సీఎం కేసీఆర్ రూపంలో కొత్త లొల్లి.. మళ్లీ మొదటికొచ్చిన కొలువుల భర్తీ!!

by GSrikanth |   ( Updated:2022-09-21 03:31:59.0  )
సీఎం కేసీఆర్ రూపంలో కొత్త లొల్లి.. మళ్లీ మొదటికొచ్చిన కొలువుల భర్తీ!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల ప్రకటనతో సీఎం కేసీఆర్ కొత్త చిచ్చు పెట్టారు. ఇప్పటి వరకు కొలువుల కోసం ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులు.. కొలువులను భర్తీ చేసేందుకు జాబితా పట్టుకుని పడిగాపులు పడుతున్న ప్రభుత్వ శాఖలకు టెన్షన్​పట్టుకుంది. ఎందుకంటే ఇప్పటికే 52 వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. 20 వేల పోస్టులకు టీఎస్​పీఎస్సీ, పోలీస్​రిక్రూట్ మెంట్​బోర్డులు నోటిఫికేషన్లు ఇచ్చాయి. పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్ష పూర్తయింది. వచ్చే నెల టీఎస్​ పీఎస్సీ ఆధ్వర్యంలో కీలకమైన గ్రూప్ - 1 పోస్టులకు కూడా ప్రిలిమ్స్ జరుగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వివాదం తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్ రూపంలో లొల్లి మొదలైంది. వారం రోజుల్లో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో వస్తే.. ఉన్న పోస్టులకు వర్తిస్తుందా.. మొత్తం పోస్టులకు అమలు చేయాలా.. అనేది సందేహంగా మారింది. ఒకవేళ ఈసారి భర్తీ చేస్తున్న 80 వేల పోస్టులకు అమలు చేయాలంటూ మాత్రం ఇక ఉద్యోగాల భర్తీ మరో ఏడాది సాగినట్లే.

గుర్తించి.. జాబితా

ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. గ్రూప్ - 1 నుంచి గ్రూప్ –4 వరకు మొత్తం ఉద్యోగాలతో పాటుగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ వరుస నోటిఫికేషన్లు వస్తాయని చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఆర్థిక శాఖ 52,460 పోస్టులకు అనుమతిచ్చింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన తర్వాత టీఎస్​ పీఎస్సీ నుంచి 2,639 పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చాయి. అదేవిధంగా పోలీస్​ రిక్రూట్ మెంట్ బోర్డు నుంచి 17,516 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిలిమ్స్​ పరీక్ష కూడా పూర్తయింది. ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టులు, నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులన్నీ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ల ప్రాతిపదికన ఖరారు చేసి, ఏ వర్గాలకు ఎన్ని పోస్టులో ఖరారు చేశారు. గ్రూప్​–1 కింద ఎస్టీలకు 3 పోస్టులు దక్కాయి. ఇలా మొత్తం నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులన్నీ డీటెల్ట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అంటే, ఏ వర్గాలకు ఎన్ని, బీసీలు, బీసీల్లోని వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటుగా మహిళలు, దివ్యాంగులు ఇలా అన్నీ తేల్చిన తర్వాతే ఎవరికి ఎన్ని పోస్టులో వివరించి, నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న రిజర్వేషన్ల ప్రకారం గిరిజనులకు 6 శాతం చొప్పున ఖరారు చేశారు. అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన పోస్టుల్లోనూ ఇదే పద్దతి తీసుకున్నారు. దీంతో మొత్తం గిరిజనులకు 3147 పోస్టులు దక్కనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 80,039 పోస్టులకు ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ల ప్రకారం 4802 పోస్టులు రానున్నాయి.

అమలైతే.. ఎలా?

ప్రస్తుతం సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే.. మొత్తం పోస్టులపై 8,003 పోస్టులు ఎస్టీలకు దక్కాల్సి ఉంటోంది. ఇప్పటి వరకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన ప్రకారం 52 వేలల్లో 5246 పోస్టులు, నోటిఫికేషస్లు విడుదల చేసిన 20 వేల పోస్టుల్లో 2015 ఉద్యోగాలు వీళ్లకు రావాల్సి ఉంటోంది. కానీ, నాలుగు శాతం తక్కువగా ఉంటున్నాయి.

ముందు నుయ్యి.. వెనక గొయ్యి

సీఎం కేసీఆర్ ప్రకటనతో ప్రభుత్వానికి ఎటూ తేలని వ్యవహారంగా మారింది. ఒకవేళ సీఎం చెప్పినట్టే జీవో జారీ చేస్తే దానిని ఎప్పటి నుంచి వర్తింప చేయాలనేది కూడా ముఖ్యంగానే మారుతోంది. అలా చేస్తే.. వచ్చే ఎన్నికల నాటికి కూడా అదే ఫార్ములాను తీసుకుంటే స్థానిక సంస్థలతో పాటుగా కేసీఆర్ చెప్తున్నట్టుగా అసెంబ్లీలోనూ గిరిజన నేతల సంఖ్య పెరుగుతోంది. ఇదంతా రాజకీయంగా పరంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం చాలా సమస్యలు తెచ్చి పెడుతోంది.

ఇక సాగదీతే..?

నిజంగానే 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ జీవో ఇచ్చిన తర్వాత ఉద్యోగాలన్నింటికీ వర్తింప చేస్తే.. ఇప్పుడు జారీ చేసిన నోటిఫికేషన్లన్నీ మార్చాల్సి ఉంటోంది. లేని పక్షంలో దానిపై కోర్టు కేసులు నమోదవుతాయి. అంతేకాకుండా ఆర్థికశాఖ అనుమతిచ్చిన పోస్టుల్లో కూడా ఎస్టీలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లను తీసిన తర్వాతే మళ్లీ అప్రూవ్​చేయాల్సి వస్తోంది. దీని ప్రభావం మిగిలిన వర్గాలపై పడుతోంది. ఒకవేళ కొత్త ఉద్యోగాలకు మాత్రమే 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంటే.. ఇప్పటి వరకు జారీ చేసిన పోస్టుల్లో గిరిజన వర్గాలకు అన్యాయం జరుగుతుందని గిరిజన నిరుద్యోగులు అంటున్నారు. ఒక్కో నోటిఫికేషన్‌లో 4 శాతం అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. దీనిపైనా కూడా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో మొత్తంగా 10 శాతం అమలు చేయాలని భావిస్తే మాత్రం.. ఇక ఉద్యోగాల కథ మళ్లీ మొదటికి రానుంది. దీంతో ఈ ఏడాది ఉద్యోగాల ఆశ వదిలేసుకోవాల్సిందే.

ప్రమోషన్లపైనా అదే గొడవ

అంతేకాకుండా ప్రస్తుతం పనిచేస్తోన్న ఉద్యోగుల అంశంలో కూడా వివాదాలు రానున్నాయి. ఇటీవల కొన్ని శాఖల్లోపదోన్నతుల ప్రక్రియ పూర్తి చేశారు. దానిలో రిజర్వేషన్లను పాటించారు. కానీ, ఇప్పుడు 10 శాతం అమలు చేస్తే.. ప్రమోషన్ పొందే గిరిజన ఉద్యోగులు పెరుగుతారు. దీంతో ఇప్పటి వరకు ప్రమోషన్ పొందిన వారికి రివర్సన్​వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి సీఎం కేసీఆర్​పెట్టిన చిచ్చు.. ఉద్యోగ వర్గాల్లో రగులుతోంది.

Also Read : మునుగోడు TRS అభ్యర్థి ఖరారు.. ఆరోజే అధికారిక ప్రకటన!

Advertisement

Next Story

Most Viewed