వారు కాదనేది ప్రభుత్వ వాదన. వారు ఛత్తీస్ గడ్ నుంచి వలసవచ్చి అడవులను నరికి సాగు చేసుకుంటే ఎలా గిరిజనుల కిందకు వస్తారని ప్రభుత్వం పేర్కొంటుంది. అయితే అటవీహక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం గొత్తికోయలు కూడా గిరిజనుల కిందకే వస్తారు. అయితే కేంద్రం వారిని గిరిజనుల కింద గుర్తించలేదని అందుకే ఇవ్వడం లేదని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1272 గొత్తి కోయల అవాసాలు ఉన్నాయి. వీరంతా ఛత్తీస్ గడ్ నుంచి వలస వచ్చినట్లు అటవీ శాఖ చెబుతున్నది.

వీటిలో ఇప్పటికే 329 గ్రామాలు ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందాయి. ఆయా గ్రామ పరిధిలో 1,14,892 ఎకరాల్లో పోడు సాగు జరుగుతున్నది. దీంతో పాటు మరో 943 ప్రాంతాల్లో గొత్తి కోయలు నివాసం ఉంటున్నట్లు అటవీ శాఖ అంచనా వేసింది. ఆ పరిధిలోనూ 88,711 ఎకరాల్లో పోడు సాగు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అన్ని జిల్లాల అవాసాల్లో 1,25,699 మంది గొత్తి కోయలు నివాసం ఉంటున్నట్లు ఫారెస్ట్​డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి రిపోర్టు చేసింది.

అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 304, మహబూబాబాద్‌లో 195, జయశంకర్​భూపాలపల్లిలో 140, నిర్మల్‌లో 111, కొమరం భీం ఆసీఫాబాద్‌లో 83, ఆదిలాబాద్‌లో 179, ఖమ్మంలో మరో 31 అవాసాలు ఉన్నాయని గతంలో అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గొత్తికోయలు అయినా, గిరిజనేతరులు అయినా 75 ఏళ్లుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని పోడుభూములు సాగుచేసుకుంటున్నవారికి చట్టం ప్రకారం భూ హక్కులు కల్పించాల్సి ఉంటుంది.

కానీ అందుకు మాత్రం ప్రభుత్వం నిరాకరిస్తుంది. ఏళ్లుగా గుత్తికోయలు స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగుతున్నారని పేర్కొంటున్నాయి. వారికి ఆధార్ కార్డు, రేషన్, ఓటు హక్కులను సైతం ప్రభుత్వం కల్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో, అసెంబ్లీ, పార్లమెంట్ ఇలా అన్ని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కానీ వారికి భూ హక్కులు కల్పించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

గిరిజనసంఘాల మండిపాటు..

ప్రభుత్వ తీరుపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. గిరిజనులందరికీ, పోడుభూములు సాగుచేసుకుంటున్నవారికి హక్కులు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం మాటమార్చడం తగదని పేర్కొంటున్నాయి. ప్రభుత్వం భూమి సాగుచేసుకుంటున్న వారి వివరాల ఆధారంగానే కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారని, ఇప్పుడు కొందరికే పట్టాలు ఇస్తామని హక్కులు కల్పిస్తామని పేర్కొనడం సబబుకాదన్నారు. సాగుచేసుకుంటున్న అటవీహక్కుల చట్టం ప్రకారం వారందరికీ పట్టాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే నిరసనలకు సైతం వెనుకాడబోమని పేర్కొంటున్నాయి.

Read more:

బిగ్ న్యూస్: పార్లమెంట్ ఓపెనింగ్‌కు వెళ్తారా.. వెళ్లరా..? KCR నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ..!

Advertisement

Next Story