- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Revanth Reddy: బండి సంజయ్ వారిని రప్పించు.. 48 గంటల్లో బీఆర్ఎస్ నాయకులను బొక్కలో వేస్తా: రేవంత్ రెడ్డి

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజలు తిరస్కరించినా కేసీఆర్‌లో (KCR) మార్పు రాలేదని, ఫామ్‌హౌస్‌లో కూర్చుని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు. ఆయన అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని, ఈ రాష్ట్రంతో పేగుబంధం తెంపుకుంటూ పార్టీ పేరు కూడా మార్చుకున్నారని విమర్శించారు. ఇవాళ నిజామాబాద్‌లో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే లేరని, రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హత ఆ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయనివాళ్లకు తమను ప్రశ్నించే అర్హత ఎక్కడిదని అన్నారు. నిరుద్యోగులను పదేళ్లపాటు అనాథలుగా తిప్పింది బీఆర్ఎస్ కాదా? అని, తాము వచ్చాక 55,163 నియామకాలు చేపట్టింది నిజం కాదా? అని అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేసీఆర్ రూ. 8వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని ఆరోపించారు.
48 గంటల్లో బొక్కలో వేస్తాం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో (phone tapping case) ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు అమెరికా పారిపోతే ప్రధాని మోడీ, కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) లేఖ రాసి ఎందుకు స్వదేశానికి తీసుకురావడం లేదని సీఎం ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్ (KTR) అరెస్ట్ కాకుండా కాపాడుతున్నదే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అని ఆరోపించారు. ‘ఎప్పుడు అమెరికా నుంచి తీసుకువస్తారో చెప్పండి, రాష్ట్రానికి తెచ్చిన 48 గంటల్లో బీఆర్ఎస్ నాయకులను బొక్కలో వేస్తాం’ అని రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రారు, ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయదు గానీ ఉప ఎన్నికలు వస్తే మా తడాఖా చూపిస్తామని అంటున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. పదేళ్లలో ఎంతోమంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకున్నారని, టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకుని మంత్రిని చేయలేదా? కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మంత్రి పదవి ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడెక్కడి నుంచి వస్తాయని అన్నారు.
కేంద్రమంత్రులుగా ఉండి రెచ్చగొడతారా?..
బీసీ కులగణనపై బండి సంజయ్ తనకంటే బడా బీసీలే లేరు అన్నట్లు ఆకాశమంత ఎగురుతున్నారని, మరి 12 ఏళ్లుగా కేంద్రంలో మీరే అధికారంలో ఉండి ఎందుకు జణగణన చేసి అందులో కులగణనను (cast census) చేర్చలేదని సీఎం ప్రశ్నించారు. కులగణన చేసి లెక్కలు మీ ముందు పెడితే, మనం వండుకున్న అన్నంలో ఉప్పేసి తినడానికి పనికిరాకుండా చేయాలని బీజేపీ చేస్తున్న కుట్రలు బలహీన వర్గాలు అర్థం చేసుకోవాలన్నారు. నిజాలు పక్కన పెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు కేంద్ర మంత్రులుగా ఉండి కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ ముస్లింల విషయంలో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళణ, పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క సారళమ్మ, సీతారామ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, నిధులు, అనుమతులు ఇవ్వకుండా కేంద్ర మంత్రులను అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే అని కేంద్రంలోని బీజేపీ నేతలే తనతో చెప్పారని, ఇదా కిషన్ రెడ్డి నీ నీతి? ఇదేనా తెలంగాణకు చేసే సాయం అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.