మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వెనుక విద్రోహచర్య.. కొత్త కోణం వెలుగులోకి..

by Javid Pasha |
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం వెనుక విద్రోహచర్య.. కొత్త కోణం వెలుగులోకి..
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీ కింద ఉన్న పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయన్న దానిపై రకరకాల వ్యాఖ్యానాలు, విమర్శలు వస్తున్న సమయంలో పోలీసులకు అందిన ఫిర్యాదులో మాత్రం అది విద్రోహచర్యేనన్న అనుమానం వ్యక్తమైంది. కొన్న అసాంఘిక శక్తులు ప్రభుత్వానికి చెందిన ఈ బ్యారేజీకి నష్టం కలిగించారని ఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న అసిస్టింట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవికాంత్ పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మహదేవ్‌పూర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌కు ఆదివారం ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదులో పై అనుమానాన్ని వ్యక్తం చేశారు. భారీ శబ్దం వచ్చేంతవరకూ బ్యారేజీ బ్రిడ్జిమీద వాహనాల రాకపోకలు యధావిధిగానే జరిగాయని స్పష్టం చేశారు.

బ్యారేజీ కింద ఉన్న పిల్లర్లు కుంగిపోడానికి కారణం సంఘ వ్యతిరేక శక్తుల విద్రోహ చర్యేనన్న అనుమానాన్ని వ్యక్తం చేయడంతో నిర్మాణంలో లోపం కాదనే మెసేజ్ వెలువడినట్లయింది. విపక్షాలన్నీ నిర్మాణ లోపం, నాణ్యత లేకపోవడం, మానవ తప్పిదం, ఇంజనీరింగ్ డిజైన్‌లోనే పొరపాటు ఉండడం.. ఇలాంటి విమర్శలు వస్తున్న సమయంలో పోలీసులకు ఏఈఈ స్టేట్‌మెంట్ ఆసక్తికరంగా మారింది. కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో ఆరుగురు నిపుణుల బృందం అధ్యయనం చేస్తున్న సమయంలో ఈ ఫిర్యాదు, దీని ఆధారంగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వెలుగులోకి రావడం గమనార్హం.

డ్యూటీలో ఉన్నప్పుడే శనివారం సాయంత్రం 6.20 గంటలకు భారీ శబ్దం వచ్చిందని, ఆ వెంటనే ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన ఫోర్‌మాన్ బిద్యుత్ దేబ్‌నాధ్‌తో కలిసి ఘటనా స్థలం దగ్గరికి వెళ్ళి చూశామని, ఏడవ నెంబర్ బ్లాక్‌లో 19-21 పిల్లర్ల మధ్య ప్రాంతంలో బ్యారేజీ మీద ఉన్న రోడ్డు బ్రిడ్జి శ్లాబ్, పిట్టగూడ కుంగిపోయినట్లు గమనించామని, ఇది మహారాష్ట్ర సరిహద్దువైపు చోటుచేసుకున్నదని ఆ ఫిర్యాదులో రవికాంత్ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 427, పబ్లిక్ ప్రాపర్టీ విధ్వంస నిరోధక చట్టంలోని సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

విద్రోహ చర్య ఉంటుందనే కారణాన్ని ప్రభుత్వం తెరమీదకు తెస్తుందంటూ ముందుగానే విపక్షాలు గ్రహించాయి. మానవ తప్పిదమనే అపవాదు నుంచి తప్పించుకోడానికి ఈ తరహా అంశాన్ని ప్రచారంలోకి తెస్తుందన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశాయి. ఆ అనుమానాలకు తగినట్లుగానే ఇప్పుడు ఏఈఈ ఫిర్యాదులో, పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో అదే అంశం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులపైకి నెపం నెట్టే అవకాశం లేకపోలేదన్న ఊహాగానాలూ స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం.. జలశక్తి మంత్రిత్వశాఖకు సమర్పించే నివేదికలో ఎలాంటి అభిప్రాయాలను సూచిస్తుందనేది కీలకంగా మారింది.




Advertisement

Next Story