- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనంతగిరి అందాలు చూడతరమా..?
దిశ ప్రతినిధి, వికారాబాద్ : హైదరాబాద్ మహానగరానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఎంతో అహ్లాదకరమైన పచ్చని ఔషధ మొక్కల నడుమ ఉన్న అనంతగిరి కొండలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి. వికారాబాద్ జిల్లా కేంద్రం నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలలో జీవితంలో ఒక్కసారైనా పర్యటించాలని, ఇక్కడి గాలిని కొన్నిగంటలు పీల్చుకున్న రోగాలు దరికి చేరవని నమ్మకంతో ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. శని, ఆదివారాలు అనంతగిరి కొండలు పర్యాటకుల సందడి నడుమ కళకళలాడుతుంటాయి. జింకలు ఎక్కువగా నివసించడం అనంతగిరి కొండల ప్రాముఖ్యత.
అందుకే అనంతగిరి కొండలపైకి వెళ్ళగానే ముందుగా జింక విగ్రహమే దర్శనం ఇస్తుంది. ఎంతో ఆకర్షణగా ఉండే ఈ జింక విగ్రహం దగ్గర పర్యాటకులు ఎంతో ఇష్టంగా ఫోటోలు దిగుతుంటారు. అనంతగిరి కొండలలో స్వయంభూగా వెలిసిన శ్రీ అనంతపద్మ నాభస్వామి దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకులు ముందుగా అనంతగిరి కొండలలో కొలువైన శ్రీ అనంతపద్మనాభ స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుండి కొంత దూరం వెళ్తే అనంతగిరి కొండల నడుమ మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. పర్యాటకులు అధికంగా ఫోటోలు దిగే ప్రదేశం ఇదే అని చెప్పాలి. అలాగే కోటిపల్లి ప్రాజెక్ట్ ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ ఇలా ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్న అనంతగిరి కొండలలో పర్యటిస్తే ఎలాంటి అనుభూతి పొందుతామో తెలుసుకుందామా.
హైదరాబాద్ కు కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే..
హైదరాబాద్ నుండి వికారాబాద్ అనంతగిరి కొండలకు రోడ్డు మార్గంలో రావాలంటే మెహిదీపట్నం నుండి చేవెళ్ల మీదగా వికారాబాద్, అనంతగిరి కొండల వరకు కేవలం 2 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. కూకట్ పల్లి, మియాపూర్, లింగంపల్లి ప్రాంతాలలో ఉండేవారు పఠాన్ చేరు మీదగా శంకరపల్లి, వికారాబాద్, అనంతగిరి కొండలకు కేవలం 1 గంట 30 నిమిషాల సమయంలోనే చేరుకోవచ్చు. అలాగే అనంతగిరి కొండలకు చేరాలంటే సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్ ల నుండి రైలు సౌకర్యం కూడా కలదు. ట్రైన్ లో అయితే వికారాబాద్ జెక్షన్ వరకు చేరుకొని అక్కడి నుండి అనంతగిరి కొండలకు వెళ్లాలంటే ఆటోలు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గంలో అయితే కేవలం 1 గంట వ్యవధిలోనే అనంతగిరి కొండలను చేరుకోవచ్చు.
ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న జింక విగ్రహం..
జింకలు ఎక్కువగా నివసించడం అనంతగిరి కొండల ప్రాముఖ్యత. అందుకే అనంతగిరి కొండలపైకి వెళ్ళగానే ముందుగా జింక విగ్రహమే దర్శనం ఇస్తుంది. ఎంతో ఆకర్షణగా ఉండే ఈ జింక విగ్రహం దగ్గర పర్యాటకులు ఎంతో ఇష్టంగా ఫోటోలు దిగుతుంటారు. ప్రపంచంలోనే అరుదైన జింక జాతులు ఇక్కడ అనేక నివసిస్తున్నాయి. అనంతగిరి అందాలను చూసే పర్యాటకులకు జింకలు దర్శనం ఇస్తుంటాయి. జింకలతోపాటు కొండ గొర్రెలు, సారంగులు, దుప్పులు ఇతర అనేక రకాల జంతువులతో పాటు ప్రపంచంలోనే అరుదైన పక్షి జాతులు అనంతగిరి కొండలకు ప్రధానాకర్షణ. వాటిని చూడడానికే కాక తమ కెమెరాల్లో బంధించడానికి అనేకమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.
శ్రీ అనంతపద్మ నాభస్వామి దర్శనం..
