గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టడంపై రేవంత్ సర్కార్ ఫోకస్

by karthikeya |   ( Updated:2024-10-11 03:14:42.0  )
గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టడంపై రేవంత్ సర్కార్ ఫోకస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతి, డిజిటలైజేషన్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. దీనికి ఆల్టర్నేట్ చూపించకపోవడంతో భూ పరిపాలన వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోయింది. అంతేకాకుండా ప్రభుత్వ భూముల పరిరక్షణ, సంక్షేమ పథకాల దరఖాస్తుల పరిశీలన, వివిధ ధ్రువపత్రాల విచారణకు కూడా ఉద్యోగి లేని పరిస్థితి ఏర్పడింది. అధికార కేంద్రీకరణ జరిగి ప్రతి సమస్య పరిష్కారానికీ జిల్లా కేంద్రం, హైదరాబాద్ కు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక దాని కోసం కసరత్తు ముమ్మరం చేసింది.

ఆర్వోఆర్-2024 ద్వారా..

రైతాంగానికి సత్వర సేవలు అందాలంటే గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ అనివార్యమని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారు. ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ ఉద్యోగి ఉండేటట్లు చూస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆర్వోఆర్- 2024లోని చాలా అంశాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన, దర్యాప్తు, విచారణ వంటి పదాలను జోడించారు. అంతేకాకుండా చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం గ్రామ రెవెన్యూ (విలేజ్ అకౌంట్) రికార్డుల నిర్వహణ చేపట్టనున్నట్లు చెప్పారు. గతంలో ఈ బాధ్యతలను వీఆర్వోలే నిర్వహించే వారు. దీంతో అదే స్థాయి ఉద్యోగి ఊరికొకరు రానున్నట్లు స్పష్టమవుతున్నది. అయితే గతంలో మాదిరిగా వీఆర్వో వ్యవస్థకు భిన్నంగా ఉంటుందా? మరేదైనా పేరుతో ఉంటుందా? అన్నది తేలాల్సి ఉంది. వీఆర్వోకు బదులుగా జూనియర్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లేదా మరే ఇతర పేరుతోనో రూపొందించే చాన్స్ కూడా ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.

ఎవరిని తీసుకుంటారంటే..

గ్రామీణ రెవెన్యూ వ్యవస్థలో ఊరికొక్కరిని తీసుకునేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో పని చేసిన వీఆర్వోలందరినీ తీసుకోవడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్ట్ రిక్రూట్ వీఆర్వోలను నేరుగా తీసుకోవడం, డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన అందరికీ ఎగ్జామ్ నిర్వహించి ఎంపిక చేసుకోవడం, లేదంటే టీజీపీఎస్సీ ద్వారా పూర్తిగా నియామకాలు చేపట్టడం వంటి ఆప్షన్లపై చర్చ నడుస్తుంది. వీటిలో ఏ ప్రాతిపదికన నియామకాలు చేపడుతారన్నది కేబినెట్ లో చర్చించిన తర్వాతే తేలే అవకాశముంది. ఉన్నతాధికారులు మాత్రం ఈ మేరకు ప్రతిపాదనలు పంపారు. గతంలో ఎలాంటి రెవెన్యూ వ్యవస్థ ఉంది? నియామకాల ప్రక్రియ విధానం, ఎంత మంది ఏ తీరున ఉద్యోగంలో చేరారు? ఇలాంటి అన్ని అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేశారు. అందులో వీఆర్ఏల నుంచి వీఆర్వోలుగా వచ్చిన వారి జాబితా కూడా ఉంది. అలాగే వీఆర్ఏలు కొందరు తహశీల్దార్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న అంశం కూడా చర్చలో ఉంది. అయితే ఈ మేరకు ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్లు జరుగుతున్నాయి. ఏది తక్కువ బడ్జెట్ తో సర్దుబాటు అవుతుందో, దాన్ని బట్టి ఓ నిర్ణయాన్ని తీసుకునే చాన్స్ ఉందని సమాచారం. అయితే తామంతా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే పరీక్ష రాసి వీఆర్వోగానే చేరిన వాళ్లే అని వారు చెబుతున్నారు.

తాత్కాలిక జూనియర్ అసిస్టెంట్లు..

వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలైతే ఉండవని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దయినప్పుడు వాళ్లకు ఏ శాఖలోకి వెళ్తారన్న ఆప్షన్ ఇవ్వకుండానే బలవంతంగా డెప్లాయ్ చేశారు. మరోసారి అలాంటి తప్పిదం చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సొసైటీలు, కార్పొరేషన్లు, హోం, మున్సిపాలిటీ శాఖల్లోకి వెళ్లిన పూర్వపు వీఆర్వోలు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే అక్కడ ఉద్యోగం చేయలేక దీర్ఘకాలిక సెలవు పెట్టిన వారూ ఉన్నారు. వారిలో చాలా మంది డైరెక్ట్ రిక్రూటీస్ ఉన్నారు. పైగా డిగ్రీ, పీజీలు చదివిన వారున్నారు. వాళ్లకే ఈ ఆప్షన్లు ఉపయోగపడనున్నాయని అంచనా.

కార్పొరేషన్లు, అటానమస్ బాడీలకు వెళ్లిన వాళ్లు, అలాగే ఇష్టం లేని, క్రిటికల్ శాఖలు మున్సిపాలిటీ, హోంశాఖ (పోలీస్, జైళ్ల, ప్రాసిక్యూషన్) వాళ్లు, అలాగే శాఖల మార్పు కోరుకుంటున్న మొత్తం 1500 మందికి పైగానే ఉన్నారు. వీరంతా రెగ్యులర్ ప్రభుత్వ శాఖల్లోకి పంపిస్తే తమ సమస్య పరిష్కారమవుతుందన్న భావనతో ఉన్నారు. అలాగే వీఆర్ఏలను కూడా వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. అయితే పోస్టు లేకపోయినా వారికి పోస్టింగ్ ఇచ్చారు. ఉదాహరణకు కొన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో నలుగురు, ఐదుగురు వీఆర్ఏ వ్యవస్థ నుంచి వచ్చి జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. వాస్తవానికి మండల స్థాయిలో ఒక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టు మాత్రమే ఉంది. ఆ పోస్టులన్నీ అంతకు ముందే భర్తీ అయ్యాయి. వీరిని కూడా అదే పేరిట పని చేయిస్తున్నారు. ఒక్కరు చేయాల్సిన విధులను అందరితో చేయిస్తున్నారు. పైగా ఇది టెంపరరీ పోస్టు మాత్రమేనని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిందేనంటున్నారు.

విలేజ్ రెవెన్యూ సిస్టం అవసరం

ఆర్వోఆర్ యాక్ట్-2024 ముసాయిదా ప్రకారం తాత్కాలిక, శాశ్వత భూదార్, భూదార్ కార్డుల జారీ, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, దరఖాస్తుల పరిశీలన, వీలునామా, వారసత్వ విషయంలో మ్యుటేషన్ లో విచారణ, సెక్షన్ 13 ప్రకారం గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, నిర్ణయించిన రీతిలో హక్కుల రికార్డుల తుది ప్రచురణ వంటివి అమలు చేయాలి. ధరణి పోర్టల్ లో తప్పొప్పుల సవరణతోపాటు అసలే నమోదు కాకుండా పార్టు బి కింద పేర్కొన్న సుమారు 18 లక్షల ఎకరాల డేటాను పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేయాల్సి ఉంది. ప్రభుత్వం పార్టు బి కింద పేర్కొన్న వాటిని ఏబీసీడీ వర్గీకరణ చేయాలని నిర్ణయించింది. ఆ భూ సమస్యల స్థితి, స్థాయిని బట్టి ఎవరు పరిష్కరించాలనే దానికి త్వరలోనే గైడ్ లైన్స్ రూపొందించనున్నదని విశ్వసనీయంగా తెలిసింది. కోర్టు కేసులు మినహా మిగతా భూముల డేటాను పరిశీలించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇలాంటి అనేకాంశాల్లో గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది అనివార్యంగా మారుతున్నది.

కష్టాలు.. నష్టాలు

గత ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్వోలపైన తీసుకున్న అనాలోచిత చర్యల వల్ల పూర్తి స్థాయిలో నష్టపోయామన్న భావన ఉంది. ప్రస్తుత ప్రభుత్వం గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగి అనే విధానంతో ముందుకు వస్తున్న వార్తల నేపథ్యంలో పెద్ద చర్చ నడుస్తున్నది. ఇప్పటికే ప్రమోషన్, సీనియారిటీ విషయాల్లో అన్యాయానికి గురైన తమను మరోసారి నష్టపోవడానికి కాంపిటీటివ్ పరీక్ష ద్వారా వచ్చిన మేము సిద్ధంగా లేం అంటున్నారు. గ్రామీణ రెవెన్యూ వ్యవస్థని ఏ రకంగా తీసుకురాబోతున్నారననే దానిలో జాబ్ చార్ట్, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి? మినిస్టీరియల్ సర్వీస్ లో భాగంగా వస్తున్నామా? లేక పూర్వపు మాదిరిగానే వస్తున్నామా? రెవెన్యూలో కింది స్థాయి ఉద్యోగులుగా ఉండబోతున్నామా? తమను కింది స్టాఫ్ అంటారా? అనే విషయాలపై ఆందోళనకు గురవుతున్నట్లు డైరెక్ట్ రిక్రూటీ వీఆర్వోలు గ్రూపుల్లో చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కనీసం ఒక గంట సమయం తమకు కేటాయించి చర్చించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story