మంత్రిపై రేవంత్ హాట్ కామెంట్స్.. అయినా నో కౌంటర్! ఆయన ఒంటరయ్యారా?

by Sathputhe Rajesh |
మంత్రిపై రేవంత్ హాట్ కామెంట్స్.. అయినా నో కౌంటర్! ఆయన ఒంటరయ్యారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలో ఒంటరయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వేముల అవినీతికి పాల్పడ్డారని, చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి సొంత జిల్లా నిజామాబాద్ నేతలు ఒక్కరూ స్పందించలేదు. కౌంటర్ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలంతా అధికారపార్టీకి చెందినవారే అయినా మౌనం పాటించడం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ కొనసాగుతున్నది. ఈ వ్యవహారం ప్రశాంత్ రెడ్డిని ఒంటరిని చేశారా అనే సందేహానికి బలం చేకూరుస్తున్నది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే అంశం హాట్ టాఫిక్‌గా మారింది.

రేవంత్ ఫైర్.. ప్రశాంత్ సైలెంట్

కేసీఆర్ ప్రధాన అనుచరుడు. రాష్ట్ర కేబినెట్‌లోనూ కీలక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నమ్మకస్తుడు కూడా. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణ బాధ్యతలు, సెక్రటేరియెట్, అమరవీరుల స్తూపం, అంబేడ్కర్ విగ్రహ పనుల బాధ్యతను ఆయనకే అప్పగించారు. దీంతో దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు చేపట్టిన యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మంత్రి వేములపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అమరవీరుల స్తూపం నిర్మాణంలో ఆంధ్రా కాంట్రాక్టర్ నుంచి రూ.50 కోట్లు తీసుకున్నాడని, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియెట్ నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారని, శ్రీరాంసాగర్‌లో దూకి చావాలని, ఆంధ్రోడి కమీషన్లకు కక్కుర్తి పడ్డాడని, ఆ అవినీతిపై విచారణకు ఆదేశించాలని, చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తామని రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అయినా..

నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందినవారే ఉన్నారు. ప్రశాంత్ రెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏ ఒక్కరూ ఖండించలేదు. జిల్లాలోని ఎమ్మెల్యేలంతా రేవంత్‌కు మద్దతు పలుకుతున్నారా అనేది పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీలో ఉండి జిల్లా మంత్రిపై విమర్శలు చేస్తే ఖండించకపోవడంలో అంతర్యమేంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

వారి మధ్య గ్యాప్ నిజమేనా?

కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో ఒడిపోవడంతో తిరిగి ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే బాల్కొండ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి విజయం సాధించడంతో కేసీఆర్ సన్నిహితుడు కావడంతో మంత్రి పదవిని అప్పగించారు.

అప్పటి నుంచి కవితకు ప్రశాంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఏర్పడిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా కవిత వెన్నంటి ఉంటున్నారని సమాచారం. నిధులు కావాలన్నా.. పనులు కావాలన్నా నేరుగా ఎమ్మెల్సీని కలిసి తెచ్చుకుంటున్నారని, మంత్రికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed