వడ్ల కొనుగోలుపై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్

by Sathputhe Rajesh |
వడ్ల కొనుగోలుపై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వైఖరితో ప్రజల్లో ఉగాది పండగ ఉత్సాహం లేదని, పారాబాయిల్డ్​ రైస్​ ఇవ్వమని లేఖ లిఖితపూర్వకంగా కేంద్రానికి రాసిచ్చిన కేసీఆర్​ రైతులకు మరణం శాసనం రాశారని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి మండపడ్డారు. గతేడాది అక్టోబర్​ 4న సివిల్​ సప్లై కమిషనర్​ అనిల్​ కుమార్​ ఎఫ్​సీఐకి లెటర్​ ఇచ్చారని, భవిష్యత్తులో పారాబాయిల్డ్​ రైస్​ ఇవ్వమని సంతకం పెట్టారన్నారు. గాంధీభవన్​లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లపై దొంగ నాటకాలు ఆడుతున్నారని, ఈ లేఖతో తెలంగాణ రైతుల జుట్టు కేంద్రానికి కేసీఆర్​ అందించారన్నారు. కేంద్రం మెడమీద కత్తి పెడితే సంతకం పెట్టినట్లు చెప్పుతున్న కేసీఆర్​.. ఆయన మెడమీద ఏకే 47 పెట్టి ఫాంహౌజ్​ రాసివ్వమంటే రాసిస్తారా అని, సీఎం కుర్చీ ఇస్తారా అని ప్రశ్నించారు. దీంతో తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారని, రైతుల హక్కులను కేంద్రానికి తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారని, పారాబాయిల్డ్​ రైస్​ ఇవ్వమని సంతకాలు చేసిన కేసీఆర్​ను ఉరి తీయాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని రైతులు రాళ్లతో కొట్టి చంపాలని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్​లో కూడా పీయూష్​ గోయల్​ పారాబాయిల్డ్​ రైస్​ కొనమని చెప్పుతున్నారంటే కేసీఆర్​ లేఖ కారణమని, ఈ లేఖ రాయకుంటే పీయూష్​ గోయల్​ను అంగీ పట్టుకుని గుంజుకొచ్చి నడి రోడ్డుమీద కొట్టేవాళ్లమన్నారు. ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్​ చేశారు. వడ్ల కొనుగోలుపై మార్చి మొదటవారం నుంచే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉందని, ఉగాది వచ్చినా అంత వరకు అంచనాలు లేవని, ఇప్పుడు ప్రక్రియ మొదలుపెడితే నెల రోజుల సమయం పడుతుందని, అప్పటి వరకు రైతుల చావాల్సిందేనని ప్రశ్నించారు.

దోచుకోవడమే లక్ష్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఏదో రకంగా దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో గ్యాస్ రూ. 414, డీజిల్ రూ. 55, పెట్రోల్ రూ. 71గా ఉండేదని, ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పడి పోయాయని, అయినప్పటికీ ధరలు పెరిగాయన్నారు. కేంద్రం పన్నుల రూపంలో రూ.10లక్షల కోట్లు దోచుకుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ మీద పన్నుతో రూ.36 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశాయని, లీటర్ పెట్రోల్‌పై కేంద్రం రూ. 30, రాష్ట్రం రూ. 35 టాక్స్ వసూలు చేస్తున్నాయని, చత్తీస్‌ఘడ్‌లో రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించిందన్నారు. ధరల పెంపులో కేంద్రం, రాష్ట్రం ప్రభుత్వాలు రెండూ దోషులేనని, దోపిడీలో రెండూ ఒక్కటేనన్నారు.

తూటాలకు నేనే ముందుంటా

విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 17వేల కోట్లు బకాయి పడిందని, దీంతో విద్యుత్ సంస్థలు దివాలా తీసి కుప్ప కూలుతున్నాయని రేవంత్​రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం బకాయిలు తీర్చడానికి ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం వేస్తోందని, వ్యవసాయానికి ఉచితం ఇచ్చి ఇంటి బిల్లు డబుల్ వసూల్ చేస్తున్నాడని విమర్శించారు. విద్యుత్​ చార్జీల పెంపుపై బషీర్​బాగ్​ ను మించి వీరోచిత పోరాటం విద్యుత్​ సౌధ ముందు జరుగాలని, ఇందులో అందరూ పాల్గనాలని, కమ్యూనిస్టు సోదరులు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. లాఠీ దెబ్బలకు, తుపాకీ తూటాలకు తానే ముందుంటానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.

కాంగ్రెస్​ నిరసనలుf

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా కాంగ్రెస్​ పార్టీ నిర్ధిష్ట కార్యాచరణ తీసుకున్నట్లు రేవంత్​రెడ్డి ప్రకటించారు. ఈ నెల 3న రాష్ట్రమంతా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాల విధానాలను ఖండించాలని, 4న మండల కేంద్రాల్లో నిరసన చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 6న జిల్లా కేంద్రాల్లో నిరసన, 7న విద్యుత్​ సౌధ, పౌరసరఫరాల శాఖ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నట్లు రేవంత్​రెడ్డి ప్రకటించారు. మిలిటెంట్​ పోరాటానికి సిద్ధం కావాలని, ఈ పోరాటాలకు ప్రజలే నాయకత్వం వహించాలని కోరారు. ఈ పోరాట కార్యాచరణలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్​ గాంధీ స్వయంగా పాల్గొంటారని రేవంత్​రెడ్డి ప్రకటించారు.

Advertisement

Next Story