ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై స్పందించిన రేవంత్ రెడ్డి

by GSrikanth |   ( Updated:2023-03-10 12:14:46.0  )
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంపై స్పందించిన రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశాన్ని కుదిపేస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కాంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. ‘హాత్ సే హాత్ జోడో యాత్ర’లో భాగంగా శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన లిక్కర్ స్కాం కేసును పక్కదారి పట్టించేందుకే ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేపట్టారని ఆరోపించారు. దేశంలో అదానీ స్కాంపై చర్చ జరగకుండా, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా లిక్కర్ స్కాం కేసును తెరమీదకి తెచ్చారన్నారు. బీజేపీ-బీఆర్ఎస్‌లు వీధి నాటకాలు ఆడుతున్నాయంటూ ఆయన మండిపడ్డారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న కవిత అప్పుడు ఎందుకు పార్లమెంట్‌లో రిజర్వేషన్లపై మాట్లాడలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని రేవంత్ అన్నారు. మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకురాలు సోనియా పట్ల వ్యవహరించనట్లు..లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహరించడంలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డా, ఆరోపణలు ఎదుర్కొన్నా కొడుకైనా, కూతురైనా సరే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కూతురు కవితను ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించడం లేదని రేవంత్ రెడ్డి నిలదీశారు.

అవినీతి ఆరోపణల నెపంతో డిప్యూటీ సీఎంగా వున్న రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారని రేవంత్ అన్నారు. ఈ ఇష్యూపై మౌనంగా ఉంటున్న కేసీఆర్, బండి సంజయ్‌కి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు ముందుగా జంతర్ మంతర్ వద్ద ముక్కు నేలకు రాసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలని హెచ్చరించారు. బండి సంజయ్ కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌పై పోటీ చేస్తావా అని ఆయన సవాల్‌ విసిరారు. గతంలో పోటీ చేసిన సంజయ్, ఇప్పుడు పోటీ చేయకపోతే బీజేపీకి, బీఆర్ఎస్‌కి మధ్య చీకటి ఒప్పందం ఏమిటో ప్రజలు గుర్తిస్తారని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed