ROR Act 2024: రైతు కోణంలోనే రెవెన్యూ సేవలు.. సత్వర న్యాయమే చట్టం లక్ష్యం

by Shiva |   ( Updated:2024-08-07 07:48:17.0  )
ROR Act 2024: రైతు కోణంలోనే రెవెన్యూ సేవలు.. సత్వర న్యాయమే చట్టం లక్ష్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. అందుకే కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ని తీసుకొచ్చినా, ఆర్వోఆర్ చట్టం 2020ని అమలు చేసినా విస్తృతంగా చర్చ జరిగింది. దానిపై ప్రశంసలు, విమర్శలు బాగా వచ్చాయి. ఇప్పుడు కూడా రేవంత్ సర్కార్ భూ సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థను రూపొందించాలని ప్రయత్నిస్తున్నది. అందుకే మొదటి దశగా ఆర్వోఆర్ యాక్ట్‌ని కొత్తగా తెచ్చేందుకు అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే ఆర్వోఆర్ -2024 ముసాయిదాను ప్రజల ముందు ఉంచింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే అన్నీ చర్చించి మార్పుచేర్పులతో కొత్త చట్టాన్ని అమలు చేయాలన్న సదుద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

గతానికి భిన్నంగా ప్రజల ముందుకు ముసాయిదా..

13 ఏండ్ల తర్వాత ఓ చట్టంపైన ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్, ఆర్వోఆర్ 2020 ముసాయిదాలేవీ ప్రజల ముందుకు రాలేదు. నాలుగు గోడల మధ్య అప్పటి సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్‌లే రూపొందించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. కనీసం రైతు సంఘాల నాయకులు, రెవెన్యూ చట్టాల నిపుణులు, అధికారుల సూచనలేవీ తీసుకోకుండా అమలు చేయడం ద్వారానే లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

అయితే, ఇప్పుడు ఆర్వోఆర్ 2024 ముసాయిదాను జనంలో ఉంచగానే విస్త్రృతంగా చర్చ మొదలైంది. ఇప్పటికే రైతు సంఘాలు, అడ్వకేట్లు, నాయకులు ఎలా ఉంటే బాగుంటుందో సూచనలు ఇస్తున్నారు. కొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే ఆర్వోఆర్ చట్టం అనేది కేవలం రికార్డులకు సంబంధించినది మాత్రమే అని గుర్తించకుండా ధరణి కమిటీ ఇన్నాళ్లు అక్రమాలను వెలికి తీయలేదని, అసలేం రిపోర్ట్ ఇచ్చిందంటూ విమర్శలు చేస్తున్న వారున్నారు. ప్రస్తుతం ఆర్వోఆర్ 2024 ముసాయిదా, అందులోని అంశాల్లోని లోపాలు, మరింత మెరుగులు తీర్చిదిద్దేందుకు అవసరమైన సూచనలు ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నది.

ప్రజల్లో జోరుగా సాగుతున్న చర్చ..

ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో లోపాలతో కూడిన రికార్డు ఉంది. వాటిని సరిచేయకుండా అక్రమంగా ధరిణిలో చొరబడ్డ వారిని బయటికి పంపకుండా అదే రికార్డుతో ముందుకెళ్తే రైతులకు మళ్లీ కష్టాలే ఎదురవుతాయి. అప్పీల్ వ్యవస్థ ఆర్డీవో స్థాయిలోనే ఉండాలి. ప్రతి జిల్లాకు ఓ ట్రిబ్యునల్ ఉండాలి.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్లుగా ఏర్పాటు చేయాల్సిందే. గ్రామసభలు నిర్వహించాల్సిందే. తప్పు చేసిన రెవెన్యూ అధికారికి శిక్ష పడాల్సిందే. భూధార్ నంబర్ ఇస్తామంటున్నారు.. అంటే ఇప్పుడున్న పట్టాదారు పాసు పుస్తకాలు చెల్లవా? సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మళ్లీ అప్లై చేసుకోవాలా? అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తారా? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నలుగురు రైతులు ఎక్కడ కూర్చున్నా ఇదే చర్చ సాగుతోంది. అసలు ఆర్వోఆర్ చట్టం 2024 ముసాయిదాలో ఏం ఉంది? దాని ఉద్దేశ్యాలు ఏమిటి? సామాన్యుల నోట వింటున్న ప్రశ్నలకు ఈ చట్టం తయారీలో అత్యంత కీలక భూమిక పోషించిన భూ చట్టాల నిపుణుడు, ధరణి కమిటీ సభ్యుడు ఎం.సునీల్ కుమార్‌తో ‘దిశ’ సీనియర్ జర్నలిస్ట్ శిరందాస్ ప్రవీణ్​ కుమార్‌ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...

ప్రశ్న: తప్పుల సవరణ ఎలా? మళ్లీ అప్లై చేసుకోవాలా?

జ: చట్టంలో సెక్షన్ 4 ప్రకారం తప్పుల సవరణ కొనసాగుతుంది. మళ్లీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ముసాయిదాలో పార్టు -ఎలో అంటే ధరణి పోర్టల్‌లో నమోదైన డేటాలోని తప్పొప్పుల సవరణ చేయడానికి అవకాశం ఉంది. పార్టు-బి లో పెట్టిన 18 లక్షల ఎకరాల వివాదాస్పద భూములకు కూడా రికార్డులను సవరించాలని చట్టంలో ఉంది. సవరించిన డేటాకు చట్టబద్ధత మాత్రం ఈ కొత్త చట్టం ద్వారా దక్కుతుంది.

తప్పుల సవరణ అధికారం ఎవరికి కట్టబెడుతున్నారు?

జ: చట్టంలో నిర్దేశిత అధికారి తప్పనిసరిగా నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా పెట్టాం. నిర్దేశిత అధికారి అనగానే కొందరు కలెక్టర్, సీసీఎల్ఏ అంటూ ఎవరికి వారు అంచనా వేసుకుంటున్నారు. ధరణి పోర్టల్‌లోని సమస్యల పరిష్కారానికి జారీ చేసిన సర్య్కూలర్ ఒకటి ద్వారా ఎవరి బాధ్యత అనేది అర్థమవుతుంది. దీంట్లోనే ఇంకా అనేక మార్పులు చేసుకొని మార్గదర్శకాలను జారీ చేస్తారు. అందులోనే ఏ సమస్య? ఏ అధికారి? ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి? అనే అంశాలు ఉంటాయి. ఇది గైడ్‌లైన్స్ ద్వారా తెలిపే అంశం. పైగా ఎప్పటికప్పుడు మార్చుకోదగ్గ అంశం. గడువు, అధికారాలను మార్చుకునేందుకు వీలుగానే చట్టంలో ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ అని మాత్రమే పేర్కొన్నారు.

ప్రశ్న: భూధార్ తాత్కాలిక, శాశ్వత నంబర్లు ఎప్పుడు ఇస్తారు?

జ: ప్రతి ల్యాండ్ పార్శిల్‌కి ఓ యూనిక్ నంబర్ ఇవ్వడమే భూదార్‌గా చెప్పారు. తాత్కాలిక, శాశ్వత నంబర్లుగా ఎందుకు పెట్టారనేది చాలామందికి డౌట్ వస్తుంది. ఇప్పుడున్న రికార్డులను పరిశీలించి డేటా కరెక్టుగా ఉంటే వెంటనే టెంపరరీ భూదార్ నంబర్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ప్రతి రైతుకు బార్‌కోడ్ ఉంది. భూదార్ ద్వారా ప్రతి భూమికి వస్తుంది. ఇది కూడా అంత ఈజీ కాదు. గ్రామసభలు పెట్టి రికార్డులను వెరిఫై చేయడం తప్పనిసరి. దీని ద్వారా రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్లాల్సిందే. మరో భూ రికార్డుల ప్రక్షాళన అనుకోవచ్చు. అయితే జనం మధ్యలో నడుస్తుంది.

ఇక పర్మినెంట్ భూదార్ ఇవ్వాలంటే భూ సమగ్ర సర్వే చేయాల్సిందే. అంటే ప్రతి ల్యాండ్ పార్శిల్‌కి అక్షాంశాలు, రేఖాంశాలు, మ్యాప్ వంటి వాటిని రూపొందించినప్పుడు సాధ్యమవుతుంది. అంటే భూ సర్వేకు శ్రీకారం చుట్టినట్లే. ప్రతి భూమికి కో ఆర్డినేట్స్ నమోదు చేయాలంటే తప్పదు. చట్టంలో పర్మినెంట్ భూదార్ నంబర్ ఇస్తామని పెట్టారంటే త్వరలో భూ సర్వేకు తప్పనిసరిగా వెళ్లాల్సిన అనివార్యత ఏర్పడుతుంది. ఇది అందరూ కోరుకునేదే. ప్రతి రెవెన్యూ నిపుణుడు భూ సమగ్ర చేస్తేనే సమస్యలకు శాశ్వత పరిష్కారం అంటారు. ఇప్పుడా డిమాండ్ నెరవేర్చడానికే చట్టంలో భూదార్ పెర్మినెంట్ నంబర్ ప్రస్తావనను ప్రత్యేకంగా పేర్కొన్నారు.

ప్రశ్న: భూ సమగ్ర సర్వే జరుగుతుందా? లేదా? అది చట్టంలో పెట్టలేదు కదా!

జ: ఆర్వోఆర్ చట్టానికి, భూసర్వేకు సంబంధం లేదు. అసలు భూ సర్వే చేయడం తప్పనిసరి అని ఏ చట్టం చెప్పదు. ఏ చట్టంలోనూ లేదు. అయితే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే, వివాదాలు లేని రికార్డులను రూపొందించాలంటే ఇది అనివార్యం. అందుకే ఆర్వోఆర్ 2024లో పర్మినెంట్ భూదార్ ఇస్తామని పెట్టాం. అది అమలు చేయాలంటే తప్పనిసరిగా భూ సర్వేకు వెళ్లాల్సిందే.

ప్రశ్న: సాదా బైనామాల క్రమబద్ధీకరణకు మళ్లీ అప్లై చేయాలా?

జ: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 9 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. అవి అపరిష్కృతంగా ఎందుకు ఉన్నాయో అందరికీ తెలుసు. పాత చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు. ఇప్పుడు చేయొచ్చని కొత్త చట్టంలో పొందుపరిచాం. అయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పెండింగులో ఉన్న దరఖాస్తులనే పరిష్కరిస్తారు. పాత సర్క్యులర్ ప్రకారం కలెక్టర్ చేయాలని నిర్దేశించారు. కొత్త చట్టంలో అది ఆర్డీవో స్థాయికి మార్చారు. కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అలాగే మళ్లీ ఫీజులు కూడా చెల్లించాల్సిన పని లేదు. అయితే ఈ దరఖాస్తుల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో విచారణ ఉంటుంది. అభ్యంతరాలు కూడా స్వీకరిస్తారు. అవి క్లియర్ అయితేనే క్రమబద్ధీకరణ ఉంటుంది.

ప్రశ్న: కొత్త చట్టం వస్తే ఇప్పుడుంటే పాసు పుస్తకాలు రద్దు అవుతాయా?

జ: కొత్త చట్టం వచ్చినా, ఇప్పుడున్న చట్టం ఇలాగే ఉన్నా ఈ పట్టాదారు పాసు పుస్తకాలు ఉపయోగంలోనే ఉంటాయి. జారీ ప్రక్రియ కూడా ఉంటుంది. వీటికే భూదార్ టెంపరరీ నంబర్లు కూడా వస్తాయి. లేదా భూధార్ కార్డులు జారీ చేయొచ్చు. మళ్లీ కొత్త పాసు పుస్తకాలు తీసుకోవాలా? రద్దు అవుతాయా? అన్న అనుమానాలకు తావు లేదు.

ప్రశ్న: ఆటోమెటిక్ మ్యుటేషన్ ఉంటుందా?

జ: సేల్‌డీడ్, గిఫ్ట్‌డీడ్ ద్వారా చేసే ప్రతి డీడ్‌కి ఆటోమెటిక్ మ్యుటేషన్ ఉంటుంది. ఇప్పుడు అభ్యంతరాలు వచ్చినా మ్యుటేషన్‌ని నిలుపుదల చేసే అధికారం తహశీల్దార్లకు లేదు. కొత్త చట్టంలో ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు నిలిపివేసే అధికారం ఉంటుంది. క్షేత్ర స్థాయిలో భూమి ఉండి, ఎలాంటి వివాదాలు లేకపోతే ఆటోమెటిక్ మ్యుటేషన్ జరుగుతుంది. అయితే పాత సేల్ డీడ్స్, ఇతర అంశాల ద్వారా సంక్రమించిన భూముల మ్యుటేషన్లు మాత్రం ఆర్డీవో స్థాయిలో జరుగుతాయి. అది కూడా విచారణ చేసిన తర్వాతే చేస్తారు. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న తర్వాత నిర్దిష్ట కాలపరిమితిలో ఆర్డీవో మ్యుటేషన్ చేయాల్సిందే. రిజెక్ట్ చేస్తే సరైన కారణాలు చెప్పాలి. లేదంటే ఆ కాలపరిమితిలో డీమ్డ్ టూ బీ మ్యుటేటెడ్ గా భావించొచ్చు. ఆ నిర్దిష్ట కాలపరిమితి ఎన్ని రోజులు అనేది గైడ్ లైన్స్‌లో చెప్తారు.

ప్రశ్న: అప్పీల్ వ్యవస్థ సీసీఎల్ఏకు పెడితే ఎట్లా?

జ: కొత్త చట్టంలో తహశీల్దార్, ఆర్డీఓలకు అధికారాలు కట్టబెడుతున్నారు. వారిద్దరు చేసే దాని మీద అప్పీల్ చేసుకోవాలంటే వారి కంటే ఉన్నత స్థాయి అధికారులే ఉండాలి. అందుకే అదనపు కలెక్టర్/కలెక్టర్‌గా పెడుతున్నారు. ఆ తర్వాత రివిజన్ పిటిషన్ సీసీఎల్ఏ దగ్గర వేసుకోవచ్చు. వాళ్లు చేసిన పనికి వారి దగ్గరే అప్పీల్ చేసుకోవడం కుదరదు. అనేక మార్పుచేర్పులు కూడా ఆర్డీవో స్థాయిలో జరుగుతాయి. ఇది గైడ్‌లైన్స్ జారీ చేసినప్పుడు పూర్తిస్థాయిలో అర్థమవుతుంది. తప్పొప్పుల సవరణ, ఇతర సమస్యల పరిష్కార బాధ్యతలను ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ తప్పనిసరిగా నిర్దిష్ట గడువులోగా చేయాలని చట్టంలో ఉంది. ఆ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్లు కిందిస్థాయిలోనే ఉంటారు. అందుకే అదనపు కలెక్టర్/కలెక్టర్ స్థాయిలోనే అప్పీల్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. పైగా పెరిగిన భూమి విలువల ఆధారంగా అప్పీల్ వ్యవస్థను రూపొందించారు.

ప్రశ్న: గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు వస్తున్నారా?

జ: ఆర్వోఆర్ చట్టం 2024లో గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు వస్తున్నారని ఎక్కడా లేదు. కానీ ఆ అనివార్యత మాత్రం ఉన్నది. చాలా అంశాల్లో విచారణ, దర్యాప్తు, క్షేత్రస్థాయి పరిశీలన వంటివి తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లోనూ మ్యాప్ అన్నాం. డేటాను విలేజ్ అకౌంట్స్‌కి లింక్ చేశాం. ఇవన్నీ సజావుగా సాగాలంటే గ్రామస్థాయిలో ఎవరో ఒకరు ఏదో ఒక హోదాలో ఉండాల్సిందే. అంటే గ్రామస్థాయి రెవెన్యూ పాలన ఉంటేనే రైతుకు మేలు కలుగుతుందని అభిప్రాయం. పైగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు. ఏ పద్ధతి, ఎవరిని, ఎలా తీసుకుంటారనేది చట్టానికి సంబంధించిన అంశం కాదు. భూ పరిపాలనలో తీసుకురావాల్సిన సంస్కరణ మాత్రమే. ఇది భూ చట్టాల్లో ఒకటి మాత్రమే.

ప్రశ్న: కొత్త చట్టంలో ఏ అధికారి తప్పు చేసినా ఏం అనొద్దు. ఆయనపై చర్యలు తీసుకోవద్దు. అంటే అధికారి తప్పు చేస్తే శిక్షించొద్దా?

