ఇళ్లు కట్టాలంటే కప్పం కట్టాల్సిందేనా.. ఉన్నతాధికారులకు ముడుపుల పేరిట వసూళ్లు

by Anjali |
ఇళ్లు కట్టాలంటే కప్పం కట్టాల్సిందేనా.. ఉన్నతాధికారులకు ముడుపుల పేరిట వసూళ్లు
X

దిశ, శేరిలింగంపల్లి: అక్రమ కట్టడాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యప్ప సొసైటీ. ఇక్కడ స్థలం ఉంటే చాలు ఎలాంటి అనుమతులు లేకున్నా ఎన్ని అంతస్థులైనా కట్టేసుకోవచ్చు. కానీ ఒక్క కండిషన్ ఆ ఇద్దరిని మాత్రం తప్పక చూసుకోవాల్సి ఉంటుంది. స్లాబ్ వేసిన ప్రతీసారి ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్క ఎక్కడ తప్పకుండా అనుకున్న సమయానికి చెల్లించాల్సిందే. కాదు కూడదు అంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి. వారికి కోపం తెప్పిస్తే ఉన్నతాధికారుల ఆదేశాలు అవసరం లేకుండానే బుల్డోజర్లు దిగిపోతాయి. ఇప్పుడు రాష్ట్రంలో హైడ్రాకు ఎంత పవర్ ఉందో వీరికి అంతకు మించిన పవర్ ఉంటుంది. వాళ్లలా వీరు నిర్మాణాలను కుప్ప కూల్చకపోయినా ఇళ్లకు బొక్కలు పెడతారు. ప్రతీ అంతస్థుకు 10 ×10 బొక్కలు పడిపోతాయి. అందుకే అయ్యప్పలో వారిద్దరు చెప్పిందే వేదం. ఏ బిల్డర్ అయినా వీరు చెప్పింది వినాల్సిందే. అంతలా అయ్యప్పను, గోకుల్ ప్లాట్స్‌ను శాసిస్తున్నారు ఆ ఇద్దరు.

అయ్యప్పలో వందలాది నిర్మాణాలు..

శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్‌లో గత కొన్నేళ్లుగా విచ్చలవిడిగా నూతన భవనాలు నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ సిండికేట్‌గా ఏర్పడిన కొంతమంది బిల్డర్స్ అయ్యప్ప సొసైటీ, సీజేఆర్ స్కూల్, సర్వే ఆఫ్ ఇండియా, ఖానామెట్‌లలో ఖాళీ స్థలం ఉంటే చాలు వీరు అక్కడ వాలిపోయి స్థల యజమానిని ఒప్పించి, అవసరం అయితే బెదిరించి అయినా డెవలప్‌మెంట్ పేరిట నిర్మాణాలు చేపడతారని తెలుస్తుంది. ఇందులో ఒకరిద్దరు బిల్డర్లు కీలక భూమికపోషిస్తున్నారు. అందులో ఓ బడా బిల్డర్‌గా చలామణి అవుతున్న వ్యక్తి గతంలో ఓ కాలేజీలో పనిచేసేవాడు. ఇప్పుడు ఆయన ఇక్కడ బడా బిల్డర్‌గా మారిపోయి అయ్యప్పను శాసిస్తున్నాడని సమాచారం.

ఆయన నిర్మాణాలు ఎక్కడా కూడా 6, 7 అంతస్థులకు ఏమాత్రం తగ్గవు. అయినా జీహెచ్ఎంసీ సిబ్బంది అమ్యామ్యాలకు అలవాటుపడి కిమ్మనరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనే కాకుండా మరికొందరు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. వీరంతా సిండికేట్‌గా ఏర్పడి అయ్యప్ప సొసైటీ, సీజేఆర్ స్కూల్, ఖానామెట్, సర్వే ఆఫ్ ఇండియాను గుత్త పట్టేశారని, వీరి కనుసన్నల్లో వందలాది నిర్మాణాలు సాగుతున్నట్టు తెలిసింది. నిర్మాణాలు ఆపాలని ఇటీవల శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా మరింత ఎక్కువగా కొత్త కట్టడాలు సాగుతుండటం గమనార్హం.

ఆ ఇద్దరిదే హవా..

చందానగర్ సర్కిల్ 21లో పనిచేస్తున్న ఇద్దరు కిందిస్థాయి పనితీరు అనునిత్యం చర్చనీయాంశంగానే ఉంటుంది. వీరికి జోనల్ కమిషనర్, డీసీ, టీపీఎస్ అధికారుల ఆదేశాలతో అవసరం ఉండదు. ఉన్నతాధికారుల మాటలను ఈ ఇద్దరు కనీసం లెక్కలోకి కూడా తీసుకోరట. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఏసీపీ ఎంత చెప్పినా వీరు వినే వారు కాదని జీహెచ్ఎంసీ సిబ్బందే చర్చించుకుంటారు. అందరినీ మేనేజ్ చేస్తామంటూ వీరు బిల్డర్ల దగ్గర గట్టిగా వసూళ్లు చేస్తారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇటీవల అయ్యప్ప సొసైటీలో ఒకే బిల్డర్ దాదాపు 10 వరకు నిర్మాణాలు చేపట్టాడు. ఆయన బిల్డింగ్ నిర్మాణాల సమయంలో ఒక్కో స్లాబ్‌కు చైన్మెన్లకు ఎంతెంత ఇచ్చారు. ఎక్కడెక్కడ కలిసి ఇచ్చారు అనేది బయటపెట్టారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలువురు బిల్డర్లు వీరిపై తీవ్రస్థాయిలో ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. అయినా వారెందుకో కానీ తీరు మార్చుకోవడం లేదు. అంతకంతకు రెచ్చిపోతున్నారు.

డైరెక్ట్ పెద్ద ఆయన దగ్గరకే..

మాదాపూర్, చందానగర్, హఫీజ్‌పేట్ డివిజన్లలో హవా చలాయిస్తున్న ఆ ఇద్దరు జీహెచ్ఎంసీ సిబ్బంది వ్యవహారంపై గతంలో ఇక్కడ పనిచేసిన జోనల్ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని చందానగర్ సర్కిల్ నుంచి వేరే చోటికి ట్రాన్స్‌ఫర్ చేసినా..ఎందుకో వారు మాత్రం ఇక్కడి నుంచి కదలలేదు. ఆమె వెళ్లిపోగానే యథాస్థానంలో తమపని తాము చేసుకుపోతున్నారు. ఉదయం డ్యూటీ ఎక్కినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు పైరవీలు, పైసల వసూళ్లతో బిజీబిజీగా ఉంటారని సమాచారం. వీరి వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎవరైనా సీరియస్ అయితే డైరెక్ట్‌గా రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ పెద్దాయన పేరు చెబుతారని, అధికారులే కాదు ఎమ్మెల్యే అంటే కూడా లెక్క చేయరని, ఏదున్నా ఆయన దగ్గర తేల్చుకుందామనే దోరణితో వ్యవహరిస్తున్నారని తెలిసింది. వీరి ఆగడాలకు ఇంకెప్పుడు తెరపడుతుందో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed