విద్యాశాఖకు చేసింది గాడిద గుడ్డు.. సీఎంపై రాణిరుద్రమ ఫైర్

by Rajesh |
విద్యాశాఖకు చేసింది గాడిద గుడ్డు.. సీఎంపై రాణిరుద్రమ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఏమీ చేయలేదని, ఏదైనా చేసి ఉంటే గాడిద గుడ్డు మాత్రమే చేశాడని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ ఎద్దేవా చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో మద్యం శాఖకు మంత్రి ఉన్నారని, మరి విద్యాశాఖకు మంత్రి వద్దా అని ఆమె ప్రశ్నించారు. బడిబాట ఇప్పటికే మొదలైందని, కానీ ఈ శాఖకు రేవంత్ ఇంకా మంత్రిని నియమించలేదని మండిపడ్డారు. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, పుస్తకాలపై గత ముఖ్యమంత్రి, పాత విద్యాశాఖ మంత్రి పేర్లు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

విద్యార్థులు చూసి చెప్పే వరకు ఇవి బయటకు రాని పరిస్థితి ఉందని చురకలంటించారు. పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనేందుకు ఇది నిదర్శనమన్నారు. విద్యాశాఖ ఒక దిక్కు దివాన లేని శాఖలా మారిందని రుద్రమ మండిపడ్డారు. విద్యాశాఖకు మంత్రి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం రాగానే మద్యం శాఖకు మంత్రిని పెట్టారని, కానీ విద్యాశాఖ కు మాత్రం మంత్రిని నియమించలేదని ధ్వజమెత్తారు. వాస్తవానికి ప్రతి జిల్లాకు డీఈవో ఉండాలని, కానీ 26 జిల్లాలకు డీఈవోలే లేరని ఆమె ఘాటు విమర్శలు చేశారు. 62 డిప్యూటీ ఈవో పోస్టులకు ఒక్కరు కూడా డ్యూటీలో లేరని మండిపడ్డారు. 617 మండలాలకు ఎంఈవోలు ఉండాలని, కానీ కేవలం 17 మంది మాత్రమే ఎంఈవోలు ఉన్నారని, 598 మండలకు లేరని రాణిరుద్రమ పేర్కొన్నారు.

పాఠశాలలలో మరుగుదొడ్లు కడిగేందుకు స్కావెంజర్లు లేక దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల టీచర్ల పోస్టులు ఖాళీలుంటే నోటిఫికేషన్ ఇచ్చింది 11 వేల పోస్టులకే అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే అర్హులు ఎవరు లేరా అని రాణిరుద్రమ ప్రశ్నించారు. విద్యాశాఖను పర్యవేక్షణ చేసే సమయం లేనప్పుడు ఆ శాఖను సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఎందుకు పెట్టుకున్నట్లని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని రాణిరుద్రమ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed