చేసిన పనులకు బిల్లులు ఇవ్వరా ?

by Sumithra |
చేసిన పనులకు బిల్లులు ఇవ్వరా ?
X

దిశ, తలకొండపల్లి : మండలంలోని దేవుని పడకల్ గ్రామ సమీపంలో సుమారు 40 ఎకరాల వైశాల్యంలో మహమ్మద్ ఖాన్ చెరువు ఉంది. అందులో సుమారు 28 ఎకరాల వైశాల్యంలో ప్రభుత్వ భూమి కూడా ఉంది. గత మూడు సంవత్సరాల క్రితం ఆగస్టు మాసంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సమయంలో మహమ్మద్ ఖాన్ చెరువుకట్ట భారీ వరదల ప్రవాహానికి నిండి తెగిపోయిన సంఘటన అప్పట్లో చోటుచేసుకుంది. మైనర్ ఇరిగేషన్ అధికారుల చొరవతో గ్రామస్తులు కొంతమంది పనులు చేయడానికి ముందుకొచ్చి తెగిపోయిన చెరువు కట్టకు నాలుగు నెలల వ్యవధిలోనే సుమారు మూడు లక్షలు ఖర్చుపెట్టి రింగు బాండ్ తో మరమ్మతులు చేశారు.

మరమ్మతులు చేసిన వెంటనే చెరువు మళ్లీ కళకళలాడింది. మరమ్మతులు చేసిన ఒక్కసంవత్సరం తర్వాత కూడా మళ్లీ అదే ఆగస్టు మాసంలో మరోసారి భారీ వర్షాలు రావడంతో చెరువు మళ్లీ నిండికుండలా మారి చెరువు కట్టపై భాగం నుండి నీళ్లు కిందికి ప్రవహిస్తూ, మరోసారి కట్ట తెగి ప్రమాదపు అంచుల్లోకి చేరింది. గ్రామస్తులు ప్రమాదాన్ని గ్రహించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మండల స్థాయి అధికార యంత్రాంగం, స్థానిక నేతల సాయంతో మరోసారి చెరువు కట్టను తెగిపోకుండా సుమారు ఒక లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసి నాలుగు రోజుల పాటు ఎంపీడీవో, తహసిల్దార్, స్థానిక ఎస్సై, ఇరిగేషన్ అధికారులు పూర్తిస్థాయిలో అక్కడే తిష్టవేసి చివరకు చెరువు కట్టను తెగిపోకుండా కాపాడారు. ఆ సమయంలో చెరువులోకి భారీగా పై నుండి వరద నీరు రాకుండా ఆ నీరును పక్కకు మళ్ళించి తెగే చెరువును కాపాడడంతో అధికారులను గ్రామ ప్రజాప్రతినిధులు సఫలీకృతమయ్యారు.

అప్పట్లో మండల ప్రజలు, గ్రామస్తులు అధికారులను మెచ్చుకున్నారు. కానీ నేటికీ చెరువు మరమ్మతుల కోసం సుమారు నాలుగు లక్షలకు పైగా ఖర్చు చేసి సంవత్సరాలు గడుస్తున్నా బిల్లులు అందకపోవడంతో అప్పుచేసి తెచ్చిన డబ్బులు మిత్తీలు మోయలేక తడిసి మోపెడు అయ్యాయని బాధితులు ఆవేదనకు గురవుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం అప్పు చేసి చెరువు పనులు చేస్తే, నేటికీ బిల్లుల అందకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీరుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల మంజూరు జాప్యం విషయంలో దిశ కల్వకుర్తి ఇరిగేషన్ ఈఈ శ్రీకాంత్ ను వివరణ కోరగా ఆన్లైన్లో ఓఎన్డిఎం నిధుల కింద అప్లోడ్ చేశామని, ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే వారివారి అకౌంట్లో నిధులు జమఅవుతాయని పేర్కొన్నారు. చెరువు కట్ట పూర్తిస్థాయి బలోపేతానికి 15 లక్షలతో శాంక్షన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని తెలిపారు.

పూర్తిస్థాయిలో కట్ట బలోపేతం చేయాలని రైతుల కోరిక..

మరోసారి వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే మహమ్మద్ ఖాన్ చెరువు కట్ట తెగే ప్రమాదం ఉంది కనుక ఇప్పటికైనా స్థానిక అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని తాత్కాలిక పనులు కాకుండా పూర్తిస్థాయిలో చెరువుకట్ట పనులు చేపట్టాలని గ్రామస్తులు, ముదిరాజ్ సంఘం నాయకులు, రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ చెరువు కట్ట తెగిపోతే వందలాది మంది రైతుకుటుంబాలకు తీరనినష్టం జరుగుతుందని వారు ఆవేదనతో పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా మైనర్ ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని తాత్కాలిక పనులతో సరిపెట్టకుండా, పూర్తిస్థాయిలో బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నారు. మహమ్మద్ ఖాన్ చెరువు పూర్తిస్థాయిలో నీళ్లు నిండడం వల్ల చెరువు కింద ఉన్న వందలాది ఎకరాల వ్యవసాయ బావులు, బోరు బావులలో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. సుమారు వందలాది మంది రైతు కుటుంబాలకు మేలు జరిగింది.

Next Story

Most Viewed