జ: తహశీల్దార్, ఆర్డీవోలకు జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయి. అయితే దేశంలోని ఏ ఆర్వోఆర్ చట్టంలోనూ క్రిమినల్ ప్రొవిజన్స్ లేవు. ఏ అధికారియైనా తప్పు చేస్తే అందుకు సంబంధించిన శిక్షలు ఉన్నాయి. అందుకే క్రిమినల్ ప్రొవిజన్స్ ఆర్వోఆర్ చట్టంలో పేర్కొనలేదు. మారిన క్రిమినల్ చట్టాల కింద ఎవరైనా రికార్డులను తారుమారు చేసినా, ఉద్దేశ్యపూర్వకంగా ఇంకేమైనా అన్యాయం చేసినా శిక్షలు విధించే వీలున్నది. గడిచిన నాలుగేండ్లుగా ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఆర్వోఆర్ 2020 ద్వారా ఎంతమంది అధికారులను శిక్షించారు? ఎవరెవరికి శిక్షలు పడ్డాయి? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? అందుకే క్రిమినల్ ప్రొవిజన్స్ పైన, మంచీ చెడులపైన విస్తృతంగా చర్చ జరగాలి. ఏ స్థాయిలో ఎవరిని ఎలా శిక్షించాలి? ఏ చట్టం ప్రకారం శిక్షించాలి? ఇలాంటి అంశాలపై అడ్వకేట్లు, రిటైర్డ్ అధికారులు, రైతు సంఘం నాయకులు చర్చించాలి. వారి అభిప్రాయం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

ప్రశ్న: చట్టంలో అసైన్డ్ భూములకు హక్కులు కల్పించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం హక్కులు కల్పిస్తామన్నది కదా!

జ: ఈ మధ్య కొందరు తమకు సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునేవారు, ఆఖరికి రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలం పని చేసినవారు కూడా అసైన్డ్ భూముల అంశంపై మాట్లాడుతున్నారు. ఆర్వోఆర్ చట్టానికి, అసైన్డ్ భూముల హక్కుల అంశానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఆ చట్టాలు వేరు కదా. అది అర్థం చేసుకోకుండా ఆర్వోఆర్ 2024లో ఈ అంశాన్ని పెట్టలేదని విమర్శిస్తున్నారు. ఇది కేవలం రికార్డ్ ఆఫ్ రెవెన్యూ చట్టం మాత్రమే. అసైన్డ్ భూములపైన నిర్ణయం తీసుకోవాలంటే దానికి ప్రభుత్వ ప్రత్యేక చట్టం లేదా ఉత్తర్వులు జారీ చేయాలి. ఆర్వోఆర్ 2024తో ముడిపెట్టొద్దు. రెవెన్యూ మంత్రి కూడా అన్ని చట్టాలను ఏకీకృతం చేస్తామని ప్రకటించారు. అప్పుడు మార్పులు చేసుకోవచ్చు. ఇప్పుడిది రెవెన్యూ రికార్డులకు సంబంధించిన అంశమే. అంతవరకే పరిమితమై విలువైన సూచనలు చేయాలి.

ప్రశ్న: ట్రిబ్యునల్స్ వేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి చట్టంలో పేర్కొనలేదు?

జ: రికార్డుల సవరణకు ట్రిబ్యునల్ అవసరం లేదు. దరఖాస్తు చేసుకోవడం, పరిష్కరించడం.. అన్యాయమని భావిస్తే అప్పీల్‌కి వెళ్లి తిరిగి న్యాయం పొందడం. కేసీఆర్ ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను రద్దు చేసింది. పెండింగులోని కేసులన్నింటిని పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్‌ని ఏర్పాటు చేసింది. ఆ ట్రిబ్యునల్స్‌లో ఎవరు ఉన్నారు? జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు ఉన్నారా? తిరిగి అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు మాత్రమే కదా పని చేసింది. అలాంటప్పుడు ట్రిబ్యునల్స్‌ని ఏర్పాటు చేయాలంటే ఎవరిని నియమించాలన్న దానిపై చర్చ జరగాలి. దీర్ఘకాలిక సమస్యలు, జఠిలమైన సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయొచ్చు. అయితే ఆర్వోఆర్ చట్టంలోనే పేర్కొనాలని లేదు. అవసరమని భావిస్తే ప్రత్యేకంగా రూపకల్పన చేయొచ్చు. ట్రిబ్యునల్స్, అప్పీల్ వ్యవస్థల మధ్య తేడా, అవసరాలపైన మేధావులంతా ఆలోచించాలి. ప్రభుత్వానికి సూచనలు చేయొచ్చు. ట్రిబ్యునల్స్ అవసరం ఎల్లకాలం ఉండదని గుర్తుంచుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed