Ration Cards: కిక్కిరిపోతున్న మీ సేవ కేంద్రాలు.. కొత్త రేషన్ కార్డుల కోసం క్యూ కడుతోన్న జనం

by Shiva |   ( Updated:2025-02-12 01:51:39.0  )
Ration Cards: కిక్కిరిపోతున్న మీ సేవ కేంద్రాలు.. కొత్త రేషన్ కార్డుల కోసం క్యూ కడుతోన్న జనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లోని సభ్యుల వివరాల్లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో ‘మీ సేవా’ కేంద్రాల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. గత పదేండ్లుగా కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని గత పాలకులు ఇవ్వలేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, గ్రామసభలు, ప్రజావాణి ద్వారా కొత్త కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. అక్కడ అవకాశం దొరకని వారు ఇప్పడు దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రాలకు వస్తుండటంతో రద్దీ పెరిగింది.

మున్సిపాలిటీల్లోనే అత్యధిక జనాలు

గ్రామీణ, మండలాల్లో కన్నా మున్సిపాలిటీల్లోనే జనాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి నుంచి అప్లికేషన్ల కోసం వైబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. ప్రజాపాలన, కులగణన ద్వారా ఇప్పటికే 10.50 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక మార్పులు, చేర్పుల కోసం 26 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

గతంలో దరఖాస్తు చేసుకుంటే అవసరం లేదు

కొత్త రేషన్​కార్డుల కోసం గతంలో ప్రజాపాలన, కులగణన, ప్రజావాణి, గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్న ప్రజలు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన దాదాపు పూర్తయ్యిందని, త్వరలో డిజిటల్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే 4 రకాల డిజైన్లు సిద్ధం అయ్యాయని.. వాటిని ప్రభుత్వానికి చూపించిన తర్వాత ఫైనల్ అయిన కార్డులను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.

ఉగాదికి కొత్త కార్డుల పంపిణీ..!

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్​కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంతో పేదలకు న్యాయంగా అందాల్సిన పథకాలు అందలేదు. దీనికి తోడు వివిధ ప్రభుత్వ పథకాలకు రేషన్​కార్డును లింక్ చేయడంతో ఆరోగ్య శ్రీ, స్కాలర్​షిప్,​ఇతర పథకాలు అర్హులకు దూరమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్డులు ఇస్తామని ప్రకటించడంతో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజల్లో ఆశలు చిగురించాయి. అందుకే కొత్త కార్డుల కోసం జనాలు మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఉగాది పండుగ నాటికి కొత్త కార్డులను అందజేస్తామని పలు సందర్బాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు.

Next Story