రూ.800 కోట్లు పక్కదారి..! ఫార్మా సిటీ భూసేకరణలో అవకతవకలు

by Shiva |
రూ.800 కోట్లు పక్కదారి..! ఫార్మా సిటీ భూసేకరణలో అవకతవకలు
X

దిశ, యాచారం: ఫార్మా సిటీ భూ సేకరణలో రూ.కోట్లు పక్కదారి పట్టినట్లుగా వచ్చిన ఆరోపణలపై ఇంటెలిజెన్స్‌, సీఐడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. యాచారం మండలం పరధిలోని నక్కర్త మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, గ్రామాల్లో 5 వేలకు పైగా రైతులకు చెందిన 7,640 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూములను అధికారులు సేకరించారు. తాటిపర్తి గ్రామంలోని సర్వే నంబర్.104లో ఉన్న 250 ఎకరాల భూధాన్ భూమిలో 168 ఎకరాల్లో 120 మంది స్థానికేతరులకు భూమి ఉన్నట్లుగా చూపారని.. అలా అక్రమార్కులకు అధికారులు రూ.వేల కోట్ల పరిహారం చెల్లించినట్లు అప్పట్లో తీవ్ర ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.

అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి. భూదాన్ భూములపై కోర్టులో కేసులు ఉండగానే నిబంధనలకు విరుద్ధంగా 168 ఎకరాలకు పరిహారం ఇవ్వడంపై సీఐడీ విచారణ చేపట్టింది. అదేవిధంగా ఫార్మా సిటీకి సంబంధించిన తహశీల్దార్ కార్యాలయంలోని భూ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఫార్మా సిటీకి భూములు ఇచ్చిన రైతులను ఆదుకోవడానికి మీర్‌ఖాన్‌పేట సమీపంలోని 600కు ఎకరాలపైగా భూమిలో అండర్ డ్రైనేజీ క్రీడా మైదానం, పాఠశాల, దేవాలయం అన్ని హంగులతో హెచ్ఎండీఏ నిర్మించ తలపెట్టిన లేఅవుట్‌లో ఒక ఎకం భూమి ఇచ్చిన రైతులకు 121 గజాల చొప్పున అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయించింది. స్థలాల పట్టాలను సైతం వారికి పంపిణీ చేశారు. అందులోనూ 168 ఎకరాల్లో పరిహారం పొందిన అక్రమార్కులకు ప్లాట్లను కేటాయించినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించి ఏరివేతకు సిద్ధమయ్యారు. దాదాపుగా రూ.800 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లుగా వెల్లడైంది. మరోవైపు సీఐడీ అధికారులు గోప్యంగా విచారిస్తుండడంతో అక్రమార్కుల గుండెల్లో ఏం జరుగుతుందోనని గుబులు మొదలైంది.

Next Story

Most Viewed