జింక విగ్రహం నుండి 0.5 కిలోమీటర్ దూరం వెళ్ళగానే శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం ఉంటుంది. అనంతగిరి కొండలలో స్వయంభూగా వెలిసిన శ్రీ అనంతపద్మనాభ స్వామి దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ దేవాలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర కలదు. అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకులు ముందుగా అనంతగిరి కొండలలో కొలువైన శ్రీ అనంతపద్మనాభ స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 7 గంటల వరకు అభిషేకం, ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారి దర్శనం, అర్చనలు నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 3 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల సమయం వరకు స్వామివారిని దర్శనం చేసుకునే సదుపాయం ఉంటుంది. ఇక్కడ స్వామివారి ప్రసాదంగా ఇచ్చే లడ్డు రూ.10, పులిహోర రూ.10 లకు ఇవ్వబడును.
అనంతగిరికి ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం..
శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం నుండి ఘాట్ రోడ్డులో ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే చూడచక్కనైన లోయలు దర్శనం ఇస్తాయి. లోయకు పై భాగంలో పెద్ద పెద్ద కొండలు దర్శనం ఇస్తాయి. ఆలా కొండలు చూస్తూ కొంత లోయ దిగగానే కుడిచేతి వైపున నంది విగ్రహం దర్శనం ఇస్తుంది.అనంతగిరి కొండల నడుమ మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం. ఈ విగ్రహాన్ని స్థానిక జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. అనంతగిరికి వచ్చే పర్యాటకులు ఎక్కువ సమయం గడిపి అధికంగా ఫోటోలు దిగే ప్రదేశం ఇదే అని చెప్పాలి. అక్కడే వాహనాల పార్కింగ్ సౌకర్యం కూడా కలదు. ఇక్కడ పార్కింగ్ కు బస్సు అయితే రూ.30, కారు రూ.20, బైక్ రూ.10 సాధారణ ఛార్జి మాత్రమే వాసులు చేస్తారు.
అందమైన కొండలు, మైమరిపించే వాటర్ ఫాల్స్..
వాహనాల పార్కింగ్ అనంతరం అనంతగిరి పచ్చని కొండల అందాలను వీక్షించాలనుకునే వారికి పెద్దలు అయితే రూ.20, పిల్లలకు రూ.10 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఒక టికెట్ కూడా ఇస్తారు. దాన్ని భద్రంగా దాచుకొని అనంతగిరి కొండలను వీక్షించడానికి వెళ్ళవచ్చు. రిజర్వ్ ఫారెస్ట్ అధికారుల అధీనంలో ఉన్న ఈ అడవిలో ఫారెస్ట్ అధికారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. 24 గంటలు ఫారెస్ట్ పోలీసులు కూడా అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి సమస్య తలెత్తినా, ఇతరులు ఇబ్బంది పెట్టిన వారికీ ఫిర్యాదు చేయవచ్చు. ఎంతో అహ్లాదకరమైన పచ్చని ఔషధ మొక్కల నడుమ ఉన్న అనంతగిరి కొండలలో సంజీవని జాతి చెందిన మొక్కలు కూడా ఉన్నాయని ప్రచారంలో ఉంది.
అడ్వెంచర్ చేయాలనుకునే వారికీ అనంతగిరి కొండలు మంచి ఉల్లాసాన్ని ఇస్తాయి. దాంతోపాటు ఇక్కడ మైమరిపించే వాటర్ ఫాల్స్ కూడా ఉండడం విశేషం. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చిన్నపిల్లలు, యువత చాల ఎంజాయ్ చేస్తుంటారు. కొండలలో ప్రమాదకరమైన జంతువులు లేకపోవడం, ఫారెస్ట్ అధికారులు, పోలీసుల నిఘా ఎప్పుడు ఉంటుంది. అధికారులు అనంతగిరి కొండలలో ఎక్కడి వరకు అయితే అనుమతులు ఇచ్చారో అక్కడ వరకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఆ పరిధిని మించి అడవిలోపలికి వెళ్లకూడదని నిబంధన ఉంది. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే ప్రాణాలకు ప్రమాదమే కాకా, పోలీసు కేసులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి.
యువతకు రిసార్ట్స్, అడ్వెంచర్ క్రీడలు..
అనంతగిరి కొండలను వీక్షించిన అనంతరం రిసార్ట్స్ లో స్టే చేయాలి అనుకునే పర్యాటకులకు అనంతగిరి కొండల పక్కనే ఉన్న హరివిల్లు రిసార్ట్స్ మొదటి ప్రాధాన్యతగా చెప్పవచ్చు. హరివిల్లు రిసార్ట్స్ పర్యాటకుల నుండి ఎక్కువ ఆదరణ పొందింది. శని ఆదివారాలలో ఈ రిసార్ట్స్ కి వేల మంది పర్యాటకులు వచ్చి వెళ్తుంటారు. ఈ రిసార్ట్స్ లో ఎంట్రీ కావాలంటే మాత్రం ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కపుల్స్ తో పాటు యువతకు, చిన్న పిల్లలకు అడ్వెంచర్ క్రీడలు కూడా నిర్వహిస్తుంటారు. శనివారం అనంతగిరి కొండలను వీక్షించిన అనంతరం సాయంత్రం 4 గంటల తరువాతే రిసార్ట్స్ లోపలి ఎంట్రీ ఉంటుంది. ఒక్కసారి లోపలి వెళ్తే మల్లి తిరికి ఆదివారం ఉదయం మాత్రమే బయటకు వదులుతారు. ఇక్కడ మనకు కావాల్సిన ఎంజాయ్మెంట్ తో పాటు అడ్వెంచర్, లైవ్ మ్యూజిక్ తో పాటు, మీరు ఆర్డర్ చేసినా ఫుడ్ ఐటమ్స్ ను అక్కడే లైవ్ లో వండి వడ్డిస్తారు. భారతదేశంలోని అత్యుత్తమ నైట్ క్యాంపెయిన్ సైట్ గా హరివిల్లు రిసార్ట్స్ ప్రసిద్ధి చెందింది.
నంది నోట్లో నుండి నిరంతరం పారే నీరు.. మూసీ నది జన్మస్థలం అయినా బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం విశిష్టత..
అనంతగిరి కొండలు దిగి తాండూర్ రోడ్డు మార్గంలో ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే కేరెల్లి అనే గ్రామం వస్తుంది. అక్కడి నుండి రైట్ తీసుకొని 5 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే ఎంతో చరిత్ర కలిగిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి కూడా ఒక ఘన చరిత్ర ఉంది. ఇక్కడి గుడ్డం దగ్గర నంది విగ్రహం నోట్లో నుండి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. హైదరాబాద్ వరకు ప్రవహించే మూసీ నది జన్మస్థానం కూడా ఇక్కడే మొదలైందని చరిత్ర చెబుతుంది. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొలువైన శివలింగానికి అభిషేకం, పూజలు నిర్వహించడం జరుగుతుంది.
పర్యాటకులను ఆకర్షిస్తున్న కోటిపల్లి ప్రాజెక్ట్, బోటింగ్..
రిసార్ట్స్ లో ఎంజాయ్ ఎందుకు ప్రకృతిని మరింత ఆస్వాదిద్దాం అనుకునే పర్యాటకులకు కోటిపల్లి ప్రాజెక్ట్ మరింత ఉత్సహాన్ని ఇస్తుంది. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర నుండి మున్నూరు సోమవారం మీదగా ఒక పది కిలోమీటర్ల దూరం వెళ్ళగానే కోటిపల్లి ప్రాజెక్ట్ దర్శనమిస్తుంది. ఇక్కడ అందంగా పారే అలుగులో పర్యాటకులు చాలా సందడిగా గడుపుతారు. అలుగు నీటిలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఎంజాయ్ చేస్తుంటారు. హైదరాబాద్ నుండి చాలా మంది పర్యాటకులు వారాంతంలో కేవలం కోటిపల్లి ప్రాజెక్ట్ దగ్గరకే వచ్చి వెళ్తుంటారు అంటే, దీనికి ఉన్న ఆదరణ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
ఈ అలుగు ఎక్కువ శాతం వర్షాకాలంలోనే ఉంటుంది. అలుగుతోపాటు బోటింగ్ ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ. సరదాగా బోటింగ్ చేయాలి అనుకునే పర్యాటకులకు అన్ని జాగ్రత్తల నడుమ బోటింగ్ చేయిస్తారు నిర్వాహకులు. ఇలా చెప్పుకుంటూ పోతే అనంతగిరి కొండల అందాలను ఆస్వాదిస్తూ మంచి వాతావరణంలో ఎంజాయ్ చేయాలి అనుకుంటే అనంతగిరి కొండలలో పర్యటించాల్సిందే.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజే అనంతగిరి కొండలకు బయలుదేరుదామా.