పునర్ వ్యవస్థీకరణ సరే.. పదోన్నతులెప్పుడు?

by Anjali |
పునర్ వ్యవస్థీకరణ సరే.. పదోన్నతులెప్పుడు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీనియారిటీ విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆర్ అండ్ బీ శాఖలో ప్రమోషన్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రావడం లేదు. దీంతో ఇన్ చార్జిలకు బాధ్యతలు అప్పగించాల్సి వస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు కొందరు వెళ్లగా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మరికొందరు వచ్చారు. అయితే తొమ్మిదేళ్లుగా సీనియార్టీ విషయంలో ఏపీ నుంచి స్పష్టత రాకపోవడంతో ప్రమోషన్ల వ్యవహారం మూలన పడింది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి కొత్తగా సర్కిళ్లు, కార్యాలయాలను ప్రారంభిస్తుండడంతో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది.

ప్రమోషన్లపై స్పష్టత వచ్చేఅవకాశాలు లేకపోవడంతో కార్యాలయాల బాధ్యతలను ప్రభుత్వం ఇన్ చార్జిలకు అప్పగిస్తున్నది. అయితే డిపార్ట్ మెంట్ కొత్త సెటప్ అవసరాన్ని బట్టి ప్రభుత్వం కొత్తగా మూడు చీఫ్ ఇంజినీర్ పోస్టులు, 10 సర్కిల్ సూపరింటెండెంట్ పోస్టులు, 13 డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు, 79 సబ్ డివిజన్ డిప్యూటీ ఇంజినీర్ పోస్టులు,, 124 సెక్షన్ల జూనియర్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేసింది.

పునర్ వ్యవస్థీకరణకు నిర్ణయం

క్షేత్రస్థాయిలో వస్తున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం, రోడ్లు, భవనాల శాఖను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో అధికారి 2000-2500 కిలోమీటర్లకు పైగా రహదారులను పర్యవేక్షించాల్సి వస్తున్నది. పర్యవేక్షణలో ఇబ్బందులు ఏర్పడడం, రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసే అధికారం క్షేత్రస్థాయి అధికారులకు లేకపోవడం వంటి సమస్యలను అధిగమించేందుకు అధికారులు రూపొందించిన ముసాయిదాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కొత్తగా 3 చీఫ్ ఇంజినీర్ కార్యాలయాలు

కొత్తగా 3 చీఫ్ ఇంజినీర్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటే 10 సర్కిళ్లు, 13 డివిజన్లు, 79 సబ్ డివిజన్లు, 124 సెక్షన్ కార్యాలయాలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా ఒక సర్కిల్, మూడు డివిజన్లు, 15 సబ్ డివిజన్లు, 96 సెక్షన్ కార్యాలయాలను ఇతర చోట్లకు మార్చనున్నది. మూడు కొత్త చీఫ్ ఇంజినీర్ కార్యాలయాల్లో ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు (టెరిటోరియల్), ఒక చీఫ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) ఉంటారు. మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, వరంగల్, నిజామాబాద్‌లో పది కొత్త సర్కిల్ కార్యాలయాలు రానున్నాయి. ములుగు, గజ్వేల్, భద్రాచలం, మిర్యాలగూడ, నారాయణపేట, నిజామాబాద్, వరంగల్, జనగాం, మహబూబ్ నగర్, సిద్దిపేటలలో కొత్త డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. కాగా, ఈ కొత్త కార్యాలయాలు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి.

Advertisement

Next Story