'ముందు ఆ పని చేయండి'.. మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్

by Prasad Jukanti |   ( Updated:2024-05-08 13:54:33.0  )
ముందు ఆ పని చేయండి.. మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లు జోరుగా కొనసాగుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నరేంద్ర మోడీ, వయసు, అనుభవం రీత్యా తన కంటే పెద్దవారని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారంతా తన పక్కనే కూర్చొబెట్టుకుని తమపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. తాజాగా రేవంత్ రెడ్డి ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అవినీతి కేసులో నోటీసులు వచ్చిన వారందరికి మోడీ ఆశ్రయం కల్పిస్తున్నారని అలాంటి వారికే మోడీ తన పక్కన కుర్చీలు వేసి కోర్చోబెట్టుకుంటున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉండి బీజేపీకి ఎన్నికల బాండ్లు ఇచ్చిన వ్యక్తిని, మహారాష్ట్రలో అజిత్ పవార్, కర్నాటకలో దేవేగౌడ, కుమార స్వామి, అసోంలో హిమంత బిస్వా శర్మ, నవీన్ జిందాల్ ను పక్కనే కూర్చొబెట్టుకున్నది మోడీ కాదా అని ప్రశ్నించారు. అవినీతి నిర్మూలించాలనే ఆలోచన మోడీకి ఉంటే ముందు ఆయన చుట్టూ ఉన్న అవినీతిపరులను జైలుకు పంపాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత కాలం అవినీతిపరులు అవుతున్నారని బీజేపీలో చేరగాని సత్సీలులుగా మారుతున్నారని ధ్వజమెత్తారు.

ఫాక్స్ కాన్, టెస్లాపై బీజేపీ ఒత్తిడి:

తెలంగాణకు వస్తున్న పెట్టుబడులను ప్రధాని మోడీ, అమిత్ షా భయపెట్టి గుజరాత్ కు తరలించుకుపోతున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫాక్స్ కాన్, టెస్లా ప్లాంట్ లు తెలంగాణలో స్థాపించేందుుకు ముందుకు వస్తే వారిపై బీజేపీ ఒత్తిడి చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై బీజేపీ ఒత్తిడి తీసుకువచ్చిందని ఈ విషయం తాను ముఖ్యమంత్రిగా చెబుతున్నానన్నారు. ఇవే కాకుండా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన అనేక సంస్థలను గుజరాత్ కు తరలించారని మోడీ, అమిత్ షా కేవలం గుజరాత్ మాత్రమే భారత్ అనుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణ కట్టిన పన్నులను ఇతర రాష్ట్రాలకు పంచుతూ జాతీయ ప్రాజెక్టుల్లో మాత్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు.

మోడీ ఆచారాలు దేశమంతా అనుసరించాలంటే ఎలా?:

గతేడాది సావన్‌ మాసంలో రాహుల్ గాంధీ, లాలు ప్రసాద్ యాదవ్ మటన్ తిన్నారని నవరాత్రుల సందర్భంగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ చేపల వేపుడు తిని భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని బీజేపీ విమర్శిస్తోందన్న ప్రశ్నకు బదులించిన రేంవత్ రెడ్డి.. వారి ఆరోపణలను తప్పు పట్టారు. ఆచార వ్యవహారాల విషయంలో ఒక్కొక్క ప్రాతంలో ఒక్కోరకంగా ఉంటాయన్నారు. దక్షిణ భారత దేశంలో ప్రతి దేవాలయంలో మేకలను కోస్తారు. చరిత్రను గమనిస్తే బ్రాహ్మణులు పూజ చేసే ముందు నాన్ వెజ్ తినేవారు. మోడీ అవలంబించే గుజరాత్, రాజస్థాన్ ప్రాక్టీస్ ను మొత్తం దేశంపై రుద్దాలనుకోవడం సరికాదన్నారు. నరేంద్ర మోడీ దృష్టిలో సౌత్ ఇండియన్స్ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గా ఉన్నారని అందువల్లే కేంద్ర కేబినెట్ లో దక్షిణ భారత దేశం నుంచి సరైన ప్రాతినిధ్యం దక్కలేదని ఆరోపించారు.

మనుగడకోసం వారు నా పేరు ప్రస్తావించాల్సిందే:

తెలంగాణలో రాజకీయంగా మనుగడ సాధించాలనుకుంటే అది కేసీఆర్, ఓవైసీ, బీజేపీ వాళ్లైనా తన పేరు తీసుకోవాల్సిందేనన్నారు. తానేంటో తన పనితనం ఏంటో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేకు తెలుసన్నారు. ఏబీవీపీ, సంఘ్ పరివార్ నుంచి రాలేదని రేవంత్ రెడ్డి చెప్పగలరా అని ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తన రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకమేనని, తాను కాంగ్రెస్ లో చేరిన నాడే తన బ్యాక్ గ్రౌండ్ అంతా రాహుల్ గాంధీకి వివరించానన్నారు. ఆర్ఎస్ఎస్ తో ఎలాంటి సంబంధాలు లేవని ఓవైసీ చెప్పాలంటున్నారు.. కాశీం రజ్వీతో వారి పార్టీకి ఉన్న సంబంధాన్ని తాను ప్రశ్నించానా? తాను విద్యార్థి పరిషత్ ఐడియాలజీ నుంచి కాంగ్రెస్ ఐడియాలజీ వైపు వచ్చిన నన్ను అభినందించాలన్నారు. విద్యార్థి పరిషత్ ఆలోచనే ఉంటే కాంగ్రెస్ లో చేరకుండా బీజేపీలోనే చేరేవాడిని కదా అన్నారు.

