దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం: మంత్రి

by GSrikanth |
దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం: మంత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూన్ 2 నుండి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 44వ జాతీయ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌ను నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆర్మ్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఆదివారం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో మంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. పోటీల వివరాలపై చర్చించారు. ఈ ఛాంపియన్ షిప్‌లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు కజాకిస్థాన్, టర్కీలలో జరగనున్న ఏషియన్, వరల్డ్ ఆర్మ్ ఛాంపియన్ షిప్‌లలో పాల్గొననున్నట్లు ఛాంపియన్ షిప్ ప్రతినిధులు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. క్రీడా హబ్‌గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అందులో భాగంగా క్రీడా రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచేలా క్రీడాకారులను, కోచ్‌లకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. జాతీయ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌నకు ప్రభుత్వం తరపున సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్మ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు హసిం రాజా జబెత్, ఉపాధ్యక్షులు మహమ్మద్ జలీల్ ఫారూఖ్ రూజ్, సయ్యద్ మహమూద్ అలీ, ప్రధాన కార్యదర్శి ముస్తఫా అలీ, సభ్యులు శ్రేయ జోన్ వుడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story