మోడీ పెద్దన్న వ్యాఖ్యల్లో తప్పేముంది:

పెద్దన్నలా వ్యవహించి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని తాను ప్రధాన మంత్రిని కోరానని.. ముఖ్యమంత్రులందరికి ప్రధాని అనే వ్యక్తి పెద్దన్నలాంటి వారే కదా అన్నారు. ఒక ముఖ్యమంత్రి ప్రధానిని పెద్దన్న అంటే అందులో తప్పేముందని ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకుని కట్ అండ్ పేస్ట్ చేసి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై పోలింగ్ తర్వాత మా లీగల్ టీమ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటాన్నారు. బీజేపీ ప్రధాన లక్ష్యం రిజర్వేషన్లు తొలగించడం, రాజ్యాంగాన్ని మార్చడమే అని అందుకే ఆ పార్టీ 400 సీట్లు అడుగుతోందన్నారు.

రోహిత్ వేముల కేసు బీఆర్ఎస్ సర్కారే క్లోజ్ చేసింది:

రోహిత్ వేముల కేసును గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్లోజ్ చేసిందని ఈ కేసు 2016లో నమోదు అయితే 2019 క్లోజ్ చేశారన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఈ విషయం వెలుగులోకి వచ్చిందని అందువల్లే తాము రీ ఓపెన్ చేశామన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీపై ఉన్న ప్రమేతో ఈ కేసులో అందరికి క్లీన్ చీట్ ఇచ్చారని ఆరోపించారు. రోహిత్ వేముల చట్టం తీసుకువస్తామని 2018-19 ఎన్నికల్లో ప్రస్తావించాం. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయాన్ని ఎక్కడా ఎత్తుకోలేదన్నారు. బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ తొక్కిపెడుతోందనే వాదన తప్పని తాము అధికారంలోకి వచ్చాక కాళేశ్వరంపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేశామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు జరుగుతోంది. కోర్టు తీర్పుల ఆధారంగా నిందితులను జైలుకు పంపాల్సి ఉంటే పంపుతామన్నారు. వ్యక్తిగత పగ సాధించుకునేందుకు ముఖ్యమంత్రి కుర్చీని వాడుకునే వ్యక్తిని కాదని, నిజంగా పగ సాధించాలనుకుంటే వంద దారులు ఉంటాయన్నారు. ప్రజల కోసమే తన పదవిని ఉపయోగిస్తునన్నారు. తమ గ్యారెంటీలు అమలు అవుతున్నాయో లేదే తెలుసుకోవాలంటే కేటీఆర్ చీర కట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కితే తెలుస్తుందని అతడికి సినీ ఇండరస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయని మంచి చీర కట్టుకుని బస్సెక్కాలని సెటైర్ వేశారు. వందరోజుల్లోనే తాము హామీలు అమలు చేయలేదని కుర్చి దిగిపొమ్మంటున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందని ప్రశ్నించారు. తాము ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. పదేళ్లుగా ప్రధాని పీఠంపై కూర్చున్న మోడీ అధికారంలో ఉండాలి, సీఎం బాధ్యతలు చేపట్టిన వందరోజులే అయిన తాను దిగిపోవాలంటున్న కేసీఆర్ ఎవరి పక్షమో అర్థం చేసుకోవాలన్నారు.

సర్జికల్ స్ట్రైక్ లో కాకి కూడా చావలేదంటున్నారు:

మంచి మాటల కంటే చెడు మాటలే తొందరగా వ్యాప్తి చెందుతాయని రాహుల్ గాంధీ చెప్పే మంచి మాటలు అర్థం చేసుకోవడాని టైమ్ పడుతుందన్నారు. పాక్ ప్రధాని బర్త్ డే వేడుకలకు రాహుల్ గాంధీ వెళ్లలేదని మోడీ వెళ్లారన్నారు. సర్జికల్ స్ట్రైక్ జరిగిందో లేదో కానీ బీజేపీ మంచిగా మార్కెట్ చేసుకుందని ఆరోపించారు. ఇందులో కాకీ కూడా చావలేదని ప్రజలు చెప్పుకుంటున్నారు. పుల్వామలో ఏం జరిగిందో వారి ప్రభుత్వమే నియమించిన కశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఏం చెప్పారో వీడియోలు బహిరంగంగా ఉన్నాయన్నారు.

Read More...

తెలంగాణలోని ఆ జిల్లాలో మోడీకి యువ మిత్రుడు..ఫోటో విడుదల చేసిన ప్రధాని



Advertisement

Next Story